మళ్లీ తనిఖీలట..!

ABN , First Publish Date - 2021-12-08T05:55:30+05:30 IST

చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలతో పాటు వాగులు, వంకలు, కాలువల నిర్వహణ ఏళ్ల తరబడి చేపట్టలేదు.

మళ్లీ తనిఖీలట..!

  1. నీరు-చెట్టు బిల్లులకు మెలిక
  2. జిల్లాలో రూ.650 కోట్ల బకాయిలు
  3. చెల్లించకుండా మొండికేస్తున్న ప్రభుత్వం
  4. తనిఖీలు, నివేదికల పేరిట జాప్యం
  5. టీడీపీ హయాంలో పనులు చేసినందుకే..!


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 30: చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలతో పాటు వాగులు, వంకలు, కాలువల నిర్వహణ ఏళ్ల తరబడి చేపట్టలేదు. దీంతో పూడిక చేరి, శిథిలావస్థకు చేరాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో వర్షపు నీరంతా వృథా అయ్యేది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నీరు-చెట్టు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చిన్ననీటి వనరుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందుకోసం రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. 2015-16 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకూ జిల్లాలో రూ.650 కోట్ల విలువ చేసే 5,500 పనులను చేశారు. వాస్తవానికి  వివిధ గ్రామాల నుంచి ఈ పనులకంటే రెట్టింపు సంఖ్యలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి. అయితే క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అవసరమున్న వాటినే నీరు-చెట్టు పథకం కింద ఎంపిక చేసి, ఆ పనులను పూర్తి చేశారు. వైసీపీ అధికారం చేపట్టాక ఈ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించడం లేదు. రెండున్నరేళ్లుగా చెల్లింపులను పెండింగ్‌లో పెట్టింది. మరోదారి లేక  పనులు చేసిన ప్రజాప్రతినిధులు, నీటి పారుదల సలహా సంఘాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వానికి బిల్లులను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాణ్యత లేదనే సాకుతో బిల్లులను పెండింగ్‌లోనే ఉంచేందుకు మళ్లీ వివిధ విభాగాల ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో వివిధ విభాగాల పరిధిలోని ఇంజనీర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం ప్రారంభించారు. గత 15 రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తనిఖీల కార్యక్రమం వాయిదా పడింది. వానలు నిలిచిపోతే ప్రత్యేక బృందాల తనిఖీ తిరిగి చేపడతామని చిన్ననీటి పనుల శాఖ ఎస్‌ఈ ఖబీర్‌ బాషా తెలిపారు. 


ప్రత్యేక బృందాల ఏర్పాటు 

జిల్లాలో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు పనులు 4 వేలకు పైగానే ఉంటాయి. ఈ పనులకు సంబంధించి రూ.400 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులన్నింటినీ తనిఖీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌అండ్‌బీ, పంచాయితీ రాజ్‌, ఆర్‌డబ్లూఎస్‌ శాఖల్లోని డీఈ, ఏఈ స్థాయి ఇంజనీరింగ్‌ అధికారుల వివరాలను జలవనరుల శాఖ సేకరించింది. ఒక్కో బృందంలో ఒక డీఈ, ఏఈ స్థాయి అధికారి, సిబ్బంది ఉంటారు. జిల్లాలో 50 నుంచి 60 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన పనుల మంజూరు మొదలుకుని ఫైనల్‌ బిల్లుల వరకు రికార్డులను పరిశీలిస్తాయి. క్షేత్ర స్థాయిలో పనులు జరిగాయా లేదా అని పరిశీలిస్తాయి. పనుల కొలతలు తీసి రికార్డుల్లో వివరాలతో సరిపోల్చి చూస్తారు. సమగ్ర పరిశీలన తరువాత పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తనిఖీ కోసం మూడు మాసాల సమయం ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక స్వల్పంగా చేసిన పనులను రద్దు చేశామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. మొత్తంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు నీరు-చెట్టు పనులు పెద్ద ఎత్తున చేపట్టారు. దీని వల్ల చెరువుల్లో పూర్తి స్థాయి నీరు నిల్వ చేయడానికి అవకాశం ఏర్పడింది. జిల్లాలో 540 చెరువులతో పాటు వాగులు, వంకలు, చెక్‌డ్యాంల పనులను భారీ ఎత్తున పూర్తి చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు పనులను నామినేషన పద్ధతిలో మంజూరు చేశారు. అంతకన్నా ఎక్కువ మొత్తం ఉన్న వాటిని జలవనరుల శాఖ అధికారులు టెండర్ల ద్వారా, సాగునీటి సంఘాల ద్వారా చేయించారు.


