సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

ABN , First Publish Date - 2021-06-17T05:07:36+05:30 IST

గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ వచ్చేసింది. ఇకపై వారు పంచాయతీ నిధులను డ్రా చేయవచ్చు. జిల్లాలోని 955 గ్రామ పంచాయతీల్లోనూ నిధులు డ్రా చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌.సుభాషిణి అనుమతి మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌
గొట్టివలస గ్రామ సచివాలయం

పంచాయతీ నిధులు డ్రా చేసేందుకు అనుమతి

గరుగుబిల్లి, జూన్‌ 16 : గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌ వచ్చేసింది. ఇకపై వారు పంచాయతీ నిధులను డ్రా చేయవచ్చు. జిల్లాలోని 955 గ్రామ పంచాయతీల్లోనూ నిధులు డ్రా చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారి ఎస్‌.సుభాషిణి అనుమతి మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు ఏప్రిల్‌ 3న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సుమారు మూడు నెలల పాటు వీరు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. పారిశుధ్య పనులతో పాటు క్లోరినేషన్‌ చర్యలు ప్రారంభించేందుకు కూడా ఇబ్బంది పడ్డారు. కొందరు తమ సొంత మొత్తాలను వెచ్చించి ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టారు. పంచాయతీ ఖాతాల్లో అవసరమైన నిధులు ఉన్నా డ్రా చేయలేకపోయారు. కొద్దిరోజుల కిందట ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్‌లు తమ పూర్తి వివరాలను నివేదించారు. ఆ మేరకు సీఎఫ్‌ఎంఎస్‌లో పొందుపర్చి పంచాయతీల వారీ గుర్తింపు సంఖ్యను(ఐడీ) కేటాయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల నెంబరు 69 ప్రకారం పంచాయతీ ఆమోదించిన బడ్జెట్‌ ప్రకారం మాత్రమే పంచాయతీ నిధులు  డ్రా చేయాలి. ఆమోదం లేకుండా డ్రా చేస్తే తర్వాత తీసుకునే చర్యలకు సర్పంచ్‌లు బాధ్యులవుతారని జిల్లా పంచాయతీ అధికారి స్పష్టంచేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల చెక్‌ డ్రాయింగ్‌ అధికారంపై జిల్లా అధికారికి నియంత్రణ ఉంటుంది.

ప్రత్యేకాధికారుల పాలనకు చెక్‌

పంచాయతీల పరిధిలో ప్రత్యేకాధికారుల పాలనకు చెక్‌ పడింది. 2018 ఆగస్టులో పాలకవర్గాల పాలనా కాలం ముగిసింది. అప్పటి నుంచి అధికారుల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరిగాయి. రెండేళ్లకు పైగా అధికారుల కనుసన్నల్లోనే నిధులు డ్రా అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు డ్రా చేసేందుకు అనుమతులు మంజూరయ్యాయి. సర్పంచ్‌లకు అధికారం కల్పించడంతో అభివృద్ధికి అడ్డంకులు తొలిగాయి.


Updated Date - 2021-06-17T05:07:36+05:30 IST