పాత్రలే నాకు స్ఫూర్తి!

ABN , First Publish Date - 2022-05-23T07:20:17+05:30 IST

‘‘నాకు మొదటి నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ మీద ఆసక్తి. కానీ ఇలా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవుతానని అస్సలు అనుకోలేదు.

పాత్రలే నాకు స్ఫూర్తి!

అనుకోని అవకాశం ఆమెను కాస్ట్యూమ్‌ డిజైనర్‌ను చేసింది. 

సృజనకు రెక్కలు తొడిగి... వరుస సినిమాలతో బిజీగా మారింది. 

‘గూఢచారి’తో మొదలుపెట్టి... నేటి ‘మేజర్‌’ వరకు... పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవతరం కాస్ట్యూమ్‌ డిజైనర్‌... రేఖ. ‘నవ్య’తో ఆమె పంచుకున్న అనుభవాలివి... 


‘‘నాకు మొదటి నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ మీద ఆసక్తి. కానీ ఇలా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అవుతానని అస్సలు అనుకోలేదు. అంతా చిత్రంగా జరిగిపోయింది. మా అమ్మా వాళ్లది గుంటూరు. నాన్నది ఖమ్మం. నేను పుట్టక ముందే హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. నా చదువంతా ఇక్కడే. పీజీ అయిపోయాక డిజైనింగ్‌కు సంబంధించి ఏంచేద్దామనుకున్నప్పుడు బొటిక్‌ ఆలోచన వచ్చింది. అంతకుముందు లకోటియా కాలేజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో కోర్సు ఒకటి చేశాను. బేసిక్స్‌ నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే బొటిక్‌ పెట్టి, దాని తరుఫున వర్క్‌షాప్‌ నిర్వహించాను. అప్పుడు ఎవరో ఫొటోగ్రాఫర్‌ చెబితే... ఇందు అని సహాయ నటి నా దగ్గరకు వచ్చింది. తన ఫొటో షూట్‌కి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేయమని అడిగింది. అదే సమయంలో ‘గూఢచారి’ చిత్రం ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నుంచి తనకు ఫోన్‌ వచ్చింది... ‘నాకు ఒక డిజైనర్‌ కావాల’ని. తను తడుముకోకుండా వెంటనే నా ఫోన్‌ నంబర్‌ ఆయనకు ఇచ్చేసింది. వెళితే నన్ను ఓకే చేసేశారు. 


నేర్చుకొంటూ... 

నాకు గతంలో సినిమాలకు పని చేసిన అనుభవమే లేదు. అక్కడ వర్కింగ్‌ స్టయిల్‌ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ‘చేస్తావా’ అంటే ‘చేస్తాన’న్నాను. ‘నేర్చుకొంటావా’ అంటే ‘సరే’నన్నాను. దానికి తగినట్టుగానే కష్టపడ్డాను. పని చేస్తూనే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అలా నాలుగేళ్ల కిందట కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా నా జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలైంది. విశేషమేంటంటే... ఇప్పటికీ ఇందూకు నేను డ్రెస్‌లు డిజైన్‌ చేయలేదు. తన ఫొటో షూటూ జరగలేదు. నేను మాత్రం కాస్ట్యూమ్‌ డిజైనర్‌ని అయిపోయాను. ప్రస్తుతానికి నేను సినిమాలకే చేస్తున్నాను. సాధారణంగా పర్సనల్‌ స్టయిలింగ్‌ చేయను... ఒక్క అడివి శేష్‌ గారికి తప్ప. 


వద్దన్నా వినలేదు... 

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వైపు వెళతానంటే మా అమ్మ వద్దంటే వద్దంది. ఎందుకంటే నేను మొదటి నుంచి చదువులో టాప్‌లో ఉండేదాన్ని. దానికితోడు అమ్మ విద్యావేత్త. నర్సింగ్‌ కాలేజీలు నడిపిస్తోంది. ‘నేనేమో ఉన్నత చదువులు చదవాలని అందరికీ చెబుతుంటే... నువ్వు ఇలా డ్రెస్‌లు కుట్టుకుంటానంటావేంటి’ అని అమ్మ నచ్చచెప్పడానికి చూసేది. ‘ఈ కోర్సులు నీలాంటి మెరిట్‌ స్టూడెంట్స్‌కి కాద’ని అనేది. ఆమె ఆకాంక్షకు తగ్గట్టు బానే చదువుకున్నాను కానీ... నాకేమో ఎప్పుడూ క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని ఉండేది. ఇప్పటికీ అమ్మ అంటుంటుంది... ‘ఎంత చెప్పినా నువ్వు అనుకున్నదే చేశావుగా’ అని! నా నిర్ణయానికి అప్పట్లో మా స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు వాళ్లే నన్ను అభినందిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. 


‘మేజర్‌’ ఎక్స్‌పీరియన్స్‌...  

