ఫిట్‌‘లెస్‌’పై కొరడా

ABN , First Publish Date - 2022-08-12T05:07:56+05:30 IST

మీ దగ్గర 15ఏళ్లు దాటిన వాహనం ఉందా..

ఫిట్‌‘లెస్‌’పై కొరడా

  • కాలం చెల్లిన వాహనాలకు చెక్‌ 
  • చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న అధికారులు
  • 15ఏళ్లు దాటిన వాహనాలు 60 వేల పైనే 
  • ఫిట్‌నెస్‌ లేకుంటే తుక్కుకు వేయాల్సిందే


మీ దగ్గర 15ఏళ్లు  దాటిన వాహనం ఉందా.. ఉంటే దానిని రోడ్డుపై నడపడానికి ప్రయత్నించకండి.. ఒకవేళ అలాచేస్తే  మీకు ఇబ్బందే. వాహనాల కాలపరిమితి 15ఏళ్లు దాటిన వాహనాల పై రవాణా శాఖ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. ఒకవేళ 15ఏళ్లు దాటిన వాహనాన్ని నడిపించాలనుకుంటే  రీ రెన్యూవల్‌ చేసుకోవాల్సిందే. అయితే రెన్యూవల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జీలను కూడా ప్రభుత్వం భారీగానే పెంచింది. 


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 11 : రోడ్డు భద్రత నిబంధనల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను రోడ్డుపైకి రాకుండా కట్టడి చేస్తోంది. ఆ వాహనాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, అలాంటి వాహనాలను నియంత్రించడానికి రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ని తప్పనిసరి చేసింది. కాలం తీరిన వాహనాలను మరో ఐదేళ్లపాటు ఉంచుకుందామనుకుంటే.. రీ రిన్యూవల్‌ చేసుకోవాల్సిందే. రెన్యూవల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జీలను కూడా ప్రభుత్వం భారీగానే పెంచింది. వాహనాల కాలపరిమితి 15ఏళ్లు దాటినట్లయితే వాటిని నిర్మూలించేందుకు, రాకపోకలు సాగించకుండా నివారించేందుకు రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాహనం కొనుగోలు చేసేటప్పుడు రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే 15ఏళ్ల వరకు నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ రిజిస్ర్టేషన్‌ రెన్యూవల్‌ చేసుకుంటే మరో ఐదేళ్లపాటు వాహనం నడుపుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాల విషయంలో క్రమం తప్పకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. వెహికిల్‌ రిజిస్ర్టేషన్‌ మాత్రం ఒకసారి రెన్యూవల్‌ చేసుకుంటే సరిపోతుంది. జిల్లాలో అన్నిరకాల వెహికిల్స్‌ కలిపి మొత్తం 18లక్షల వరకు ఉంటాయి. అందులో 15 సంవత్సరాలు దాటినవి దాదాపు 60 వేల పైనే ఉన్నాయి. దీంట్లో 11 వేల వరకు రిజిస్ర్టేషన్‌ రిన్యూవల్‌ పూర్తి చేసుకున్నాయి. ఇంకా 49 వేలు రిజిస్ర్టేషన్‌ కావాల్సి ఉంది. రిజిస్ర్టేషన్‌ రిన్యూవల్‌ చేసుకోకుండా రోడ్డెక్కితే.. ఇక ఆ వాహనం సీజ్‌ కావాల్సిందే. లేదా జరిమానా తప్పదు. జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,500 కేసులు నమోదు చేశారు. వివిధ రకాల కేసుల్లో 1,159 వెహికిల్స్‌ను సీజ్‌ చేయడం జరిగింది. ఇంకా మిగిలిన వెహికిల్స్‌కు జరిమానాలు విధించడం జరిగింది. అయినప్పటికీ.. 15 ఏళ్లు దాటిన వాహనాలను రెన్యూవల్‌ చేయకుండానే రోడ్డుపై నడుపుతున్నారు. ఇలాంటి వాహనాలపై రవాణాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం వెళితే  రిజిస్ర్టేషన్‌ రెన్యూవల్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిట్‌నెస్‌ అవసరం లేని వాహనాలు మాత్రం రెన్యూవల్‌ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. ఇకపై అటువంటి వాహనాలు నడిపేందుకు వీలు లేదు. తప్పనిసరిగా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మరో ఐదేళ్లపాటు వాహనం నడుపుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రిజిస్ర్టేషన్‌ రిన్యూవల్‌ చేయించుకోకపోతే.. జరిమానా విధిస్తున్నారు. వెహికిల్‌ కండిషన్‌ బాగా లేకుంటే సీజ్‌ చేస్తున్నారు. వెహికిల్స్‌ రిజిస్ర్టేషన్‌ గడువు పూర్తి అయిన నాటి నుంచి నెలకు టూవీలర్‌కు రూ.300, ఫోర్‌ వీలర్‌కు రూ.500 జరిమానా విధిస్తున్నారు. 


4,300 స్కూల్‌ బస్సులకు ఫిట్‌నెస్‌ లేదు

జిల్లాలో ఫిట్‌నెస్‌ లేని బస్సులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. బడి బస్సులు కండీషన్‌లో ఉన్నాయా లేదా అనేది చెక్‌ చేస్తున్నారు. బడి బస్సులు ఫిట్‌నెస్‌ లేకుంటే రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేస్తున్నారు. జిల్లాలో 5,500స్కూల్‌ బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు 4,300 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి చేశారు. ఇంకా 1200 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. 


ఫిట్‌నెస్‌ లేకుంటే బస్సులను సీజ్‌ చేస్తున్నాం

ఫిట్‌నెస్‌ లేకుండా స్కూల్‌ బస్సులు రోడ్లపైకి వస్తే సీజ్‌ చేస్తాం. జిల్లాలో ఇప్పటివరకు 4,300 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు కంప్లీట్‌ చేయడం జరిగింది. అలాగే డ్రైవర్లకు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించాం. 15సంవత్సరాలు దాటిన వాహనాలు జిల్లాలో 60వేల పైనే ఉన్నాయి. దీంట్లో 11వేల వరకు రిజిస్ర్టేన్‌ రిన్యూవల్‌ చేసుకున్నారు. ఇంకా 49 వేలు రిజిస్ర్టేషన్‌ కావాల్సి ఉంది. వెహికిల్స్‌ రిజిస్ర్టేషన్‌ గడువు పూర్తి అయిన నాటి నుంచి నెలకు టూవీలర్‌కు రూ.300, ఫోర్‌ వీలర్‌కు రూ.500 జరిమానా విధిస్తున్నాము. ఇప్పటి వరకు వివిధ కేసుల్లో విధించిన జరిమానా ద్వారా రూ.6.63 కోట్లు రాగా.. మొత్తం రూ.453 కోట్లు ఆదాయం వచ్చింది.

- ప్రవీణ్‌రావు, జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ 




Updated Date - 2022-08-12T05:07:56+05:30 IST