తనిఖీలు సరే.. చర్యలేవీ?

ABN , First Publish Date - 2022-09-30T05:48:29+05:30 IST

ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్‌లు, స్కానింగ్‌ కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా అనుమతులు తీసుకోని వాటిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

తనిఖీలు సరే.. చర్యలేవీ?
ఎల్లారెడ్డిలో తనిఖీలు చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

- జిల్లాలో ఇప్పటి వరకు 55 ఆసుపత్రుల్లో తనిఖీలు

- అనుమతిలేనివి మూడు ఆసుపత్రులు, రెండు ల్యాబ్‌లు

- 16 ఆసుపత్రులకు నోటీసులు

- నోటీసులకే పరిమితమవుతున్న తనిఖీలు

- నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు

- తనిఖీల్లో వెలుగు చూస్తున్నా చర్యలు తీసుకోని పరిస్థితి

- అనుమతి లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లు ఉన్నా సీజ్‌ చేయని పరిస్థితి

- ఆసుపత్రుల యాజమాన్యాలకే కొమ్ముకాస్తున్న వైద్యఆరోగ్యశాఖ

- శాఖ అధికారుల తీరుపై విమర్శలు


కామారెడ్డి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్‌లు, స్కానింగ్‌ కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా అనుమతులు తీసుకోని వాటిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో గత 5 రోజులుగా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలో చాలా మట్టుకు ఎలాంటి నిబంధనలు పాటించకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వహణ కొనసాగుతున్నా.. అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్నప్పటికీ వైద్యఆరోగ్యశాఖ మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప కేసులు నమోదు చేసి సీజ్‌ చేసిన దాఖలాలు లేవు. పొరుగు జిల్లాల్లో చాలా ప్రైవేట్‌ ఆసుపత్రులను సీజ్‌ చేస్తునప్పటికీ కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆసుపత్రిని కూడా సీజ్‌ చేయకపోవడం సంబంధిత శాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జిల్లాలో 100కు పైగానే ప్రైవేట్‌ ఆసుపత్రులు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాలతో పాటు పలు మండల కేంద్రాల్లోనూ ప్రైవేట్‌ ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు, డెంటల్‌ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్‌లు, స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు సుమారు 100కు పైగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ రికార్డులు చెబుతున్నాయి. ఇక డయాగ్నస్టిక్‌ సెంటర్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తూనే ఉన్నాయి. ఇందులో చాలా మట్టుకు అనుమతులు తీసుకోకుండానే నడుపుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖలోని పలువురు అధికారులు చెబుతున్నారు. అనుమతులు ఉన్న వాటిలో కనీస నిబంధనలు పాటించడంలేదని, సౌకర్యాలు కల్పించడం లేదని గతంలో వైద్యఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అటువంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా వైద్యఆరోగ్యశాఖ 7 బృందాలుగా విడిపోయి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ల్యాబ్‌ల్లో తనిఖీలు చేపడుతున్నారు.

నోటీసులకే పరిమితమవుతున్న తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా గత 5 రోజుల నుంచి వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రులతో పాటు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. 7 బృందాలుగా విడిపోయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఐదు రోజుల్లో 55 ప్రైవేట్‌ ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో కనీస నిబంధనలు పాటించకుండా, సౌకర్యాలు కల్పించకుండా కొనసాగుతున్న 16 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నడుపుతున్న రెండు ల్యాబ్‌లు, మూడు ఆసుపత్రులకు సైతం నోటీసులకే పరిమితమయ్యారు. అనుమతులు లేకుండా నడుపుతున్న ఆసుపత్రులను, ల్యాబ్‌లను సీజ్‌ చేయాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ జిల్లా వైద్యఆరోగ్యశాఖ మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి.

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు శూన్యం

జిల్లాలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులు రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. మరికొన్ని ఆసుపత్రుల్లో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తునప్పటికీ వైద్యఆరోగ్యశాఖకు పట్టింపు లేకుండా పోతుంది. ఈ ప్రైవేట్‌ ఆసుపత్రుల పనితీరు ఇటీవల వైద్యఆరోగ్యశాఖ తనిఖీల్లో వెలుగు చూస్తున్నా చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నట్లు గతంలోనూ రాష్ట్ర బృందం వచ్చి తనిఖీలు చేసి వెలుగు చూడడంతో సీజ్‌ చేశారు. తిరిగి కొన్ని రోజుల తర్వాత ఆ ఆసుపత్రిని తిరిగి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్న సమయం ఆ ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. మరికొన్ని ఆసుపత్రుల్లో చిన్నపాటి జ్వరం వచ్చినా రూ. వేలల్లో, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ రోగులను దోపిడీకి గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక డయాగ్నస్టిక్‌ సెంటర్లు, స్కానింగ్‌ సెంటర్లు అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెలుగు చూస్తున్నప్పటికీ వాటిని సీజ్‌ చేయడం లేదు. ఇలా జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తూతూమంత్రంగానే తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2022-09-30T05:48:29+05:30 IST