ఎమ్మెల్సీ అనంతబాబుపై చార్జిషీట్‌

ABN , First Publish Date - 2022-08-19T07:37:20+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఎమ్మెల్సీ అనంతబాబుపై చార్జిషీట్‌

మాజీడ్రైవర్‌ హత్యకేసులో ఎట్టకేలకు నమోదు 

రాజమహేంద్రవరం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీసులు ఎట్టకేలకు చార్జిషీట్‌ దాఖలు చేశారు. మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉన్నారు. ఆయన రిమాండ్‌ ఈనెల 20వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ఆయన తరపున న్యాయవాదులు ఇప్పటికే రెండు దఫాలు బెయిల్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. మూడో బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అయినా..ఇంతవరకూ పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంపై అనేక విమర్శలు వచ్చాయి. బాధిత కుటుంబం తరపున ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం(సీఎల్‌ఏ) అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు ఈ కేసును వాదిస్తూ, నిందితుడికి బెయిల్‌ రాకుండా అడ్డుకోగలిగారు. కానీ రిమాండ్‌ విధించిన 90రోజుల వరకూ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయకపోతే నిందితుడికి ఆటోమేటిక్‌గా బెయిల్‌ మంజూరవుతుంది. 


ఈ నేపథ్యంలో పోలీసులు కావాలనే చార్జిషీట్‌ దాఖలు చేయకుండా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అనంతబాబు అరెస్టు కోసం గట్టిగా పోరాడిన దళిత, ప్రజాసంఘాలు.. చార్జిషీట్‌ వెంటనే వేయాలంటూ మరోసారి కాకినాడలో ఉద్యమించాయి. దీంతో అరెస్టుచేసిన 88 రోజుల తర్వాత పోలీసులు గురువారం రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలుచేశారు. దీనిని ప్రజా, న్యాయ విజయంగా ముప్పాళ్ల సుబ్బారావు అభివర్ణించారు. ఈ నేపథ్యంలో నిందితుడి తరపు న్యాయవాది మరోసారి వాయిదా ఇవ్వవలసిందిగా కోర్టును కోరగా, 22కు విచారణను వాయిదా వేశారు. కాగా, న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు ఈ చార్జిషీట్‌ను శనివారం పరిశీలించే అవకాశం ఉంది. అందులో అన్ని ఆధారాలకు సంబంధించిన పత్రాలు ఉంటే  కోర్టులో నంబర్‌ అవుతుంది. పోలీసులు ఏమాత్రం తప్పుగా సమర్పించినా చార్జిషీట్‌ను తిరస్కరించే అవకాశం ఉన్నట్టు న్యాయనిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-19T07:37:20+05:30 IST