వైసీపీలో రెబెల్స్!

ABN , First Publish Date - 2021-02-12T06:03:28+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో దశలోనూ వైసీపీకి ఇంటిపోరు తప్పడం లేదు. తొలిదశలాగానే ఈసారీ రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. పార్టీ తరఫున అనేక పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఎవరికి వారు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులమంటూ ప్రచారం సాగిస్తున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులకు సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పరిణామం నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. పార్టీలో కష్టపడిన వారిని పక్కనపెట్టి.. కొత్తవారికి మద్దతు ఇవ్వడంపై వైసీపీ సీనియర్‌ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అగ్రనేతలు రంగంలోకి దిగి రెబల్స్‌తో మంతనాలు చేసినా ఫలితం లేకపోతోంది. గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చడం తలకుమించిన భారమవుతోంది.

వైసీపీలో రెబెల్స్!

రెండో దశలోనూ వెంటాడుతున్న ‘ఇంటి పోరు’

నేతల మాట వినని కేడర్‌

తొలిదశలో టీడీపీ పుంజుకోవడంపై మరింత ఆందోళన 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో దశలోనూ వైసీపీకి ఇంటిపోరు తప్పడం లేదు. తొలిదశలాగానే ఈసారీ రెబల్స్‌ బెడద వెంటాడుతోంది. పార్టీ తరఫున అనేక పంచాయతీల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఎవరికి వారు  గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులమంటూ ప్రచారం సాగిస్తున్నారు. దీంతో కొంతమంది అభ్యర్థులకు సొంత పార్టీ నుంచే గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పరిణామం నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. పార్టీలో కష్టపడిన వారిని పక్కనపెట్టి.. కొత్తవారికి మద్దతు ఇవ్వడంపై వైసీపీ సీనియర్‌ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అగ్రనేతలు రంగంలోకి దిగి రెబల్స్‌తో మంతనాలు చేసినా ఫలితం లేకపోతోంది. గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చడం తలకుమించిన భారమవుతోంది. 

ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, రాజాం, వంగర, సంతకవిటి మండలాల్లో ఈ నెల 13న రెండో విడత ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించనున్నారు. 278 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు, 2,716 వార్డు మెంబర్‌ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో 41 పంచాయతీలు, 1240 వార్డు మెంబర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 236 సర్పంచ్‌లు, 1,448 వార్డుమెంబర్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్‌ పదవులకు 611 మంది, వార్డు మెంబర్లకు 3,049 మంది బరిలో నిలిచారు. దాదాపు అన్ని పంచాయతీల్లోనూ వైసీపీకి రెబల్స్‌ ఉన్నారు. 

- పలాస మండలంలో 18 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనుండగా... 12 స్థానాల్లో వైసీపీకి ఇద్దరు ముగ్గురు చొప్పున నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. 

- మంత్రి సొంత మండలం వజ్రపుకొత్తూరు పరిధిలో 34 పంచాయతీలు ఉండగా... 19  చోట్ల వైసీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు నెలకొంది. మంత్రి సర్దిచెప్పినా వినకుండా రెబల్స్‌ బరిలో దిగారు. 

- మందస మండలంలోని 34 పంచాయతీల్లో 20 చోట్ల రెబల్స్‌ ఉన్నారు. 

- సోంపేట మండలంలో 23 పంచాయతీలకు 15 చోట్ల రెబల్స్‌ బరిలో నిలిచారు. కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో కూడా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. దీంతో వైసీపీకి ఎదురుగాలి తప్పేలా లేదు. తొలి విడత ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు అధికారంలో లేకపోయినా.. టీడీపీ కూడా అనూహ్యంగా పుంజుకుంది. అన్నిచోట్ల ఓటు బ్యాంకును పెంచుకుంది. మొదటిదశలో వైసీపీ కేడర్‌ మధ్య అంతర్గత విభేదాలే టీడీపీకి కలసి వచ్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రెండో విడత కూడా రెబల్స్‌ బెడద వెంటాడుతుండడం.. వైసీపీ వర్గీయుల్లో మరింత గుబులు పుట్టిస్తోంది.  

Updated Date - 2021-02-12T06:03:28+05:30 IST