ఎరువుల కొరతకు చెక్‌!

ABN , First Publish Date - 2021-05-17T04:13:27+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఏటా ఎరువుల సమస్య తప్పడంలేదు. రైతుభరోసా కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో సరఫరా చేసినా.. అవి సకాలంలో అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఎరువుల కొరతకు చెక్‌!

- త్రీటైర్‌ విధానంలో సరఫరాకు చర్యలు

- జిల్లాకు 1,23,582 మెట్రిక్‌ టన్నులు  అవసరమని గుర్తింపు 

- మల్టీపర్పస్‌ స్పెషాలిటీ సెంటర్‌, హబ్‌లలో నిల్వలకు ప్రాధాన్యం

(టెక్కలి)

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఏటా ఎరువుల సమస్య తప్పడంలేదు. రైతుభరోసా కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో సరఫరా చేసినా.. అవి సకాలంలో అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎరువుల సమస్యను అధిగమించేందుకు వ్యవసాయశాఖ త్రీటైర్‌ విధానం అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయశాఖ హబ్‌లు, ఏపీ మార్క్‌ఫెడ్‌ గోదాములు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ద్వారా ఎరువులు సరఫరా చేయనుంది. అక్కడి నుంచి రైతు భరోసా కేంద్రాలకు నిల్వలు తరలించి.. రైతులకు ఎరువులు విక్రయించనుంది. జిల్లాలో హోల్‌సెల్లర్స్‌, రైతుభరోసా కేంద్రాలు, ఏపీ మార్క్‌ఫెడ్‌, పరిశ్రమల గోదాంలు, రిటైలర్‌ కలిపి సుమారు 300 వరకు ఎరువుల దుకాణాలు ఉన్నాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కొంతమంది ఎరువుల వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీరికి చెక్‌ పెట్టేందుకు వ్యవసాయశాఖ త్రీటైర్‌ విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఖరీఫ్‌ సీజన్‌ నాటికి పూర్తిస్థాయిలో ఎరువుల నిల్వలు సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో బుడుమూరు, కోటబొమ్మాళి, పలాస, సోంపేట, నరసన్నపేట, ఆమదాలవలస, కొత్తూరు, పాలకొండ, రాజాం ప్రాంతాల్లోని వ్యవసాయశాఖ హబ్‌ల్లోనూ, ఏపీ మార్క్‌ఫెడ్‌ గోదాములుతోపాటు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో 50 చోట్ల నిర్మాణంలో ఉన్న మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లలో ఎరువులు నిల్వ చేయనున్నారు. ఇక్కడి నుంచి జిల్లాలోని 820 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయనున్నారు. ఇప్పటికే ఒక్కో కేంద్రంలో 10 టన్నుల మేర ఎరువులు నిల్వ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 


జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో ఖరీఫ్‌ నాటికి 72,503 మెట్రిక్‌ టన్నుల యూరియా, 24,155 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 12,169 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, 2,275 మెట్రిక్‌ టన్నుల సోపార్‌, 12,412 కాంప్లెక్స్‌ ఎరువులతో పాటు ఇతర కంపోస్ట్‌ ఎరువులు అవసరమని అధికారులు గుర్తించారు. గత ఏడాది ఖరీఫ్‌ నాటికి 1.54 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ఎరువులు అవసరమని గుర్తించిన వ్యవసాయశాఖ, ఈ ఏడాది మాత్రం సుమారు 1,23,582 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధం చేస్తున్నారు. కాగా సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే జిల్లాలో ఎరువులు వినియోగం అత్యధికంగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెఫెడ్‌ గోదాముల్లో ఎనిమిది వేల టన్నులు కెపాసిటీ మాత్రమే ఉండడంతో ఈసారి క్షేత్రస్థాయిలో రైతుభరోసా కేంద్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో ఎరువుల వినియోగంలో రాజాం మొదటి స్థానంలో ఉండగా, కంచిలి చివరి స్థానంలో నిలిచింది. కాగా సెప్టెంబరు నాటికి 19,849 మెట్రిక్‌ టన్నుల యూరియా, 6,566 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 5,243 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌, 5,253 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం ఉంది. దీన్ని వ్యవసాయశాఖ అధిగమిస్తే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలు ఉండవు. ఏటా ఇతర దేశాల నుంచి ఎరువులు సకాలంలో రాకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుంది. ఈ ఏడాది ఈ సమస్యను అధిగమిస్తారో లేదో వేచిచూడాల్సిందే.


కొరత రానివ్వం

 ఖరీఫ్‌ సీజన్‌లో  ఎరువుల కొరత రానివ్వం.  ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో  2,500 టన్నుల డీఏపీ సిద్ధంగా ఉంచాం. ఈ నిల్వలు పాత ధరలకే విక్రయిస్తాం. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు చేపడుతున్నాం. 

- బీవీ తిరుమలరావు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు

 

Updated Date - 2021-05-17T04:13:27+05:30 IST