ఇదే నా తొలి విజయం : వైఎస్ షర్మిల

Jun 17 2021 @ 02:26AM

  • షర్మిల పరామర్శకు చెక్‌
  • ఆత్మహత్యా యత్నం చేసిన నిరుద్యోగి
  • పరామర్శకు మేడారం వెళ్లిన వైఎస్‌ షర్మిల
  • బాధితుడిని కలవనివ్వకుండా టీఆర్‌ఎస్‌ స్కెచ్‌
  • ఉద్యోగం ఇప్పిస్తామని సాయికిరణ్‌కు హామీ!
  • వైద్యం పేరిట గ్రామం నుంచి తరలింపు
  • కేసీఆర్‌ పగలు, ప్రతీకారాల కోసమే పనిచేస్తారు
  • సాయికి ఉద్యోగమని ఊర్లోనుంచి తప్పించారు

నేరేడుచర్ల, జూన్‌ 16: ఉద్యోగం రావడంలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేసిన యువకుడిని పరామర్శించాలనుకున్న వైఎస్‌ షర్మిలకు టీఆర్‌ఎస్‌ నేతలు షాకిచ్చారు. ఆమె బాధితుడి గ్రామానికి చేరుకోకముందే అతణ్ని గ్రామం నుంచి తరలించారు. షర్మిలను కలవకుండా ఉంటే ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి.. వైద్యం పేరిట అక్కడి నుంచి పంపించారు. దీంతో బుధవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో వైఎస్‌ షర్మిల పర్యటనలో హైడ్రామా చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీలకంఠం సాయికిరణ్‌ ఈ నెల 11న నల్లగొండలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. 

చికిత్స అనంతరం స్వగ్రామమైన మేడారంలో ఉంటున్నాడు. కాగా, అతణ్ని పరామర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు ఆమె వర్గం నేతలు గ్రామంలో ప్రకటించడంతో స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు సాయితో మాట్లాడారు. షర్మిలను కలవొద్దంటూ అతనిపై వారు ఒత్తిడి తీసుకువచ్చినట్లు, తనను కలిసేందుకు షర్మిలను రావొద్దని కోరాలంటూ సూచించినట్లు తెలిసింది. ఇదే విషయమై షర్మిల పార్టీ నేతలకు సాయి తండ్రి శ్రీనివాసులు సమాచారం ఇచ్చారు. అనంతరం తెల్లవారుజామున సాయి ఇంటికి వెళ్లి అతనికి ఉద్యోగం ఇస్తామని చెప్పి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అయితే అప్పటికే షెడ్యూల్‌ ఖరారైనందున.. మేడారం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం 11.40 గంటలకు నేరేడుచర్లకు, అక్కడినుంచి మేడారం చేరుకున్నారు. ఆమెకు వైఎస్‌ అభిమానులు స్వాగతం పలికారు. స్థానికంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గ్రామంలో నిరుద్యోగులతో ముచ్చటించారు. 


నిరుద్యోగుల కడుపు కొడుతున్నారు..

రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్‌ నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. నిరుద్యోగ యువతవి ఆత్మహత్యలు కావని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. సీఎం కేసీఆర్‌ హంతకుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు సాయికిరణ్‌పై ఒత్తిడి తెచ్చి తనను కలవద్దంటూ బెదిరించారని ఆరోపించారు. ఉద్యోగం ఇస్తామని చెప్పి ఊరి నుంచి తీసుకువెళ్లారని తెలిపారు. తన పోరాటానికి సర్కారు భయపడి కదులుతోందని, సాయికి ఉద్యోగం వస్తుందంటే సంతోషంగా ఉందని అన్నారు. దీంతో మేడారంలో తమ తొలివిజయం నమోదైందన్నారు. ఇంటికో ఉద్యోగం వచ్చేవరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది బిడ్డలను కోల్పోతే.. మళ్లీ నేడు నిరుద్యోగానికి వందల మంది యువతను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 


రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని తక్షణమే ఇవ్వాలన్నారు. సీఎం కేసీఆర్‌కు నిరుద్యోగులంటే చిన్నచూపు ఎందుకని షర్మిల ప్రశ్నించారు. పగలు, ప్రతీకార రాజకీయాల కోసం సర్కారు యంత్రాంగాన్ని నిమిషాల మీద పని చేయించే కేసీఆర్‌.. యువత కోసం ఎందుకు పని చేయడం లేదని అన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదని, తాను పోరాడతానని ప్రకటించారు. నాయకులు పిట్టా రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఇందిరా శోభన్‌, ఏపూరి సోమ న్న, కర్రి సతీ్‌షరెడ్డి, బెల్లంకొండ గోవిందు పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.