జగన్నాథుడి రథయాత్ర

ABN , First Publish Date - 2022-07-02T05:39:46+05:30 IST

జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్ని ఆలయాల్లోనూ భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షంపడినా లెక్కచేయకుండా దర్శనానికి క్యూ కట్టారు.

జగన్నాథుడి రథయాత్ర


వర్షంలోనూ స్వామిని దర్శించుకున్న భక్తులు

విజయనగరం రూరల్‌, జూలై 1:
జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అన్ని ఆలయాల్లోనూ భక్తులు విశేషంగా స్వామిని దర్శించుకున్నారు.  కొన్ని ప్రాంతాల్లో వర్షంపడినా లెక్కచేయకుండా దర్శనానికి క్యూ కట్టారు.
ఏటా ఆషాఢమాసంలో వచ్చే ఈ రథయాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తొలి రథయాత్ర నుంచి మారు రథయాత్ర వరకు స్వామి వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు శుక్రవారం స్వామి  ఊరేగింపు  కన్నుల పండువగా జరిగింది. జగన్నాథుడిని పురవీధుల్లో ఊరేగించారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, విశేష అర్చనలు, నైవేద్యం, నీరాజనం, మంగళాశాసనం, ప్రసాద వితరణ కార్యక్రమాలు 9 గంటల వరకూ జరిగాయి. ఉదయం 11 గంటలకు స్వామిని మేళతాళాలతో తీసుకొచ్చి రథారోహణ, రక్షబంధనం ప్రక్రియలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. నగరంలోని పురాతన ఆలయంలో ఒకటైన సంతపేట జగన్నాథస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు స్వామిని రథారోహణ చేసిన తరువాత భక్తులు రథంపై ఎక్కి దర్శించుకున్నారు. మండపంవీధిలోని మన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయం వద్ద జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మండపం సెంటర్లో స్వామి విగ్రహాలు రథంపై ఉంచి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఖమ్మవీధి జంక్షన్‌తో పాటు, కన్యకాపరమేశ్వరీ ఆలయం, కొత్తపేట మండపం జంక్షన్‌,  మూడు కోవెళ్లు జంక్షన్‌లు భక్తుల కోలాహలంతో కన్పించాయి. ట్రాఫిక్‌కు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జగన్నాథుని తొలి రథయాత్ర, మారు రథయాత్ర రోజున వర్షం పడుతుందన్నది భక్తుల నమ్మకం. ఆ సెంటిమెంట్‌ కొనసాగింపుగా శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి నగరంలో భారీ వర్షం కురవడం విశేషం. గజపతినగరం, బొబ్బిలి, ఎస్‌.కోట, గంట్యాడ, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లోనూ రథయాత్ర ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆధ్యాత్మిక శోభ కనిపించింది.  

జగన్నాథుని ఆలయం వద్ద నిరసన
దాసన్నపేటలోని పురాతన జగన్నాథస్వామి ఆలయం వద్దనున్న స్వామి వారి విగ్రహాలను మోటారు వాహనంపై తీసుకువెళ్లడాన్ని బీజేపీ తప్పు పట్టింది. ఆ పార్టీ నాయకులు కుసుమంచి సుబ్బారావు, కొండేల శ్రీనివాసరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు  దేవదాయ శాఖ అధికారుల తీరును  తీవ్రంగా ఎండగట్టారు.  ఆలయం బయట నిరసన చేపట్టారు. సనాతన సాంప్రదాయాన్ని పాటించాలని, స్వామిని రథంపైనే తీసుకువెళ్లాలని డిమాండ్‌ చేశారు. మారు రథయాత్ర సమయానికైనా స్వామి వారి రథాన్ని సిద్ధం చేయాలని కోరారు.
--------

Updated Date - 2022-07-02T05:39:46+05:30 IST