ఒమైక్రాన్‌కు హెచ్‌సీక్యూతో చెక్‌!

ABN , First Publish Date - 2022-01-18T06:54:48+05:30 IST

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ).. కరోనా వైరస్‌ చైనా నుంచి ప్రపంచం మొత్తానికీ పాకిన కొత్తల్లో

ఒమైక్రాన్‌కు హెచ్‌సీక్యూతో చెక్‌!

మరోసారి తెరపైకి వచ్చిన మలేరియా మందు

ఒమైక్రాన్‌ను బాగా నిలువరిస్తుంది

గ్లాస్గో వర్సిటీ పరిశోధకుల వెల్లడి


కేంబ్రిడ్జ్‌, జనవరి 17: హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ).. కరోనా వైరస్‌ చైనా నుంచి ప్రపంచం మొత్తానికీ పాకిన కొత్తల్లో బాగా వినిపించిన పేరు ఇది! మలేరియాకు వినియోగించే హెచ్‌సీక్యూ ఔషధం కరోనాకు బాగా పనిచేస్తోందని అప్పట్లో అంతా ఊదరగొట్టారు. కానీ, దానివల్ల మరణాలు పెరుగుతున్నట్టు గుర్తించి కొవిడ్‌ చికిత్స ప్రొటోకాల్‌ నుంచి తొలగించేశారు. ఇప్పుడు అదే మందు పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ మందు.. ఒమైక్రాన్‌ను మాత్రం సమర్థంగా నిరోధించగలదని యూకేలోని గ్లాస్గో వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. ఒమైక్రాన్‌ కణాల్లోకి ప్రవేశించే తీరులో తేడా కారణంగా హెచ్‌సీక్యూ దానిపై బాగా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.


ఒమైక్రాన్‌ వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకడానికి కారణం దాంట్లో వచ్చిన ఉత్పరివర్తనాలు. పాత వేరియంట్లు మన శరీరంలోని కణాల్లోకి ప్రవేశించడానికి టీఎంపీఆర్‌ఎ్‌సఎస్‌2 మార్గాన్ని ఎంచుకుంటే.. మ్యుటేషన్ల కారణంగా ఒమైక్రాన్‌.. ఎండోసోమల్‌ మార్గాన్ని ఎంచుకుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే.. పాత వేరియంట్లు మన కణం మీద ఉండే ఏస్‌2 (యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2) గ్రాహకాలకు అతుక్కోగానే వైర్‌సకు రక్షణ వలయంలా ఉండే పై రెండు పొరలూ కలిసిపోయి లోపల ఉన్న జన్యుపదార్థం కణంలోకి చొరబడుతుంది. దీన్ని ‘మెంబ్రేన్‌ ఫ్యూజన్‌’గా వ్యవహరిస్తారు. పాత వేరియంట్లలో ఇది కణం ఉపరితలంపైనే జరిగేది.


కానీ, ఒమైక్రాన్‌ అందుకు భిన్నంగా ఎండోసోమ్‌లోకి ప్రవేశించి మెంబ్రేన్‌ ఫ్యూజన్‌ను జరుపుతుంది. ఇక్కడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పాత్ర ప్రధానం. ఎందుకంటే ఈ ఔషధం సాధారణంగా ఎండోసోమ్స్‌లో గుమిగూడి దాన్ని ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా ఆ ఎండోసోమ్స్‌ తక్కువ గాఢతను కలిగి ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మెంబ్రేన్‌ ఫ్యూజన్‌ జరగడం కష్టంగా మారుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఈ మలేరియా మందు ఒమైక్రాన్‌ విషయంలో యాంటీవైరల్‌ ఔషధంగా పనిచేస్తుందని గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.


కాగా.. హెచ్‌సీక్యూ ఔషధం వాడకం వల్ల బాధితుల్లో వచ్చే సైడ్‌ఎఫెక్టుల గురించి కూడా పరిశోధన చేస్తేగానీ దానిపై ఒక నిర్ణయం తీసుకోలేమని కొందరు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎవరికీ బలవంతంగా వేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసపింది. 


Updated Date - 2022-01-18T06:54:48+05:30 IST