మునుగోడులో ‘చర్లగూడెం’ మంటలు

ABN , First Publish Date - 2022-09-30T07:01:19+05:30 IST

డిండి ఎత్తిపోతలలో భాగమైన శివన్నగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌, రైతులు ఆందోళనకు దిగటంతో గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మునుగోడులో ‘చర్లగూడెం’ మంటలు
చండూరు మండలం తాస్కానిగూడెం వద్ద రోడ్డుపై బైఠాయించిన నిర్వాసితులు

చండూరు, చండూరు రూరల్‌, మర్రిగూడ, మునుగోడు, సెప్టెంబరు 29: డిండి ఎత్తిపోతలలో భాగమైన శివన్నగూడెం రిజర్వాయర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌, రైతులు ఆందోళనకు దిగటంతో గురువారం మునుగోడు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట 29రోజులుగా నిర్వాసితులు నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవటంతో తెలంగాణ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మునుగోడు మండలకేంద్రంలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు శివన్నగూడెం భూనిర్వాసితులు చండూరు మీదుగా 200మంది ద్విచక్రవాహనాలతో పాటు రెండు డీసీఎం వాహనాలపై బయలుదేరారు. మునుగోడులో దీక్షలకు ఎలాంటి అనుమతి లేదని చండూరు శివారులోనే మునుగోడు, చండూరు పోలీసులు భూ నిర్వాసితులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా, వాహనాల తాళాలు లాక్కుని వాటిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు, పోలీ్‌సస్టేషన్‌ నుంచి ర్యాలీగా చండూరుచౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న రైతులను వారించే ప్రయత్నం చేశారు. రైతులు వినకపోవడంతో పోలీసులు, భూనిర్వాసితుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పగిల్ల నర్సింహ అనే రైతు సొమ్మసిల్లి పడిపోవటంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తూ చౌరస్తాలో గంటసేపు రాస్తారోకో అనంతరం ధర్నా చేపట్టారు. చండూరు మీదుగా మర్రిగూడకు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌  విషయం తెలుకుని ర్యాలీలో పాల్గొని అనంతరం చేపట్టిన ధర్నాలో వారికి మద్దతు తెలిపారు. ప్రాజెక్టు పనులు అడ్డుకున్న రైతులను బుల్డోజర్లతో తొక్కించి నిర్మాణం చేపడుతామన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని ఉప ఉన్నిక ప్రచారానికి వస్తే నిలదీయాలన్నారు. కార్యక్రమంలో కాం గ్రెస్‌ జిల్లా నాయకులు పన్నాల లింగయ్య, కల్లెట్ల మారయ్య, మం చుకొండ సంజయ్‌, శ్యామ్‌, ప్రజాసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు పాల్గొన్నారు

మునుగోడులో దీక్ష భగ్నం 

చర్లగూడెం రిజర్వాయర్‌ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మునుగోడులోని బీఆర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌ (టీఎ్‌సయూ) ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. దీక్ష చేపట్టిన నాయకులను ఒక గంటలోనే పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌ను తరలించారు. ఈ సందర్భంగా టీఎ్‌సయూ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి మాట్లాడుతూ నిర్వాసితుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న రైతులు, నేతలను బేషరతుగా విడుదల చేయాలని, బాధిత రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా ఆందోళనలు చేయవద్దంటూ ఇన్‌చార్జి సీఐ బాలస్వామి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవటంతో వారి ఆందోళనను అడ్డుకున్నారు. ఆ క్రమంలో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంజితో పాటు మొత్తం 12మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని సాయంత్రం విడుదల చేశారు. 



Updated Date - 2022-09-30T07:01:19+05:30 IST