Kakra: చీతాల సంబరం సరే.. మా బతుకుల్లో మార్పు ఎప్పుడని నిలదీస్తున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2022-09-18T02:01:00+05:30 IST

చీతాల సంబరం ముగిసింది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి మళ్లీ వాటి అడుగు దేశంలో పడింది. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలతో..

Kakra: చీతాల సంబరం సరే.. మా బతుకుల్లో మార్పు ఎప్పుడని నిలదీస్తున్న గ్రామస్తులు

చీతాల సంబరం (IndiaWelcomesCheetah) ముగిసింది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి మళ్లీ వాటి అడుగు దేశంలో పడింది. ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చీతాలతో బయలుదేరిన ప్రత్యేక కార్గో విమానం పది గంటలు ప్రయాణించి శనివారం ఉదయానికి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకుంది. అక్కడ నుంచి వాటిని కునో నేషనల్‌ పార్కు వద్దకు చేర్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చీతాలను పార్కులోకి విడిచిపెట్టారు. శనివారమే మోదీ జన్మదినం (HappyBdayModi) కూడా కావడంతో ఏటా ప్రత్యేక రీతిలో జన్మదినం జరుపుకునే మోదీ ఈసారి చీతాల సమక్షంలో రోజంతా గడిపారు. బీజేపీ శ్రేణులతో పాటు వన్య ప్రాణి ప్రేమికులు ఈ ఘట్టాన్ని గొప్పగా కీర్తించారు. అయితే.. చీతాల సంబరం సరే.. మరి తమ బతుకుల్లో మార్పు ఎప్పుడని కునో నేషనల్‌ పార్కు (Kuno National Park) సమీప గ్రామమైన కక్రా గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు.


శివ్‌పురి, షియోపూర్ మధ్య ఉన్న ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ ఒక్క గ్రామమే కాదు షియోపూర్ జిల్లాల్లోని చాలా గ్రామలదీ అదే దుస్థితి. చిరుతలను తీసుకురావడాన్ని ఒక చారిత్రక ఘట్టంగా చెబుతున్న పాలకులు తమ జీవితాల్లో మార్పు ఎప్పుడు తీసుకొస్తారని కక్రా గ్రామ ప్రజలు నిలదీశారు. షియోపూర్‌ జిల్లాలో దాదాపు 21 వేల మంది చిన్నారులకు సరైన పోషకాహారం కూడా అందడం లేదు. అంతమంది చిన్నారులు పోషకాహార సమస్యతో బాధపడుతూ ఎండిన డొక్కలతో కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పింది ప్రతిపక్షాలు కాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా వెల్లడించిన సత్యం.



కక్రా గ్రామంలో కూడా ముగ్గురు, నలుగురు చిన్నారులు పోషకాహార సమస్యతో ఇబ్బందిపడుతున్నారని ఆ గ్రామ ప్రజలు చెప్పారు. రెండు వారాల క్రితం ఇదే జిల్లాలో ఒక చిన్నారి పోషకాహార సమస్య కారణంగా చనిపోయిన దీన స్థితి. సరైన ఉపాధి అవకాశాలు లేక పేదరికంలో మగ్గిపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చీతాలను తీసుకొచ్చి కునో నేషనల్‌ పార్కులోకి వదిలితే పర్యాటకలు పెరగడం, ఏవైనా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందనే వాదనను కూడా సమీప గ్రామాల ప్రజలు కొట్టిపారేస్తున్నారు. ఈ కునో నేషనల్ పార్క్ చుట్టుపక్కల 23 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని 56,000 మంది ప్రజలు పేదరికంతో అల్లాడిపోతున్నారు. పిల్లలకు సరైన పౌష్టికాహారాన్ని అందించలేకపోవడంతో చిన్నారులు పోషకాహార సమస్యతో బాధపడుతున్నారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు పలు సార్లు రాజకీయంగా హవా కొనసాగించాయి. కానీ.. ఇప్పటికీ ఆ గ్రామాల ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించని పరిస్థితులున్నాయి. ఇదిలా ఉండగా.. ఐదు ఆడ, మూడు మగ చీతాలను దేశంలోకి తీసుకొచ్చారు. ఆడ చీతాల వయసు రెండు నుంచి ఐదేళ్లు ఉండగా, మగవాటి వయసు 4.5 నుంచి 5.5 ఏళ్లు. వీటి తరలింపునకు నమీబియా కేంద్రంగా పనిచేస్తున్న చీతాల సంరక్షణ సంస్థ ‘సీసీఎఫ్‌’.. భారత్‌కు సహకరించింది.

Updated Date - 2022-09-18T02:01:00+05:30 IST