తరుముకొస్తున్న థర్డ్‌వేవ్‌

ABN , First Publish Date - 2022-01-18T05:00:01+05:30 IST

కరోనాధర్డ్‌వేవ్‌ వేగంగా దూసుకొస్తుంది. ఉమ్మడి జిల్లాలో

తరుముకొస్తున్న థర్డ్‌వేవ్‌

  • ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 1,154 పాజిటివ్‌లు
  • రంగారెడ్డిలో అత్యధికంగా 916 పాజిటివ్‌ కేసులు
  • టీకా రెండు డోస్‌లు వేసుకున్నా వదలని మహమ్మారి
  • నిబంధనలు పాటించని జనం
  • కలెక్టరేట్‌లో కలకలం వైరస్‌
  • ఉద్యోగ సిబ్బందిని వదలని కరోనా
  • ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు


కరోనాధర్డ్‌వేవ్‌ వేగంగా దూసుకొస్తుంది. ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి పీడ విరగడైందని అనుకునే లోపే విరుచుకు పడుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారు సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికైనా నిబంధనలు పాటించకుంటే పెను ముప్పుగా మారే ప్రమాదం ఉంది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ / ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ ప్రతినిధి/ ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): కరోనా థర్డ్‌వేవ్‌ తరుముకొస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వైరస్‌ మహమ్మారి వదలడం లేదు. ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ తీసుకున్నా వైరస్‌ బారినపడి అల్లాడుతున్నారు. జీరో స్థాయికి వచ్చిన వైరస్‌ ప్రస్తుతం విజృంభిస్తుంది. రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ ఉమ్మడి జిల్లా ప్రజలను థర్డ్‌వేవ్‌ రూపంలో మళ్లీ వణికిస్తుంది. సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి కొంత తగ్గగానే ప్రజలు రిలాక్స్‌ అయ్యారు. ముఖానికి మాస్క్‌, కనీస భౌతికదూరం, శానిటైజేషన్‌ను గాలికి వది లేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో కనీస కొవిడ్‌ నిబంధనలు పాటించకపోగా.. రాజ కీయ పార్టీల సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్‌షోలు, పాద యాత్రలు, నిరసన కార్యక్రమాలు విచ్చలవిడిగా చేపట్టడంతో వైరస్‌ మరింత రెచ్చిపోయి తన ప్రతాపాన్ని చూపుతోంది. హోటళ్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కొవిడ్‌ టీకా రెండు డోస్‌లు తీసుకున్నవారికి సైతం పాజిటివ్‌ వస్తుంది. ప్రాణనష్టం లేకపోవడం కొంతవరకు ఉపశమనం. వ్యాక్సినే శ్రీరామరక్ష అని వైద్యులు అంటున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో టెస్టులు పెంచాల్సి ఉండగా తగ్గించేశారు. 


ఒక్కరోజే 1,154 పాజిటివ్‌లు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతోన్నాయి. సోమవారం ఒక్కరోజే ఉమ్మడిజిల్లాలో 1,154 పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 916 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 162, మేడ్చల్‌ జిల్లాలో 76 కేసులు నమోదయ్యాయి. 


శరవేగంగా

వికారాబాద్‌ జిల్లాలో కరోనా ఉధృతి అధికమైంది. చాపకింద నీరులా రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో సోమవారం ఒక్కరోజే 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 26 కేంద్రాల్లో 1,448 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 162 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు. తాండూరు నియోజకవర్గం పరిధిలో 463 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 71 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక్క తాండూరులో 60 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పెద్దేముల్‌లో 10, యాలాల్‌లో ఒక కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వికారాబాద్‌ నియోజకవర్గంలో 540 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌లో 32 మందికి పాజిటివ్‌ రాగా, సిద్దులూరు పీహెచ్‌సీ పరిధిలో 9, బంట్వారంలో ఒకరికి కరోనా వచ్చింది. పరిగి నియోజకవర్గం పరిధిలో 309 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 24 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. పరిగిలో 9, కులకచర్లలో 9, పూడూరులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. కొడంగల్‌ నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో 134 మందికి పరీక్షలు చేయగా, వారిలో 25 మందికి కరోనా పాజిటివ్‌ సోకింది. కొడంగల్‌లో 38 మందికి పరీక్షలు చేయగా, వారిలో ఏకంగా 16 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ రాగా, బొంరాస్‌పేట్‌లో 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. గడిచిన పది రోజుల్లో జిల్లాలో రోజురోజుకూ నమోదవుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యకు చేరుకుంది. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 162 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా ఉధృతి పెరగకుండా కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


