చౌతాలాకు మరోసారి నాలుగేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-05-28T07:41:54+05:30 IST

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా (86)కు శుక్రవారం రెండోసారి జైలు శిక్ష పడింది.

చౌతాలాకు మరోసారి నాలుగేళ్ల జైలు

రూ.50 లక్షల జరిమానా.. నాలుగు ఆస్తుల జప్తు

స్పెషల్‌ కోర్టు తీర్పు.. తిహార్‌ జైలుకు తరలింపు

న్యూఢిల్లీ, మే 27: హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా (86)కు శుక్రవారం రెండోసారి జైలు శిక్ష పడింది. శిక్ష అమల్లో భాగంగా సాయంత్రమే ఆయనను తిహార్‌ జైలుకు తీసుకువచ్చారు. తెలిసిన ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో పాటుగా రూ.50 లక్షల జరిమానా కూడా వేసింది. ఇది చెల్లించకుంటే మరో ఆరు నెలలు పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. ఆయనకు చెందిన నాలుగు ఆస్తులను జప్తు చేయాలని కూడా ప్రత్యేక జడ్జి వికాస్‌ ధుల్‌ సంబంధిత ఆధికారులను ఆదేశించారు. 1993-2006 మధ్య ఆయన అక్రమంగా రూ.6 కోట్ల 9 లక్షలు సంపాదించారంటూ సీబీఐ కేసు పెట్టింది. తెలిసిన ఆదాయానికి మించి అదనంగా 189.11 శాతం మేర సంపాదించారని లెక్కకట్టింది. ఈ అదనపు సంపాదన ఏ మార్గాల్లో వచ్చిందన్నదానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని, అందువల్ల ఆయన నేరం చేసినట్టేనంటూ ఈనెల 21న న్యాయస్థానం ప్రకటించింది. సీబీఐ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపిస్తూ చౌతాలాకు గరిష్ఠ శిక్ష విధించి సమాజానికి సందేశం పంపించాలని కోరారు. ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణంలో తొలుత ఆయనకు పదేళ్ల శిక్ష పడిన విషయాన్ని గుర్తు చేశారు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆయనను తిహార్‌ జైలుకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రెండో నెంబరు జైలులో ఉంచనున్నారు. మరో ఇద్దరు ఖైదీలతో కలిపి ఆయనను సెల్‌లో పెట్టనున్నారు. అంతకుముందు కూడా ఆయనను ఇదే జైలులో పెట్టారు. శిక్ష పూర్తి చేసుకొని గత ఏడాది జులైలో విడుదలయ్యారు. కాగా, దర్యాప్తు ఖర్చుల కింద సీబీఐకి రూ.5 లక్షలు చెల్లించాలంటూ కోర్టు అసాధారణ ఉత్తర్వులు జారీ చేసింది.  

Updated Date - 2022-05-28T07:41:54+05:30 IST