అక్రమాలకు చెక్‌

ABN , First Publish Date - 2021-11-25T05:42:21+05:30 IST

అక్రమాలకు చెక్‌

అక్రమాలకు చెక్‌

లబ్దిదారుల గుర్తింపునకు కొత్త ప్రక్రియ

అమలులోకి 360 డిగ్రీ డేటా సాంకేతికత

త్వరితగతిన దరఖాస్తుల పరిశీలన

తగ్గనున్న నిర్వహణ వ్యయం


హనుమకొండ, నవంబరు 24 (ఆంధ్యజ్యోతి) : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు లబ్దిదారుల ఎంపికకు గతంలో పెద్ద కసరత్తే జరిగేది. దరఖాస్తు చేసుకున్నవారు అర్హులా కాదా అనేది నిర్ధారించడానికి చాలా సమయం పట్టేది. లబ్దిదారుల ఎంపికకు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపేవారు. అవసరమైతే ఇంటింటికి వెళ్ళి స్వయంగా ఆరా తీసేవారు. ఈ ప్రక్రియలో గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు ఉద్యోగులు తలమునకలయ్యేవారు. ఇంత చేసినా ఎక్కడో ఒక దగ్గర పొరపాట్లు దొర్లేవి. రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు, దళారుల పైరవీలతో అక్రమాలు కూడా చోటు చేసుకునేవి. జాప్యం వల్ల పుణ్యకాలం కూడా గడిచి పోయి నిధులు సైతం మురిగి పోయేవి. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయేది. ప్రజాధనం కూడా వృథా అయ్యేది. వీటన్నిటికి చెక్‌ పెట్టడానికి ప్రభుత్వం 360 డిగ్రీడేటాను ఉపయోగిస్తోంది. లబ్దిదారుల ఎంపికలో దీనినే ప్రామాణికంగా తీసుకుంటోంది. ఇక నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందాలంటే 360 డిగ్రీ డేటా పరీక్షను దరఖాస్తు చేసిన ప్రతీ ఒక్కరు విధిగా ఉత్తీర్ణులు కావలసిందే. 


అర్హుల గుర్తింపునకు..

రెండు పడక గదుల ఇల్లు, దళితులకు మూడెకరాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, అసరా పింఛన్లు, గర్భిణులకు ఆర్థిక సహాయం, ఆరోగ్యశ్రీ, రూపాయికి కిలో బియ్యం తదితర పథకాలకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు కొత్తగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది తెలిసిందే. ఇలా భారీ ఖర్చుతో కూడిన పథకాలు అనర్హులకు చేరకుండా అర్హులకే దక్కేలా ఏ పథకానికైనా దరఖాస్తు చేసుకోగానే.. 360 డిగ్రీ సాంకేతికతో అర్హతను నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కొత్త రేషన్‌కార్డుల లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో ప్రభుత్వ ఈ డేటాను వినియోగించింది. దీంతో వచ్చి దరఖాస్తుల్లో 40 శాతం వరకు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తోంది. తాజాగా 57 సంవత్సరాలు నిండినవారికి ఆసరా ఫించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులను గుర్తించేందుకు ఇందులో కూడా 360 డిగ్రీ డేటాను ఉపయోగించనున్నది. పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తయింది. చివరగా అర్హులను గుర్తించేందుకు కూడా ఈ సాంకేతికను ఉపయోగించనున్నట్టు సమాచారం.


రేషన్‌కార్డులకు..

రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం ప్రతీ కుటుంబ సమాచారం సేకరించింది. వారి ఆర్థిక, సామాజిక స్థితిగతుల ఆ ధారంగా ప్రభుత్వం ఈ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ త్వరితగతిన నిర్ణయాలు తీసుకోనున్నది. ఇటీవల కొత్తగా మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులకు ప్రభుత్వ తన వద్ద నిక్షిప్తమై ఉన్న డేటాను వినియో గించింది. అనర్హులకు పథకాలు అందవద్దనే ఉద్దేశంతో ఈ 360 డేటా సాంకేతికత వినియోగానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.


 360 డిగ్రీ డేటా అంటే....

సంక్షేమ పథకాల కోసం ధరఖాస్తు చేసుకున్నవారికి సంబంధించి విడివిడిగా ఉన్న సమాచారాన్ని సాంకేతిక సహాయంతో ఒకే చోటికి చేర్చి వడపోయడం ద్వారా వారి ఆర్థిక స్థితిని ప్రభుత్వం తెలుసుకుంటుంది. ఈ వడపోతకు ఉపయోగించే సాంకేతికతే 360 డేటా విధానం. ఇదేం కొత్త ప్రక్రియ కాదు. సాప్ట్‌వేర్‌ కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థలు, కొన్ని ప్రభుత్వ ప్రముఖ రంగ సంస్థలు తమ దగ్గర పని చేసే సిబ్బంది, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పూర్తి వివరాలను క్రోడీకరించి వారి విద్య, సామాజిక, ఆర్థిక, సాంకేతికత, నైపుణ్య స్థాయిని తెలుసుకునేందుకు 360 డేటాను వాడుతున్నారు. దీని వల్ల నిర్వహణపరమైన ఖర్చు 90 శాతం తగ్గుతుంది. సమయం వృథా కాదు. పైగా ఖచ్చితత్వం ఉంటుంది. సమాచారం అన్ని స్థాయిలో నిరంతరం అందుబాటులో ఉంటుంది. ఏ స్థాయిలోనైనా ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చు. ఇదే విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది.


ఆధారే ఆధారం

అధికారులు ఆధార్‌ను ప్రతీ గుర్తింపునకు తప్పనిసరి చేశారు. సెల్‌ఫోన్‌ సిమ్‌కార్డులతో మొదలుకొని వాహనాల రిజిస్ట్రేషన్‌, వ్యవసాయ భూములు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతా ఇలా అన్నిటికి ప్రస్తుతం ఆధార్‌ కార్డే కీలకం. రైతుకు పాసు పుస్తకం ఇవ్వాలంటే ఆధార్‌ ఉంటేనే ముద్రితమయ్యేలా సాప్ట్‌వేర్‌ను రూపొందించారు. లేనట్లయితే పాస్‌బుక్‌ జారీ కాదు. పైగా ఆ రైతు భూమిని పార్ట్‌–బీలో ఉంచేలా ఏర్పాటు చేశారు.  ఉపాఽధిహామీ కూలీలకు చెల్లించే డబ్బు మొదలుకొని ప్రతీ లావాదేవీ ఈ ఆధార్‌ వల్లనే క్లిక్‌ చేయగానే కంప్యూటర్‌ తెరపై కనిపిస్తుంది. సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ప్రభుత్వం వద్ద కుటుంబంలో ఎంత మంది ఉన్నారు. వారి ఉపాధి మార్గాలు, ఉద్యోగాలు ఇతరత్రా పూర్తి సమాచారం ఉంది.  

Updated Date - 2021-11-25T05:42:21+05:30 IST