‘చాపరాయి’ టెండర్‌ రూ.30.03 లక్షలు

ABN , First Publish Date - 2022-01-20T06:12:50+05:30 IST

మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ‘చాపరాయి జలవిహారి’ ప్రవేశ రుసుం టెండర్‌ రూ.30.03 లక్షలకు ఖరారైంది.

‘చాపరాయి’ టెండర్‌ రూ.30.03 లక్షలు
చాపరాయి జలపాతం (ఫైల్‌ ఫొటో)

గత ఏడాదికన్నా రూ.3 వేలు మాత్రమే అధికం

ఆదాయానికి తగిన అభివృద్ధి లేదని స్థానిక నేతల ఆరోపణ


డుంబ్రిగుడ, జనవరి 19: మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన ‘చాపరాయి జలవిహారి’ ప్రవేశ రుసుం టెండర్‌ రూ.30.03 లక్షలకు ఖరారైంది.  బుధవారం పాడేరు సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వేలంపాట టెండర్‌ నిర్వహించారు. మొత్తం 91 మంది దరఖాస్తు చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన కమ్మిడి భాస్కరరావు  అందరికన్నా ఎక్కువగా రూ.30.03 లక్షలకు కోట్‌ చేసి దక్కించుకున్నారు. గత ఏడాదికన్నా కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే పెరిగింది. 


ఆదాయానికి తగిన అభివృద్ధి లేదు

ఇదిలావుండగా టెండర్‌ ప్రక్రియకు ముందు పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ, చాపరాయి అభివృద్ధికి ఖర్చు చేస్తున్న నిధులకు, చేసిన పనులకు పొంతన వుండడంలేదని ఆరోపించారు. చాపరాయి వేలంపాట ద్వారా వచ్చిన నిధులను పంచాయతీ ఖాతాలోగానీ లేదా చాపరాయి అభివృద్ధి కమిటీ పేరున బ్యాంకు ఖాతాలోగానీ వుంచాలని డిమాండ్‌ చేశారు. చాపరాయి వద్ద పారిశుధ్య సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను నియమించాలని కోరారు. ఈ విషయాలను పరిశీలిస్తానని సబ్‌కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.జయప్రకాశ్‌, పోతంగి పంచాయతీ సర్పంచ్‌ వంతల వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.


డుంబ్రిగుడలో సంతకు అనుమతివ్వాలి

మండల కేంద్రం డుంబ్రిగుడలో వారపు సంత నిర్వహణకు అనుమతులివ్వాలని పోతంగి సర్పంచ్‌ వంతల వెంకటరావు, ఉపసర్పంచ్‌ చెట్టి జగ్గునాయుడు బుధవారం ఇక్కడకు వచ్చిన పాడేరు సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌కు వినతిపత్రం అందించారు. ఇక్కడ వారపు సంత లేకపోవడంతో పలుగ్రామాల గిరిజనులు అరకు లేదా కించుమండ వెళ్లాల్సి వస్తున్నదని తెలిపారు. 


Updated Date - 2022-01-20T06:12:50+05:30 IST