భాస్వరం నిల్వలకు జీవన ఎరువులతో చెక్‌

ABN , First Publish Date - 2022-07-07T06:07:13+05:30 IST

పంటలకు మేలు చేస్తాయని రైతులు వాడిన కాంప్లెక్స్‌ ఎరువులు ఇప్పుడు శాపంగా మారాయి.

భాస్వరం నిల్వలకు జీవన ఎరువులతో చెక్‌

- జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ

- తగ్గనున్న ఎరువుల ఖర్చులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పంటలకు మేలు చేస్తాయని రైతులు వాడిన కాంప్లెక్స్‌ ఎరువులు ఇప్పుడు శాపంగా మారాయి. ఈ ఎరువులతో అధిక దిగుబడులు వస్తాయని భావిస్తే అవి సాగుకు ప్రతిబంధకంగా మారాయి.  కాంప్లెక్స్‌ ఎరువుల్లోని భాస్వరం మొక్కలకు 20 శాతం అందితే మిగిలిన 80 శాతం భూమిలో పెరుకుపోయింది. జిల్లాలో చేపట్టిన భూసార పరీక్షా ఫలితాల్లో అన్ని మండలాల్లో హెక్టారుకు 75 కిలోలకుపైగా భాస్వరం ఉన్నదని తేలింది. ఈ భాస్వరం నిల్వలను ఇలాగే వదిలేస్తే పంటల మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ న్విలలను జీవన ఎరువుల ద్వారా కరిగించి పైర్లకు అందేలా చేయవచ్చని వ్యవసాయశాఖ గుర్తించింది. ఈ మేరకు జిల్లాలో కార్యాచరణను అమలు చేసేందుకు ఆ శాఖ సిద్ధమయింది. 

కాంప్లెక్స్‌ ఎరువులతో పెరిగిన భాస్వరం నిల్వలు

పంటల ఎదుగుదలకు నత్రజని, భాస్వరం, పొటాష్‌ ముఖ్య పోషకాలుగా ఉపయోగపడుతున్నాయి. భాస్వరం మొక్క వేర్ల పెరుగుదలకు, మొక్క ఎదుగుదలకు ఎంతో అవసరమైనది. రైతులు వాడుతున్న కాంప్లెక్స్‌ ఎరువుల్లోని భాస్వరంలో 20 శాతం మాత్రమే మొక్కకు అందుతున్నాయి. మిగిలినది భూమిలో చేరిపోతున్నది. విచ్చలవిడిగా కాంప్లెక్స్‌ ఎరువులను వాడుతున్న కారణంగా జిల్లాలోని భూముల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయి. ఈ నిల్వలను పంటలకు ఉపయోగించుకోగలిగితే రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు నేల మళ్లీ అధిక భాస్వరం లేకుండా ఆరోగ్యవంతంగా మారుతుంది. నేలలో పేరుకుపోయిన భాస్వరాన్ని కరిగించేందుకు జీవన ఎరువులు ఉపయోగడపడతాయని గుర్తించారు. పీఎస్‌బీ అనే ఈ సూక్ష్మజీవులు ఈ జీవన ఎరువుల్లో ఉంటాయి. ఈ ఎరువులను వాడడంతో భూమిలోని భాస్వరం కరిగి పంటలకు అందుతుంది. దీంతో జిల్లాలో డీఏపీ, భాస్వరం కలిగిన కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం తగ్గిపోయే అవకాశం ఉన్నది. జీవన ఎరువులు వాడడం ద్వారా 10 నుంచి 25 శాతం కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని అంచనా వేశారు. ఆ మేరకు రైతుకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. 

పీఎస్‌బీ బ్యాక్టీరియాతో ద్రవరూప ఎరువులు

వరి, చిరుధాన్యాలు, పప్పుదినుసుల పంటలు, నూనె గింజలు, కూరగాయల సాగులో జీవన ఎరువులను వాడుకునే అవకాశం ఉన్నది. మార్కెట్‌లో పీఎస్‌బీ బ్యాక్టీరియా ఉన్న ద్రవరూప ఎరువులు లభ్యమవుతున్నాయి. ఒక మిల్లీ లీటరు ఎరువు ద్వారా 10 కోట్ల బ్యాక్టీరియా ఉత్పత్తి అయి వాటి ద్వారా భూమిలో పేరుకుపోయిన భాస్వరం కరిగి పంటకు అందుతుంది. ఎకరానికి 300 నుంచి 400 మిల్లీ లీటర్ల ద్రవరూప జీవన ఎరువును(పీఎస్‌బీ) 50 నుంచి 100 కిలోల మట్టిలేక ఇసుకలో కలిపి ఆ మిశ్రమాన్ని ఆఖరు దుక్కిలో వెదజల్లాల్సి ఉంటుంది. ఎకరాకు రెండు కిలోలు లేదా 250 మిల్లీ లీటర్ల జీవన ఎరువును వంద నుంచి 200 పశువుల ఎరువు లేదా కాంపోస్టుతో కలిపి కూడా ఆఖరి దుక్కిలో వెదజల్లవచ్చు. పైరు నాటిన వారం రోజుల్లోపు కూడా దీన్ని చల్లడానికి అవకాశం ఉన్నది. ఈ జీవన ఎరువు ద్వారా వేర్ల శుద్ధీకరణ కూడా చేసుకోవచ్చు. పావులీటరు ద్రవరూప బయో ఎరువును నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఎకరానికి తగినంత నారు వేర్లను 20 నుంచి 30 నిమిషాల సేపు ఆ ద్రావణంలో ముంచి వెంటనే నాటుకోవాల్సి ఉంటుంది. నారు ద్వారా పెంచే వరి, కూరగాయల మొక్కల వేర్లను కిలో పీఎస్‌బీని 10 నుంచి 15 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో నారు వేర్లను పావుగంట వరకు ముంచి నాటు వేయాల్సి ఉంటుంది. విత్తన శుద్ధిలో కూడా జీవన ఎరువులను వినియోగించుకోవచ్చు. జీవన ఎరువుల వినియోగం ద్వారా కాంప్లెక్స్‌ వినియోగం తగ్గించి పెట్టుబడులు ఆదా చేసుకోవచ్చు. వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించే అవకాశం ఉంది. మొక్కలు తమంతట తాము నేలలోని పోషకాలను వినియోగించుకుంటాయి. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను జీవన ఎరువులు కొంత మేరకు అరికడతాయి. అధిక ఎరువుల వినియోగం తగ్గి నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం అభివృద్ధి చెందుతుంది. దిగుబడులు 10 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రైతులు జిల్లాలోని నేలల్లో అధిక భాస్వరం ఉన్న కారణంగా ఈ జీవన ఎరువులను వినియోగించి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు భూసారాన్ని పరిరక్షించుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తున్నది. జిల్లాలో జీవన ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-07T06:07:13+05:30 IST