మనవళ్లతో పొంగళ్లకు వస్తానంటివే....

ABN , First Publish Date - 2021-01-25T05:48:36+05:30 IST

చిన్నగోపవరంలో గ్రామస్తులంతా అంకాలమ్మకు పొంగళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇందుకోసం గ్రామస్తులు బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో గ్రామానికి చెందిన శ్రీరాములరెడ్డి, పార్వతమ్మ తమ కుమార్తె సుగుణ, అల్లుడు రామిరెడ్డిని కవలలైన మనవళ్లతో కలిసి గ్రామానికి రావాలని ఆహ్వానించారు.

మనవళ్లతో పొంగళ్లకు వస్తానంటివే....
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉమేష్‌కుమార్‌రెడ్డి

ఆర్టీసీ బస్సు రూపంలో వెంటాడిన మృత్యువు

తండ్రీ కొడుకు దుర్మరణం

తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన తల్లి

బ్రహ్మంగారిమఠం/గోపవరం, జనవరి 24: అంకాలమ్మకు పొంగళ్లు పెట్టుకుంటుంటే సంతోషంగా మనవళ్లతో వస్తానంటివే బిడ్డా.. వచ్చే ముందు అందరం బయలుదేరినామని చెబితివే.. అంతలోనే ఎంత ఘోరం జరిగిపోయేనే తల్లీ.. అంటూ ఓ మహిళబోరున విలపించడం స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. 

 చిన్నగోపవరంలో గ్రామస్తులంతా అంకాలమ్మకు పొంగళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇందుకోసం గ్రామస్తులు బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. ఈ నేపధ్యంలో గ్రామానికి చెందిన శ్రీరాములరెడ్డి, పార్వతమ్మ తమ కుమార్తె సుగుణ, అల్లుడు రామిరెడ్డిని కవలలైన మనవళ్లతో కలిసి గ్రామానికి రావాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు సుగుణ, భర్త రామిరెడ్డి, ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్ర వాహనంపై చిన్నగోపవరానికి బయల్దేరారు. బద్వేలు-మైదుకూరు రహదారిలోని బి.మఠం మండలం రేకలకుంట పంచాయతీ వాంపల్లె చెరువు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వారిని బ్రహ్మణి గోశాల నిర్వాహకుడు గొల్లపల్లె వెంకటస్వామి చికిత్స నిమిత్తం బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనలో కవలల్లో ఒకరైన ఉమేష్‌ (9) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, గొలుసుల రామిరెడ్డి(34) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుగుణ తీవ్ర గాయాలపాలై రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. మరో కుమారుడు హృదయ్‌ కుమార్‌రెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటనతో చిన్నగోపవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలంలో సుగుణ తల్లి పార్వతమ్మ రోధిస్తున్న రోదనలతో స్థానికులను కలచి వేసింది. గ్రామంలో ఎంతో ఉల్లాసంగా చేసుకోవాలనుకున్న పొంగళ్లు కార్యక్రమం బోసిపోయింది. మృతుడు రామిరెడ్డి వ్యవసాయంతో జీవనం సాగిస్తుండేవాడని తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బ్రహ్మంగారిమఠం ఎస్‌ఐ శ్రీనివాసులు  తెలిపారు.

Updated Date - 2021-01-25T05:48:36+05:30 IST