చైనా బడ్జెట్‌ ఫోన్లకు చెక్‌?

ABN , First Publish Date - 2022-08-09T05:50:57+05:30 IST

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను ఏలుతున్న చైనా కంపెనీలకు చెక్‌ పెట్టాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో రూ.12,000లోపు ధర కలిగిన బడ్జెట్‌

చైనా బడ్జెట్‌ ఫోన్లకు చెక్‌?

రూ.12,000 లోపు మొబైల్స్‌ నిషేధం యోచన 

షామీ, ఒప్పో, వివో, రియల్‌మీలకు షాక్‌

దేశీయ బ్రాండ్లకు అవకాశాలు పెంచే చర్య


న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను ఏలుతున్న చైనా కంపెనీలకు చెక్‌ పెట్టాలని మోదీ సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలో రూ.12,000లోపు ధర కలిగిన బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు విక్రయించకుండా షామీ, ఒప్పో, రియల్‌మీ, వివో తదితర చైనా కంపెనీలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వారు తెలిపారు. దేశీయ మొబైల్‌ బ్రాండ్లకు మార్కెట్‌ అవకాశాలు పెంచడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమన్నారు. మన బడ్జెట్‌, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీలదే హవా. మార్కెట్‌ వాటా పరంగా టాప్‌-5 కంపెనీల్లో సామ్‌సంగ్‌ మినహా మిగతా నాలుగు చైనావే. కనీసం టాప్‌-10లో కూడా ఒక్క దేశీయ బ్రాండ్‌ లేకపోవడం గమనార్హం.


బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు జరపకుండా ఆంక్షలు విధిస్తే గనుక చైనా కంపెనీలపై, ప్రధానంగా షామీపై భారీ ప్రభావం చూపనుంది. మార్కెట్‌ ట్రాకింగ్‌ కంపెనీ కౌంటర్‌పాయింట్‌ రిపోర్టు ప్రకారం.. ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి నమోదైన భారత స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో మూడో వంతు వాటా రూ.12,000 లోపు ధర కలిగిన మొబైల్స్‌దే. అందులోనూ 80 శాతం వాటా చైనా కంపెనీలదే. 




భారత టెలికాం రంగంలో చైనా కంపెనీల మనుగడను వీలైనంత వరకు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశీయ 5జీ కార్యకలాపాల్లో చైనా టెలికాం పరికరాల తయారీదారులైన హువే, జెడ్‌టీఈకి ప్రభుత్వం అనుమతి కల్పించలేదు. 5జీ నెట్‌వర్క్‌ గేర్స్‌ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని దేశీయ టెలికాం కంపెనీలను ప్రభుత్వం కోరింది. అంతేకాదు, దేశంలో చైనా మొబైల్‌ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు, మాతృ సంస్థలతో లావాదేవీలపైనా దృష్టిసారించింది. గత ఏడాది డిసెంబరులో ఒప్పోతో పాటు చైనాకు చెందిన ఇతర స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల ప్రాంతాల్లో  ఆదాయం పన్ను (ఐటీ) శాఖ కూడా సోదాలు నిర్వహించింది. ఆ సందర్భంగా ఐటీ అధికారులు చైనా కంపెనీలు భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కంపెనీలపై రెవెన్యూ నిఘా విభాగం (డీఆర్‌ఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయి. అంతేకాదు, టిక్‌టాక్‌, వీచాట్‌ సహా 300కు పైగా చైనా యాప్‌లను సైతం మన ప్రభుత్వం నిషేధించింది. 

Updated Date - 2022-08-09T05:50:57+05:30 IST