కోతుల ఎన్‌క్లోజర్‌లో దూరి చిక్కిన చిరుత

ABN , First Publish Date - 2022-09-23T06:45:19+05:30 IST

తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఉన్న ఎర్రమూతి కోతుల ఎన్‌క్లోజర్‌లోకి దూరిన ఓ చిరుత చిక్కింది. మరొకటి తప్పించుకుంది.

కోతుల ఎన్‌క్లోజర్‌లో దూరి చిక్కిన చిరుత

తిరుపతి అర్బన్‌, సెప్టెంబరు 22: తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో ఉన్న ఎర్రమూతి కోతుల ఎన్‌క్లోజర్‌లోకి దూరిన ఓ చిరుత చిక్కింది. మరొకటి తప్పించుకుంది. దీంతో జూపార్కులోని జంతువులకు రక్షణ లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. కొద్దిరోజుల క్రితం శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నాలుగు చిరుత పులులు ఎన్‌క్లోజర్‌లోని జింకలపై దాడి చేసి చంపిన విషయం మరువక ముందే క్యూరేటర్‌ కార్యాలయానికి, ప్రవేశ ద్వారానికి అతి సమీపంలో ఉన్న ఎర్రమూతి కోతుల ఎన్‌క్లోజర్‌లోకి వస్తున్నాయి. ఈ విషయం గురువారం రాత్రి బయటపడింది. రాత్రి కోతుల ఎన్‌క్లోజర్‌ వద్ద వాటి అరుపులు విన్న వాచర్లు అక్కడకు వెళ్లి చూసేసరికి అప్పటికే అక్కడున్న బోనులోకి ఓ చిరుత దూరితే, మరొకటి వీరిని గమనించి అడవిలోకి పారిపోయింది. బోనులోకి దూరిన చిరుత బయటకు రాకుండా వెంటనే వాచర్లు గేట్లు మూసేశారు. ఈ విషయం అటవీశాఖ ఉన్నతాధికారులకు తెలియడంతో వారి సూచనల మేరకు పట్టుబడ్డ చిరుతను  అక్కడి నుంచి తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే.. సీసీఎఫ్‌ కానీ, క్యూరేటర్‌ కానీ అందుబాటులోకి రాలేదు.  


Updated Date - 2022-09-23T06:45:19+05:30 IST