ఫోన్లు చేసి రూ.170 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు.. ఒక్క అబద్ధం చెప్పి నమ్మించి భయపెట్టించి మరీ..

ABN , First Publish Date - 2022-07-16T20:52:24+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ప్రత్యేక దర్యాప్తు బృందం నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్‌ గుట్టు బయటపెట్టి 10 మందిని అరెస్టు చేసింది

ఫోన్లు చేసి రూ.170 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు.. ఒక్క అబద్ధం చెప్పి నమ్మించి భయపెట్టించి మరీ..

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ప్రత్యేక దర్యాప్తు బృందం నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్‌ గుట్టు బయటపెట్టి 10 మందిని అరెస్టు చేసింది. ఈ వ్యక్తులు విదేశీయుల ల్యాప్‌టాప్, కంప్యూటర్లలోకి వైరస్‌ను పంపించి రూ.170 కోట్లకు పైగా దోచుకున్నారు. నోయిడాలోని సెక్టార్-59లోని కాల్ సెంటర్‌పై శుక్రవారం దాడి చేసి ముఠా కింగ్‌పిన్‌తో సహా 10 మందిని అరెస్టు చేసినట్టు ఎస్‌టీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా, కెనడా, లెబనాన్, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి అనేక దేశాల ప్రజలను మోసం చేసినట్లు నిందితులు అంగీకరించారు.


ఇది కూడా చదవండి..

పోలీసుల సమక్షంలో ఊరందరి మధ్య ప్రేయసితో ఆ యువకుడికి పెళ్లి.. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే..


VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్)ని ఉపయోగించి నిందితులు ఘరానా మోసానికి పాల్పడుతున్నారు. ఇది వాట్సాప్ కాలింగ్ లాగా పనిచేస్తుంది. ఈ ఇంటర్నెట్ కాల్ ఎవరు, ఎక్కడ నుంచి చేస్తున్నారనేది అవతలి వారికి తెలియదు. కాల్ సెంటర్ నుంచి VoIP కాలింగ్ కోసం సర్వర్‌ను సెటప్ చేసుకుని విదేశీయులకు కాల్స్ చేసి వారి ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లకు వైరస్‌ను పంపిస్తారు. ఆ తర్వాత, సాంకేతిక సహకారం పేరుతో, ఆ వ్యక్తులకు ఫోన్ కాల్స్ చేసి ల్యాప్‌టాప్, కంప్యూటర్లలో వైరస్ ఉందని చెప్పి నమ్మిస్తారు. ఆన్‌లైన్ ద్వారా బాగు చేస్తామని చెప్పి వాటిలో ఉన్న ఆన్‌లైన్ ఖాతాలు లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగిలిస్తారు. ఆ తర్వాత ఆ ఖాతాల నుంచి అద్దెకు తీసుకున్న విదేశీ ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు.


ఆ విదేశీ ఖాతాలకు డబ్బు డాలర్లలో చేరేది. ఆ విదేశీ ఖాతాల ప్రొవైడర్ కొంత కమీషన్ తీసుకుని మిగిలిన డబ్బును ఇండియన్ కరెన్సీలో భారతదేశ అకౌంట్లలోకి బదిలీ చేసేవారు. ఈ పని మొత్తం చేసేందుకు నోయిడా కాల్ సెంటర్‌లో రోజూ యాభై మందికి పైగా పని చేసేవారని అధికారి తెలిపారు. నిందితుల నుంచి 12 మొబైల్‌లు, 76 డెస్క్‌టాప్‌లు, 81 సీపీయూలు, 56 VoIP డయలర్లు, 37 క్రెడిట్ కార్డులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-07-16T20:52:24+05:30 IST