బిల్లుల నిలిపివేత

నీరు-చెట్టు పనుల వల్ల పంట కాల్వల పరిస్థితి మెరుగుపడింది. పైర్లకు  నీరు సక్రమంగా అందుతోంది. చెరువుకట్టలు పటిష్టం అయ్యాయి. తూము షట్టర్ల ఏర్పాటు, కాలువల్లో పూడిక తీత పనులు, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి పనులతో నీటి వృథా తగ్గింది. భూగర్బ జలాలు బాగా పెరిగాయి. ఈ పనులన్నీ జలవనరులశాఖ పర్యవేక్షణలో జరిగాయి. ఏఈ స్థాయి అధికారి పరిశీలించి ఎం-బుక్‌లో నమోదు చేశారు. డీఈ స్థాయిలో సగం పనులు, ఈఈ స్థాయిలో 30 శాతం పనులు పరిశీలించి బిల్లులకు ఆమోదం తెలిపారు. చెల్లింపులకు సిఫారసు చేశారు. ఆ తరువాత అధికారం మారడంతో బిల్లుల చెల్లింపు ఆగిపోయింది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జలవనరులు, ఉపాధి హామీ, మున్సిపల్‌ ఇలా అన్ని శాఖల్లోనూ పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు చేసిన వారు గత మూడేళ్లుగా అల్లాడిపోతున్నారు. 


హైకోర్టు అక్షింతలు

నీరు-చెట్టు పనుల బిల్లులను చెల్లించడం లేదని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సుమారు 5500 పనులకు సంబంధించి రూ.650 కోట్లు రావాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు జరిగినందున, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. పరిశీలించిన కోర్టు, వెంటనే పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం విజిలెన్స తనిఖీలు, ఇతర శాఖల పరిశీలనలు అంటూ రకరకాల మెలికలు పెట్టి జాప్యం చేస్తోంది. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉపాధి పనులకు సంబంధించి 80 శాతం బిల్లులను చెల్లించారు. దీంతో నీరు-చెట్టు పనులు చేసిన వారు కూడా తమకు బిల్లులు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించారు. 


వర్షాకాలంలో పరిశీలన ఎలా..?

ఫ నీటి వనరుల పనులు చేశాక, ఒక వర్షాకాలం గడిచిపోతే భౌతికంగా కనిపించేవీ చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది మూడేళ్ల తర్వాత, అదీ వర్షాలు కురిసే సమయంలో తనిఖీలు చేపట్టి నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో నీటి పారుదల శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చెక్‌డ్యాంలు, వాగులు, వంకలు, చెరువులలో ప్రస్తుతం  భారీగా నీరు చేరింది. కొన్ని చోట్ల భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో నాణ్యతను ఎలా నిర్ధారించాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తనిఖీలు వారం పది రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నా, మూడు మాసాల సమయం ఇచ్చారు. బిల్లుల చెల్లింపులో మరింత జాప్యం చేయడానికే ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 

- ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తనిఖీలకు ఇతర శాఖల ఇంజనీరింగ్‌ అధికారులతో బృందాలు ఏర్పాటు చేశామని మైనర్‌ ఇరిగేషన కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ఖబీర్‌ బాషాను తెలిపారు. పరిశీలన అనంతరం నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామని అన్నారు. ప్రభుత్వ వైఖరి కక్షసాధింపు చర్యగా కనిపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పనులు సక్రమంగా జరిగినట్లు జలవనరుల శాఖ అధికారులు నివేదికలు పంపినా, మళ్లీ ఇప్పుడు తనిఖీలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

నీరు-చెట్టు పనులపై విచారణ చేయిస్తాం 

జిల్లాలో గతంలో జరిగిన నీరు-చెట్టు పనులపై తనిఖీలకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్‌ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశాము. త్వరలోనే వారు గ్రామాలకు వెళ్లి పనులు జరిగిన తీరుపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. 

- కబీర్‌ బాషా, ఎస్‌ఈ 

Updated Date - 2021-12-08T05:55:30+05:30 IST