పుసుపు కొంటారా.. కొనరా..!?

ABN , First Publish Date - 2021-06-13T05:43:27+05:30 IST

జిల్లాలో ఖాజీపేట, దువ్వూరు, మైదుకూరు, పోరుమామిళ్ల, రాజుపాలెం, రాజంపేట, సిద్దవటం తదితర మండలాల్లో పసుపు ఎక్కువగా సాగవుతుంది. పసుపు ఏడాది పంట. జిల్లా వ్యాప్తంగా 2020 ఖరీ్‌ఫలో 8,750 ఎకరాలలో పసుపు సాగు చేశారు.

పుసుపు కొంటారా.. కొనరా..!?
కడప మార్కెట్‌ యార్డుకు అమ్మకానికి వచ్చిన పసుపు దిగుబడులు

గతేడాది మద్దతు ధర రూ.6,850

ఈ ఏడాది ఇంకా ఏ నిర్ణయం తీసుకోని జగన ప్రభుత్వం

ఇళ్లలో మగ్గిపోతున్న పసుపు

మార్కెట్‌కు వెళితే అందని గిట్టుబాటు ధర

అప్పులోళ్ల ఒత్తిడితో వచ్చినకాడికి అమ్మేస్తున్న కష్టజీవులు


పసుపు ధరలు పతనమయ్యాయి. వ్యవసాయ మార్కెట్లో క్వింటా సగటున రూ.5 వేలు కూడా పలకడం లేదు. మద్దతు ధర ప్రకటించి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో పలువురు రైతులు ఇళ్లలో నిట్టు కాట్టారు. గతేడాది ఫిబ్రవరిలోనే క్వింటాకు రూ.6,850 మద్దతు ధర ప్రకటించి ఏప్రిల్‌లో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జూనలో అడుగు పెట్టినా పసుపు సేకరణపై వైఎస్‌ జగన ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొంటారా.. కొనరా..? రైతులను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఎక్కువ రోజులు ఇంట్లోనే నిల్వ చేస్తే పురుగు పట్టి నాణ్యత దెబ్బతింటుందని, అదే జరిగితే కొనేవారే ఉండరని అన్నదాతల ఆందోళన. కొందరు రైతులు అప్పులోళ్ల ఒత్తిడి తట్టుకోలేక వచ్చినకాడికి అమ్మేస్తున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖాజీపేట, దువ్వూరు, మైదుకూరు, పోరుమామిళ్ల, రాజుపాలెం, రాజంపేట, సిద్దవటం తదితర మండలాల్లో పసుపు ఎక్కువగా సాగవుతుంది. పసుపు ఏడాది పంట. జిల్లా వ్యాప్తంగా 2020 ఖరీ్‌ఫలో 8,750 ఎకరాలలో పసుపు సాగు చేశారు. గతేడాది నవంబరులో నివార్‌ తుఫాన కారణంగా కురిసిన అతిభారీ వర్షాలకు పసుపు పంట దెబ్బతింది. సాధారణంగా ఎకరాకు 28-30 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావాల్సి ఉంటే 8 నుంచి 12 క్వింటాళ్లు కూడా దిగుబడి రాలేదని రైతులు అంటున్నారు. దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్‌ పెరిగి.. ధర పెరుగుతుంది. కానీ పసుపు దిగుబడి తగ్గినా.. ధరలు పెరగకపోగా భారీగా పతనం అయ్యాయి. తాజాగా క్వింటా సగటున రూ.5 వేలు కూడా పలకడం లేదని అన్నదాతల ఆవేదన. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనమైతే ఆ సమయంలో ‘ధరల స్థిరీకరణ నిధి’ ద్వారా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని జగన ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. పసుపు సేకరణలో ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యమే.


ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ

పసుపు దిగుబడులు ఇళ్లలో నిట్టుకట్టిన రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 19న పసుపు మద్దతు ధర క్వింటాకు రూ.6,850 ప్రకటించి జీవో ఆర్టీ నెం.157 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆ తరువాత కొన్ని సవరణలతో మారో జీఓను మార్చి 31న ఇచ్చారు. ఏప్రిల్‌ నెలలో కొనుగోళ్లు చేపట్టారు. కరోనా సమయంలో రైతులు పసుపు దిగుబడులు కడప వ్యవసాయ మార్కెట్‌ యార్డు, మైదుకూరు, పోరుమామిళ్లలో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి మద్దతు ధరకు అమ్మారు. దాదాపుగా 50 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించారు. ఈ ఏడాది ప్రభుత్వం ఇప్పటికీ పసుపు సేకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా..? చేయడం లేదా..? అన్నదాతకు అంతుచిక్కని ప్రశ్న. అయితే.. జూన నెలలో బ్యాంకుల్లో పంట రుణం తీసుకున్న రైతులు 365 రోజుల్లోగా చెల్లించకపోతే వడ్డీ రాయితీ వర్తించదు. మరో పక్క అప్పులు కడతారా..? వడ్డీ లెక్కించి తరిగి ప్రామిసరి నోటు రాయిస్తారా..? అంటూ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఒత్తిడి తెస్తున్నారు. చేసేది లేక సగం మంది రైతులు కడప మార్కెట్లో వచ్చిన ధరకు అమ్మేసి అప్పులతోనే ఇల్లు చేరుకున్నారు.


ఆ నివేదిక వల్లేనా..?

గతేడాది నవంబరులో నివార్‌ తుఫానకు పసుపు పంట భారీగా దెబ్బతింది. దిగుబడి సగానికిపైగా తగ్గింది. పంటకోత సమయంలో క్వింటా రూ.6,500లకు పైగా ధర ఉందని, ముప్పాతిక శాతం మంది రైతులు అమ్మేసుకున్నారని, ప్రస్తుతం రైతుల వద్ద 10-20 శాతం కూడా దిగుబడులు లేవని ప్రభుత్వానికి స్థానిక అధికారులు నివేదిక ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ధర తగ్గినా.. కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేస్తే దుగ్గిరాళ్ల, గుంటూరు మార్కెట్లలో కూడా పంట కొనుగోళ్లు మొదలౌతాయి. ఆ తరువాత మళ్లీ ధర పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టలేదని సమాచారం. అంతేకాదు.. ఎక్కడ కూడా మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రభుత్వం కొనుగోళ్లు చేయాలని రైతుల నుంచి ఎలాంటి విన్నపాలు కూడా లేవని అధికారులు అంటున్నారు. అంటే.. ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టదా..? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. 


ఇప్పటికీ ఎలాంటి ఆదేశాలు రాలేదు

- నాగరాజు, జిల్లా మేనేజరు, ఏపీ మార్క్‌ఫెడ్‌, కడప

గత ఏడాది పసుపు మద్దతు ధర క్వింటా రూ.6,850 ప్రకారం ప్రభుత్వం ఆదేశాల మేరకు కొనుగోలు చేశాం. ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే కొనుగోలు చేపడతాం.

Updated Date - 2021-06-13T05:43:27+05:30 IST