ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు

ABN , First Publish Date - 2021-05-11T04:34:06+05:30 IST

కరోనా ఉధృతి, హైదరాబాదులోని ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ దొరకక మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆప్రమత్తమయ్యింది. హైదరాబాదుపై ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు
సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టు(ఫైల్‌ పొటో)

తెలంగాణలోకి వచ్చే వారికి పరీక్షలు

కరోనాగా తేలితే వెనక్కు పంపిస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌లోని ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకే

ముందస్తు అనుమతి తీసుకున్నవారికి మాత్రం వెళ్లే వెసలుబాటు

అశ్వారావుపేట, మే 10: కరోనా ఉధృతి, హైదరాబాదులోని ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ దొరకక మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆప్రమత్తమయ్యింది. హైదరాబాదుపై ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంతో పాటు ఏపీకి చెందిన రోగులు అత్యధికశాతం వైద్యచికిత్సల కోసం హైదరాబాదుకే వస్తుంటారు. ఏపీలో మధ్యాహ్నం 12గంటల తరువాత పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ నుంచి వచ్చే వాటినే నిలుపుదల చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణలోకి వెళ్లే వారిని నిరాటకంగా వదలివేస్తున్నారు. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు రాకపోకలు యథావిధిగా జరిగిపోతున్నాయి. ఇందులో 90శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చే రోగులే ఉన్నారనేది ఒక అంచనా. దీంతో హైదరాబాదు ఆసుపత్రుల్లో ఇసుక వేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సరిహద్దు గ్రామాలలో పోలీస్‌, రెవెన్యూ, ఎక్సైజ్‌, అటవీ, వైద్యశాఖ అధికారులతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్నంగా వివరాలు సేకరిస్తోంది. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. పాజిటివ్‌ కేసులు అయితే వెనకకు పంపిస్తున్నారు. ముందస్తుగా హైదరాబాదులోని ఆసుపత్రిలో బెడ్స్‌ రిజర్వేషన్‌లు అయి ఉండి, అనుమతులు తీసుకొని ఉంటే అనుమతిస్తున్నారు. మిగతావారిని ఆపివేస్తున్నారు. ఈ మేరకు చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహించే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చెక్‌పోస్టులు తమ పనిని ప్రారంభించాయి. ఏపీలోని రోగులను నియంత్రించడం ద్వారా హైదరాబాదుపై పడుతున్న భారాన్ని ప్రభుత్వం తగ్గించనుందని సమాచారం.


Updated Date - 2021-05-11T04:34:06+05:30 IST