ములుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన ములుగు
‘ధరణి’తో పరిష్కారానికి చర్యలు
గ్రామంలో రెవెన్యూ సిబ్బంది సందడి
అక్కడే మకాం వేసిన ఆర్డీవో.. నిత్యం సందర్శిస్తున్న కలెక్టర్
గజ్వేల్/ములుగు, జూన్ 22: తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది రికార్డుల తనిఖీలతో, ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలనలో బిజీబిజీ.. పంచాయతీ కార్యాలయంలోనూ అదే తీరు. ఓవైపు గ్రామంలోనే మకాం వేసిన ఆర్డీవో, మరోవైపు నిత్యం కలెక్టర్ పర్యవేక్షణ, ఇంకోవైపు రైతులు.. గత కొన్ని రోజులుగా మండల కేంద్రమైన ములుగులో కనిపిస్తున్న దృశ్యాలివి. ఇదంతా దేనికి అనుకుంటున్నారా భూప్రక్షాళనలో తలెత్తిన సమస్యలకు, ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయించి వందశాతం పరిష్కరించేందుకు అధికారులు చేస్తున్న హడావిడి. ములుగును రెవెన్యూ సమస్యలు లేని గ్రామంగా చేసేందుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడమే దీనికి కారణం. దీని ద్వారా భూప్రక్షాళనలో దొర్లిన తప్పిదాలను పరిష్కరించడంతో పాటు ధరణి పోర్టల్‌పై వస్తున్న అపవాదుల తొలగించేందుకు, పోర్టల్‌లో తీసుకురావాల్సిన మాడ్యూల్స్‌పై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. సమగ్ర అధ్యయన నివేదికను కలెక్టర్ ఆధ్యర్యంలో రూపొందిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టుపై మంత్రి హరీశ్‌రావుతో పాటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎంవో కార్యదర్శులు స్మితాసబర్వాల్, శేషాద్రి ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటూ తగిన సూచనలను చేస్తున్నారు.
మీసేవ ద్వారా దరఖాస్తుకు చర్యలు
ముందుగా ములుగులో గ్రామ సభను ఏర్పాటు చేయించి ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులపై అవగాహన కల్పించారు. ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి భూసమస్యలు ఉన్న రైతులను దరఖాస్తు చేయించాలని పలు సూచనలు చేశారు. దీని కోసం కలెక్టర్ ములుగు పంచాయతీ కార్యాలయంలోనే మీసేవను కూడా ఏర్పాటు చేయించారు. ఇప్పటివరకు రైతుల నుంచి 186 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు రెవెన్యూ అధికార యంత్రాంగం ముందుకు కదులుతుంది. ఈ దరఖాస్తులను ఆర్డీవో విజయేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. పరిష్కారానికి సలహాలు, సూచనలు చేస్తున్నారు. బుధవారమూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా భూసమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి అయ్యేలా దగ్గరుండి పని చేయించారు. ఎలాంటి సందేహం వచ్చిన అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
దరఖాస్తులతో అధికారుల కుస్తీ
భూప్రక్షాళనలో పట్టాదారు పాసుపుస్తకాలలో దొర్లిన పేర్ల నమోదులో సవరణకు 7 దరఖాస్తులు, విస్తీర్ణంలో తేడాల కింద 33 దరఖాస్తులు, సర్వే నంబర్ల మిస్సింగ్‌పై 38 దరఖాస్తులు, ప్రభుత్వ భూముల కింద 44, ప్రోహిబిటెడ్ భూముల కింద 8, సాదాబైనామాలపై 26, ఫౌతివిరాసత్ 12, పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లు 11, కెనాల్ కింద ముంపునకు గురైన భూముల నష్టపరిహారంపై 4, పట్టా భూమి ఆక్రమణపై ఒకటి, కొత్త పట్టాదారు పాసుపుస్తకం కోసం ఒకటి ఇలా 186 దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిష్కారానికి ఆర్డీవో విజయేందర్‌రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది కుస్తీ పడుతున్నారు. కలెక్టర్ ప్రశాంత్ ఐదురోజులుగా ములుగును సందర్శించి పురోగతిపై ఆరా తీస్తున్నారు. చేయాల్సిన పనులకు సూచనలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులను పూర్తి చేసి రైతులకు అందజేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. ములుగులో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే అనంతరం ములుగు మండలం మొత్తం చేపట్టనున్నారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయనున్నారు.