మేము సైతం!

ABN , First Publish Date - 2021-05-10T04:36:43+05:30 IST

కరోనా వైరస్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది..

మేము సైతం!
రాజాంలో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న స్వచ్ఛంద సంస్థల సభ్యులు (ఫైల్‌)

కరోనా బాధితుల సేవలో స్వచ్ఛంద సంస్థలు


(రాజాం రూరల్‌): కరోనా వైరస్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏడాదికిపైగా ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తూ.. అనుబంధాలను సైతం దూరం చేస్తోంది. మానవ సంబంధాలను మంట కలుపుతోంది. కరోనా లక్షణాలతో ఎవరైనా మరణిస్తే.. కుటంబ సభ్యులు సైతం దూరం నుంచి చూసి కన్నీరు పెట్టుకోవడం తప్ప దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మృతదేహాన్ని ముట్టుకుంటే వైరస్‌ సోకుతుందేమోనన్న భయంతో కర్మకాండలు చేయడానికి సైతం వెనుకాడాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అటువంటి భయంకరమైన పరిస్థితిలో కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. కష్టకాలంలో సేవలు అందించేందుకు ‘మేము సైతం’ అంటూ ముందుకు వస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ‘కొవిడ్‌’ భయాన్ని తొలగించి.. ధైర్యాన్ని నింపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజాంలోని ఆర్యవైశ్య సంఘం, రెడ్‌క్రాస్‌ శాఖ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ప్రతినిధులు కరోనా బాధితులకు విశిష్ట సేవలు అందజేస్తున్నారు. ప్రధానంగా ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు వారికి చేయూతనిస్తూ.. అండగా నిలుస్తున్నారు. కరోనా మృతదేహాలను శ్మశానవాటికకు తరలించేందుకు ఉచితంగా కైలాసరథం అందుబాటులో ఉంచారు. అక్కడ దహన సంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లను దగ్గరుండి చేస్తున్నారు. కరోనా వేళ కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్న ప్రస్తుత తరుణంలో అన్నీ తామై... అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 

- రాజాం సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు నిరంతరం మినరల్‌ వాటర్‌ బాటిళ్లను, బిస్కెట్‌ ప్యాకెట్లును అందజేస్తున్నారు. 

- ఆసుపత్రిలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని 15 మంది తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి ఆర్థికంగా చేయూతనిచ్చారు. ప్రస్తుతం వీరంతా కరోనా బాధితులకు నిరంతర సేవలందిస్తున్నారు. వీరికి టిఫిన్‌, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. 

- ప్రతిరోజూ రాత్రివేళ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సేదతీరుతున్న సుమారు 30 మందికి భోజన ప్యాకెట్లు అందజేస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో తగ్గేవరకూ తమ సేవలను ఇదే విధంగా కొనసాగిస్తామని సంఘ ప్రతినిధులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వీరి సేవలకు రెడ్‌క్రాస్‌ రాజాం శాఖ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, కొవిడ్‌ 19 రిలీఫ్‌ టీం సభ్యులు అండగా ఉంటున్నారు. 

Updated Date - 2021-05-10T04:36:43+05:30 IST