చెక్‌పోస్టులు ఖాళీ.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-06-21T18:28:49+05:30 IST

ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది.

చెక్‌పోస్టులు ఖాళీ.. ఊపిరి పీల్చుకున్న పోలీసులు

  • అన్‌లాక్‌తో అంతా మామూలు


హైదరాబాద్‌ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దాంతో గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులుగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు ఖాళీ చేశారు. లాక్‌డౌన్‌ వేళ ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా పోలీసులు అహర్నిశలు శ్రమించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పదుల సంఖ్యలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పాస్‌ల తనిఖీ, నిత్యావసరాల రవాణాకు ఆటంకం లేకుండా చూడటం, దుకాణాల నిర్వహణ వేళలను గమనించడం, నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేయడం వంటి పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. సాధారణ విధులు నిర్వర్తించే సిబ్బంది అత్యవసర సర్వీసుల వారికి పాస్‌లను జారీ చేయడం, అంతరాష్ట్ర ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఈ పాసులు వంటి సేవలదించడంలో తలమునకలయ్యారు. ఆదివారం నుంచి నిబంధనలు పూర్తిగా ఎత్తేయడంతో చెక్‌పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది సాధారణ విధుల్లో చేరారు. లాక్‌డౌన్‌ సమయంలో ముగ్గురు కమిషనర్‌లు వారి పరిధిలోని ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సీపీలు 

లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా పాటించి సహకరించిన ప్రజలకు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సీపీలు ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది నిబంధనలను ఉల్లంఘించినా ఎక్కువశాతం మంది నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సాయం చేశారన్నారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా ఎలాంటి నిర్లక్ష్యం కూడదన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వినియోగంతోపాటు రద్దీ ప్రదేశాల్లో భౌతికదూరం నిబంధన తప్పనిసరిగా పాటించాలన్నారు. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వారు సూచించారు.

Updated Date - 2021-06-21T18:28:49+05:30 IST