కలెక్టరేట్‌లో కరోనా కలకలం

కలెక్టరేట్‌లో కొవిడ్‌ వైరస్‌ కలకలం రేపుతోంది. థర్డ్‌వేవ్‌లో భాగంగా పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకడంతో తోటి ఉద్యోగ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖలో ఓ అధికారితో పాటు మైనింగ్‌ శాఖలో ముగ్గురు, ఇతర శాఖలో ఒకరిద్దరు అధికార సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ను కలిసేందుకు వస్తున్న ప్రజలను లోపలికి అనుమతించడం లేదు. కలెక్టర్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఫిర్యాదు బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే బాక్స్‌లో వేయాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. 


మాస్క్‌ తప్పనిసరి

ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. మాస్క్‌ లేకుండా బయటకు రావొద్దు. శానిటైజర్‌ వినియోగించాలి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ నిబంధనలు పాలించాలి. భౌతిక దూరం తప్పనిసరి. ఎప్పటి కప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ప్రతి చోట శానిటైజర్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలి. జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. రెండు డోస్‌లు టీకా పూర్తయిన వారు నిబంధనల మేరకు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలి.

- డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి,రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి 


ధైర్యంగా ఉండండి .. 

మూడు రోజులు కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. భయం వద్దు.. అందరూ  దైర్యంగా ఉండండి. కరోనా వస్తే ఆసుపత్రిలో చేరండి. రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో కరోనా వచ్చిన వారిలో 95 శాతంగా రికవరీ అయ్యారు. జిల్లాలో మొదటి డోస్‌ కింద 26,12,003 మందికి, రెండో కింద 19,33,745 డోసులు, బూస్టర్‌ డోస్‌గా 10,167 మంది కరోనా వాక్సినేషన్‌ పూర్తి చేశాం. ఇప్పటి వరకు మొత్తంగా జిల్లాలో 45,55,915 మందికి కరోనా వాక్సిన్‌ పూర్తి చేశాం. 

-డాక్టర్‌ మల్లికార్జునరావు, మేడ్చల్‌ జిల్లా వైద్యాధికారి


రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య

మొత్తం కేసులు 1,14,803

జీహెచ్‌ఎంసీ పరిధిలో 62,208

నాన్‌జీహెచ్‌ఎంసీ పరిధిలో 52,595

యాక్టివ్‌ కేసుల వివరాలు

మొత్తం యాక్టివ్‌ కేసులు  4,350

జీహెచ్‌ఎంసీ 2,692

నాన్‌ జీహెచ్‌ఎంసీ 1,793


మృతులు

మృతుల సంఖ్య 253

జీహెచ్‌ఎంసీలో 145

నాన్‌జీహెచ్‌ఎంసీలో  108  


సేకరించిన శాంపిల్స్‌ 

మొత్తం శాంపిల్స్‌ 12,64,072

ఆర్‌టీపీసీఆర్‌ 1,17,262

ర్యాపిడ్‌ 11,46,135


రంగారెడ్డి జిల్లాలో సోమవారం వ్యాక్సినేషన్‌ వివరాలు

పీహెచ్‌సీల్లో వేసిన టీకాలు 2481

జీహెచ్‌ఎంసీల్లో 53

యుఎల్‌బి మొబైల్స్‌లో ప్రత్యేకంగా 143

స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా 1840

ప్రైవేట్‌గా వ్యాక్సినేషన్‌ 347

ఖాజాగూడలో స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా 184

15-18 సంవత్సరాల వారికి 842

ప్రికాశనరీ డోస్‌ 203


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నమోదైన కరోనా కేసులు 

రంగారెడ్డి : 916

(జీహెచ్‌ఎంసీ పరిధిలో : 470, నాన్‌ జీహెచ్‌ఎంసీ : 446)

వికారాబాద్‌  : 162

మేడ్చల్‌ : 76

మొత్తం : 1,154

Updated Date - 2022-01-18T05:00:01+05:30 IST