లోన్‌ యాప్‌ల ఆగడాలకు చెక్‌

ABN , First Publish Date - 2022-08-11T08:49:07+05:30 IST

లోన్‌ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్‌ రుణాలపై నిబంధనలను రిజర్వు బ్యాంకు కఠినతరం చేసింది. అధిక వడ్డీ రేట్ల నివారణకు, రుణ వసూళ్లలో..

లోన్‌ యాప్‌ల ఆగడాలకు చెక్‌

నిబంధనలు కఠినతరం చేసిన ఆర్బీఐ 

అధిక వడ్డీ రేట్ల నివారణకు చర్యలు

రుణ వసూళ్లలో అరాచకాలకు అడ్డుకట్ట

అవసరం మేరకే సమాచారం సేకరించాలి

దానికీ రుణగ్రహీత అనుమతి తప్పనిసరి

మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బీఐ


ముంబై, ఆగస్టు 10: లోన్‌ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు డిజిటల్‌ రుణాలపై నిబంధనలను రిజర్వు బ్యాంకు కఠినతరం చేసింది. అధిక వడ్డీ రేట్ల నివారణకు, రుణ వసూళ్లలో అనైతిక పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల మేరకు డిజిటల్‌లో అన్ని రుణాల పంపిణీ, తిరిగి చెల్లింపులు రుణగ్రహీత, నియంత్రిత సంస్థ(ఆర్‌ఈ..బ్యాంకు/ఎన్‌బీఎ్‌ఫసీ) బ్యాంకు ఖాతాల మధ్య మాత్రమే జరగాలి. ఎల్‌ఎ్‌సపీ(లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌)ల ఖాతాల ద్వారా నిర్వహించే ఆస్కారం ఉండకూడదు. అలాగే, రుణ మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎల్‌ఎ్‌సపీకి చెల్లించాల్సిన ఫీజులు, చార్జీలు తదితరాలు నేరుగా నియంత్రిత సంస్థే చెల్లించాలి తప్ప, రుణ గ్రహీత కాదని ఆర్‌బీఐ బుధవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.


డిజిటల్‌ రుణాలకు సంబంధించి కళ్లెం లేని థర్డ్‌ పార్టీలు, తప్పుడు మార్గాలు, అత్యధిక వడ్డీ రేట్లు, వసూళ్లలో అనైతిక పద్ధతులు తదితర ఆందోళనలకు సంబంధించి వివరణాత్మక నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది. రిజర్వు బ్యాంకు లేదా చట్టబద్ధమైన ఇతర సంస్థల నుంచి అనుమతి పొందిన సంస్థలు మాత్రమే ఈ కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలు, ఆర్బీఐ నియంత్రణలో లేకుండా ఇతర చట్టబద్ధమైన సంస్థల అనుమతితో అప్పులిచ్చే సంస్థలు, ఏదేని చట్టబద్ధమైన/నియంత్రణ సంస్థ వెలుపల అప్పులిచ్చే సంస్థలు అనే మొత్తం మూడు కేటగిరీలుగా డిజిటల్‌ రుణదాతలను ఆర్బీఐ వర్గీకరించింది. రుణ ఒప్పందం అమలుకు ముందు ప్రామాణికమైన కేఎ్‌ఫఎ్‌స(కీలక ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌)ను రుణగ్రహీతకు అందించాలని పేర్కొంది. అలాగే, రుణగ్రహీత సమ్మతి లేకుండా రుణ పరిమితిని ఆటోమేటిక్‌గా పెంచడాన్ని ఆర్బీఐ నిషేధించింది.


ఏ విధమైన పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా అసలు, వడ్డీ చెల్లించడం ద్వారా రుణ విముక్తుడయ్యేందుకు లుక్‌-అప్‌ వ్యవధి, కూలింగ్‌-ఆఫ్‌ వ్యవధి రుణ ఒప్పందంలో స్పష్టం చేయాలని కూడా పేర్కొంది. రుణగ్రహీత ఏదేని ఫిర్యాదును నిర్ణీత గడువు(ప్రస్తుతం 30 రోజులు)లోగా నియంత్రిత సంస్థ(ఆర్‌ఈ) పరిష్కరించకుంటే, రిజర్వు బ్యాంక్‌ ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ పథకం(ఆర్‌బీ-ఐఓఎస్‌) కింద రుణగ్రహీత ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. రుణ గ్రహీతల నుంచి అవసరమైన మేరకు మాత్రమే సమాచారాన్ని లోన్‌ యాప్‌లు సేకరించాలని స్పష్టం చేసింది. అది కూడా రుణగ్రహీత నుంచి ముందుగా సమ్మతి పొందిన తర్వాతే సేకరించాలని పేర్కొంది. స్పష్టమైన ఆడిట్‌ ట్రయల్స్‌ ఉండాలని కూడా తేల్చిచెప్పింది. దీనిపై ఇంతకుముందు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే ఆప్షన్‌ కూడా రుణగ్రహీతకు కల్పించాలని పేర్కొంది. రుణ గ్రహీత నుంచి రుణయా్‌పలు, ఎస్‌ఎల్‌పీలు సేకరించిన సమాచారాన్ని డిలీట్‌ చేసే ఆప్షన్‌ కూడా ఉండాలని తేల్చిచెప్పింది. వీటితోపాటు వర్కింగ్‌ గ్రూప్‌ చేసిన మరికొన్ని సిఫారసులనూ సూత్రప్రాయంగా స్వీకరించామని, అయితే, వాటిపై మరింత పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ తెలిపింది. రుణగ్రహీతల ఫిర్యాదుల పరిష్కారానికి నోడల్‌ అధికారిని కూడా నియంత్రిత సంస్థ(ఆర్‌ఈ)లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-08-11T08:49:07+05:30 IST