ఒక్కసారి ఈ రంగంలోకి అడుగుపెట్టాక వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇప్పటి వరకు పది సినిమాలకు పైనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేశాను. వాటిల్లో శేష్‌ గారివే మూడు చిత్రాలున్నాయి. అవి కాకుండా ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమాతో పాటు ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’, ‘గాలివాన’ వెబ్‌సిరీ్‌సలు చేశాను. ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’కి నాకు మంచి పేరొచ్చింది. ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ‘మేజర్‌’ చిత్రానికి కాస్ట్యూమ్స్‌ ఎంపిక, డిజైనింగ్‌... అన్నీ నేనే. ఇప్పటివరకు చేసినవాటితో పోలిస్తే... ఈ సినిమాకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే ఇది బయోపిక్‌ కాబట్టి... కొంత పరిశోధన అవసరమైంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ముంబయి, బెంగళూరు పోలీస్‌... ఇలా అన్నీ పక్కాగా రావాలి కదా! అంతేకాదు... యుక్త వయస్కుడిగా, యువకుడిగా, పరిణతి చెందిన వ్యక్తిగా... శేష్‌ గారి ట్రాన్స్‌ఫర్మేషన్‌కు తగ్గ మార్పులు చేసుకొంటూ వెళ్లాల్సి వచ్చింది. అయితే ఎంత కష్టపడ్డానో అంతగా ఆస్వాదించాను. ప్రతిరోజూ ఏదోఒకటి... కొత్త విషయం నేర్చుకున్నాను. 


సౌకర్యానికే ప్రాధాన్యం... 

గతంతో పోలిస్తే ఫ్యాషన్‌పై నేటి తరం ఆలోచన విధానం మారిందనిపిస్తుంది. ఇదివరకు అందంగా కనిపించాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కంఫర్ట్‌, ఈజ్‌ కూడా చూసుకొంటున్నారు. నటుల్లోనూ ఆ మార్పు గమనిస్తున్నాను. అందం ఒక్కటే కాకుండా సౌకర్యంగా ఉన్నాయా లేదా అనేదీ వారు పట్టించుకొంటున్నారు. దానికితోడు అంతర్జాతీయ బ్రాండ్స్‌ అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. కరోనా తరువాత ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. కావల్సినంత ఖాళీ సమయం దొరకడంతో ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కరికీ ప్రపంచ ఫ్యాషన్‌ను గమనించే అవకాశం లభించింది. అవగాహన పెరిగింది. అభిరుచికి తగినవి ఎంచుకోగలుగుతున్నారు. అలాగే సినీ తారలు ధరించినలాంటివి సులువుగా అనుకరించేలా ఉంటే... ఆ ట్రెండ్‌నూ ఫాలో అవుతున్నారు. 


అదే ప్రత్యేకత... 

ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ‘ఏదో తెరపై అందంగా కనిపిస్తే సరిపోతుంది కదా’ అనే ఆలోచనతో కాకుండా... ఒక కేరెక్టర్‌ సైకాలజీ, దాని చుట్టూ పని చేయడం నాకు ఇష్టం. అంటే ఒక అంతర్ముఖుడి పాత్ర ఉందనుకోండి... దాన్నిబట్టి ప్యాటరన్స్‌, డిజైన్స్‌ ఎంచుకొంటాను. అతడి ఆర్థిక, సామాజిక, విద్యకు తగిన కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తాను. అదే నా ప్రత్యేకత. డిజైనింగ్‌లో నాకు స్ఫూర్తినిచ్చేది పాత్ర, దాని స్వభావమే. అందుకే ముందుగా నిజ జీవితంలో నా చుట్టూ ఉన్న అలాంటి కేరెక్టర్లను పరిశీలిస్తాను. ఇక కాస్ట్యూమ్స్‌ కోసం ఎక్కువ శాతం చేనేతే ఉపయోగిస్తాను. ఎందుకంటే నేతన్నల కుటుంబంలో తరువాతి తరం కూడా ఈ కళను కొనసాగించాలంటే ఇప్పుడు మనం వారికి ఓ నమ్మకం ఇవ్వాలి కదా! అందుకు నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది.’’ 

హనుమా 


మాది ప్రేమ వివాహం. ఆయన ఆర్థోపెడిక్‌ సర్జన్‌. పేరు డాక్టర్‌ చంద్రకృష్ణ. మాకో బాబు. వాడికి రెండేళ్లు. టీవీలో పాటలు చూసి రాగాలు తీస్తుంటాడు.


సంతోషం... సంతృప్తి కోసం... 

నా సంతోషం కోసం, నా సంతృప్తి కోసం నేను ఎంచుకున్న మార్గం ఇది. నాకు గౌరవం ఇచ్చే చోట పని చేయాలనుకొంటాను. ఇప్పటివరకు నేను చేసిన ప్రాజెక్ట్‌లన్నిటిలో నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. పనిలో స్వేచ్ఛనిచ్చారు. మన కళకు, మన అభిప్రాయానికి విలువ ఇస్తున్నారా? నా వల్ల సినిమాకు ఎంత వరకు న్యాయం జరిగిందన్నదే నాకు ముఖ్యం. నా గత చిత్రం కంటే తరువాతి చిత్రం ఉత్తమంగా చేయాలనుకొంటాను. అంతకుమించి వేరే ఏవీ పట్టించుకోను. ఎవరితో పోటీ పెట్టుకోను. 


 మన తెలుగు చిత్ర పరిశ్రమలో అరవై నుంచి డెబ్భై మంది కాస్ట్యూమ్‌ డిజైనర్లు ఉన్నారు. వారిలో మహిళలే ఎక్కువ. 

Updated Date - 2022-05-23T07:20:17+05:30 IST