పేడ కొనుగోలుకు సిద్ధమైన ప్రభుత్వం.. కిలో రూ. 1.50!

ABN , First Publish Date - 2020-07-06T18:36:11+05:30 IST

ఆవు పేడ కొనుగోలు చేసేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు, పశుసంపద వృద్ధి చేసేందుకు ప్రారంభించిన గోధన్ న్యాయ్ పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పేడ కొనుగోలుకు సిద్ధమైన ప్రభుత్వం.. కిలో రూ. 1.50!

రాంచీ: రైతుల నుంచి ఆవు పేడ కొనుగోలు చేసేందుకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడంతో పాటూ పశుసంపదను వృద్ధి చేసేందుకు ప్రారంభించిన గోధన్ న్యాయ్ పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కిలో పేడ ధర రూ. 1.50గా నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా సేకరించిన పేడను వర్మీకంపోస్ట్ (సేంద్రియ ఎరువు) తయారీకి మళ్లీస్తారట. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతమవుతుందని సీఎం భూపేశ్ భాఘేల్ ఈ సందర్బంగా తెలిపారు. స్వయం సహాక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా ఓ కార్డు కూడా జారీ అవుతుందని, పేడ కోనుగోలు తేదీని ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు గ్రామాల్లో ప్రత్యేకంగా గోధన్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. నగరంలో పురపాలక సంఘాలు, ఇతర అటవీ శాఖ కమిటీలు వాటి వాటి పరిధిలో ఈ పథకం అమలును పర్యవేక్షించనున్నాయి. 

Updated Date - 2020-07-06T18:36:11+05:30 IST