భారీ వర్షాలతో అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-05-20T07:08:50+05:30 IST

త్రిపురాంతకంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. త్రిపురాంతకం నుంచి ఎర్రగొండపాలెం వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయాల సమీపంలో వాగు రోడ్డుపైకి వర్షపునీరు పొంగింది.

భారీ వర్షాలతో అస్తవ్యస్తం
త్రిపురాంతకం చెరువులోకి చేరిన వర్షపునీరు

త్రిపురాంతకంలో భారీ వర్షం

పలు ప్రాంతాలు జలమయం

ఇటీవలి వర్షాలతో దెబ్బతిన్న రహదారులు

త్రిపురాంతకం, మే 19: త్రిపురాంతకంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. త్రిపురాంతకం నుంచి ఎర్రగొండపాలెం వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయాల సమీపంలో వాగు రోడ్డుపైకి వర్షపునీరు పొంగింది. దీంతో వాహనదారులు కొంతసేపు ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. త్రిపురాంతకం చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంతో పాటు మిట్టపాలెం, రామసముద్రం గ్రామాల పొలాల్లో కురిసిన వర్షానికి చుట్టు పక్కల వాగుల నుంచి త్రిపురాంతకం చెరువుకు నీరు చేరింది. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయం ప్రాంగణంలోకి వర్షపు నీరు చేరింది. త్రిపురాంతకం విద్యుత్‌ ఉపకేంద్రం, జడ్పీ పాఠశాల క్రీడా మైదానాలు పూర్తిగా జలమయమయ్యాయి. కాగా రైతులకు పొలాల్లో పంటలు కూడా ఏమీ లేకపోవడంతో నష్టం వాటిల్లలేదు. వర్షాలు కురిసిన గ్రామాల్లోని పొల్లాల్లో దుక్కి దున్నేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఎండలు మండుతున్న నేపథ్యంలో కురిసిన వర్షానికి ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై నిలిచిన మురికినీరు

గిద్దలూరు : పట్టణంలోని నరవ రోడ్డులోని కాశిరెడ్డికుంటలోని మురికినీరు రోడ్డుపైన నిలిచింది. దీంతో వాహనచోదకులు, పాదాచారులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఐదురోజుల రోజులక్రితం కురిసిన వర్షాల కారణంగా కాశిరెడ్డికుంటకు నీరు చేరుకుని అందులో ఉన్న మురికినీరంతా అలుగు ద్వారా బయటకు వచ్చింది. పక్కనే ఉన్న గిద్దలూరు-కొమరోలు రోడ్డుపైకి చేరంది. దీంతో పక్కనే ఉన్న చెత్తాచెదారం మురికినీటితో కలిసి ఆ నీరు పల్లపు ప్రాంతాలకు వెళ్లలేక రోడ్డుపైనే నిలిచిపోయింది. దాంతో ఈరోడ్డుపైన ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకులు, పాదాచారులు ఇక్కట్లకు గురవుతున్నారు. నాలుగు రోజుల నుంచి మురికినీరంతా అక్కడే నిలబడడంతో దుర్వాసన వస్తోంది. ఈ విషయం గురించి మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు  వినియోగదారుల పరిరక్షణ సేవామండలి అధ్యక్షులు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు  తెలిపారు. 

రహదారిపై చేరిన మురుగునీరు

బేస్తవారపేట : బేస్తవారపేటలోని బీసీ కాలనీలో ప్రధానరోడ్డులో, శ్రీచౌడేశ్వరీదేవి అమ్మవారి వీధిలో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి వర్షపునీరు నిల్వలేకుండా, కాలువలు ఏర్పాటు చేసి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు

రాచర్ల : మండలంలోని గౌతవరం గ్రామంలో అనుమలవీడుకు వెళ్లే రహదారి కోతకు గురైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చింది. దీంతో గౌతవరం గ్రామసమీపాన ఆర్‌అండ్‌బీ రోడ్డు కోతకు గురైంది. ప్రతిరోజు ఈ రహదారి నుంచి అనుమలవీడు, గుడిమెట్ట, దద్దవాడ గ్రామాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-20T07:08:50+05:30 IST