Greater Hyderabad లో చార్జింగ్ స్టేషన్లు వచ్చేశాయ్..

ABN , First Publish Date - 2021-11-21T14:02:48+05:30 IST

పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ లక్ష్యంగా అందుబాటులోకి...

Greater Hyderabad లో చార్జింగ్ స్టేషన్లు వచ్చేశాయ్..

  • 14 ప్రాంతాల గుర్తింపు..  
  • సర్కారుకు జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు
  • టీఎస్‌- రెడ్కో సహకారం తీసుకోవాలని సూచన
  •  గతంలో 20 ఎలక్ర్టిక్‌ కార్ల అద్దెకు నిర్ణయం
  • ఆచరణకు నోచుకోని వైనం

హైదరాబాద్‌ సిటీ : పర్యావరణ పరిరక్షణ, సహజ వనరుల సంరక్షణ లక్ష్యంగా అందుబాటులోకి తీసుకురానున్న ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపడుతోంది. గ్రేటర్‌లో చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి 100కుపైగా ప్రాంతాలను గుర్తించింది. మొదటి విడతగా 14 చోట్ల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వానికి వివరాలు పంపగా టీఎస్‌ రెడ్కో సాంకేతిక సహకారంతో ముందుకెళ్లాలని సూచించింది. దీంతో ఫైల్‌ను టీఎస్‌ రెడ్కోకు పంపినట్టు జీహెచ్‌ఎంసీ ఎలక్ర్టికల్‌ విభాగం అధికారొకరు తెలిపారు. 


సౌకర్యాల కల్పన..

2030 నాటికి పూర్తిస్థాయిలో ఎలక్ర్టికల్‌ వాహనాలు అందుబాటులోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వినియోగం తగ్గించాలన్నది సర్కారు యోచన. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగానికి పౌరులు మొగ్గు చూపేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకూ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు.. అందుకు అవసరమైన సౌకర్యాలను ముందుగా కల్పించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 


చార్జింగ్‌ కీలకం..

ఎలక్ర్టిక్‌ వాహనాలకు చార్జింగ్‌ స్టేషన్లు కీలకం. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి నిర్ణీత కిలోమీటర్లు మాత్రమే వాహనం ప్రయాణిస్తుంది. చార్జింగ్‌ అయిపోతే తిరిగి ఇంధనం వినియోగించాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని నగరంలో విరివిగా చార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాహనాలు పార్కింగ్‌ చేసే చోటే ఈ స్టేషన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్కింగ్‌ ఏరియాలు, వాహనాలు నిలిపేందుకు అనువుగా ఉన్న ఖాళీ స్థలాల్లో చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.


గతంలో ఒప్పందానికే..

జీహెచ్‌ఎంసీలో ప్రయోగాత్మకంగా ఎలక్ర్టిక్‌ వాహనాలు వినియోగించే ప్రతిపాదన 2018లో తెరపైకి వచ్చింది. అధికారులకు అద్దె ప్రాతిపదికన ఎలక్ర్టిక్‌ వాహనాలు వాడాలని ఉన్నతాధికారులు భావించారు. సంస్థలో వివిధ విభాగాల అధికారులు ప్రస్తుతం 200కుపైగా అద్దె వాహనాలు (పెట్రోల్‌, డీజిల్‌) వాడుతున్నారు. ఒక్కో కారుకు నెలకు రూ.34 వేలు అద్దెగా చెల్లిస్తున్నారు. అద్దె భారం తగ్గించుకోవడంతో పాటు, పర్యావరణ ఉపయుక్తంగా ఉంటుందని ఎలక్ర్టిక్‌ కార్ల వినియోగానికి అధికారులు మొగ్గు చూపారు. మొదటి విడతగా 20 ఎలక్ర్టిక్‌ కార్లు అద్దెకు తీసుకునేందుకు ఎనర్జీ ఎఫిషియేన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎ్‌సఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ వాహనాన్ని కొన్నాళ్ల పాటు వాడి పరిశీలించారు. ఎలక్ర్టిక్‌ వాహనాలకు నెల అద్దె రూ.21500 చెల్లించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు.


ఎక్కడంటే..

ఇందిరాపార్కు 

కేబీఆర్‌ పార్క్‌ గేట్‌-1 

కేబీఆర్‌ పార్క్‌ గేట్‌- 3 

కేబీఆర్‌ పార్క్‌ గేట్‌ - 6 

ట్యాంక్‌బండ్‌ రోడ్‌ 

బషీర్‌బాగ్‌ రోడ్‌ 

గన్‌ఫౌండ్రీ 

మునిసిపల్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ ఆబిడ్స్‌ 

నానకర్‌రాంగూడ మహవీర్‌ హరిణ వనస్థలి జాతీయ పార్కు 

శిల్పారామం టు నాగోల్‌ బ్రిడ్జి 

ఉప్పల్‌ 

ఓవైసీ ఆస్పత్రి

తాజ్‌ త్రీ స్టార్‌ హోటల్‌


కార్లు, సామర్థ్యాల వివరాలివి...

కేటగిరీ
బ్యాటరీ సామర్థ్యం
ఓల్టేజీ
ద్విచక్రవాహనం
1.2 - 3.3 కేడబ్ల్యూహెచ్‌
48-72 వీ
ఆటో
3.6- 8  కేడబ్ల్యూహెచ్‌
48-60 వీ
కార్లు (1- జనరేషన్‌)
21  కేడబ్ల్యూహెచ్‌
72 వీ
కార్లు  (2 - జనరేషన్‌)
30-80 కేడబ్ల్యూహెచ్‌
350-500 వీ


Updated Date - 2021-11-21T14:02:48+05:30 IST