దళితులను ఎంత హింసిస్తే అంత గౌరవమా?

ABN , First Publish Date - 2021-07-17T05:57:43+05:30 IST

దళిత ఉద్యోగులు లక్షలమంది ఉన్నారు, పోలీసుశాఖలో వేలాదిమంది ఉన్నారు. మరియమ్మలాంటి సంఘటనల మీద వారంతా ఎందుకు స్పందించడం లేదు? దళిత పోలీసు అధికారులు కూడా దళితులను కాపాడలేకపోతున్నారు...

దళితులను ఎంత హింసిస్తే అంత గౌరవమా?

దళిత ఉద్యోగులు లక్షలమంది ఉన్నారు, పోలీసుశాఖలో వేలాదిమంది ఉన్నారు. మరియమ్మలాంటి సంఘటనల మీద వారంతా ఎందుకు స్పందించడం లేదు? దళిత పోలీసు అధికారులు కూడా దళితులను కాపాడలేకపోతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబు రైతులు పోరాడుతూంటే, దేశసరిహద్దుల్ని కాపాలాకాస్తున్న వాళ్ల బిడ్డలు ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డారు. మరి దళిత ఐపిఎస్, ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడరు? దళిత ఉద్యోగులు కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపవచ్చుకదా?


మరియమ్మ లాకప్ హత్య దళితులను తీవ్ర అభద్రతాభావానికి గురిచేసిన దారుణఘటన. ముఖ్యమంత్రి కెసిఆర్ హడావుడిగా అఖిలపక్షం ఏర్పాటు చేసి, మరియమ్మ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించడంతో, సమావేశంలో పాల్గొన్న నాయకులు సంతృప్తిచెందారు. నష్టపరిహారం సాధించడంతో సరిపోయినట్టేనా, అదే అంతిమవిజయమా? దళితుల ఆలోచనలో, సమాజం ఆలోచనలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదా? పోలీసుల దృక్పథంలో మార్పుకోసం దళిత మేధావులతో పోలీసులకు శిక్షణ ఇప్పించడం వంటి ఏ ప్రయత్నాలూ జరగడం లేదు. ఉన్నతస్థాయి పోలీసు అధికారుల ఆలోచనలే దళిత వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కిందిస్థాయి కానిస్టేబుల్స్ ఎలా ప్రవర్తిస్తారో ఊహించలేమా? 


దళితుల మీద మనువాదుల హింస, పోలీసు హింస పెరుగుతూనే ఉన్నది. దళిత సమాజాన్ని ఎవరు ఎక్కువ హింసిస్తారో వాళ్లు సమాజం దృష్టిలో హీరోలవుతున్నారు. దళితులకు న్యాయం కూడా వెంటనే దక్కదని చాలా సంఘటనలు చెప్తున్నాయి. కారంచేడు మారణకాండలో న్యాయం జరగడానికి ఇరవై మూడేళ్లు పట్టింది. చుండూరు ఘటనలో నిందితులకు కింది కోర్టులో శిక్షలు పడితే, హైకోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు గానీ కేసు పరిస్థితి ఏమిటో తెలియనిస్థితి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులో రోహిత్‌ వేముల వ్యవస్థీకృత హత్య జరిగినప్పుడు ప్రపంచం అంతా ఆందోళన చెందింది కానీ ఆ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌కు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారం ఇచ్చింది. అయేషా మీరా హత్యలో సత్యంబాబును పోలీసులు అరెస్టు చేశారు. అయేషా తల్లిదండ్రులు అతడు నిర్దోషి అని చెబుతున్నా, పోలీసులు మాత్రం అతడిని ఎనిమిదేళ్లు జైలులో పెట్టారు. చివరికి కోర్టు సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది.


నిజామాబాదు జిల్లా అభంగపట్నంలో భరత్ రెడ్డి అనే వ్యక్తి దళితులను దారుణంగా హింసించి, అవమానిస్తే, దళిత సంఘాల పోరాటం తరువాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడు బెయిల్ మీద రిలీజ్ అయితే, వందలాది బైకులతో అతనికి స్వాగతం పలికారు. అతణ్ణి సర్పంచిగా గెలిపించారు. తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేసి అవమానించారు. దళిత పక్షపాతినని చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తోట త్రిమూర్తులుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తున్నారు. అలాగే ప్రణయ్ హత్య జరిగినప్పుడు మారుతీరావును జైలుదాకా ఊరేగిస్తూ తీసుకెళ్లారు. ఎవరు దళితులను ఎంత హింసిస్తే, అంత గొప్ప గౌరవాన్ని వాళ్లు పొందుతున్నట్టు అనేక ఘటనలు నిరూపిస్తున్నాయి. 


అమెరికాలో నల్లజాతీయులపై జరిగిన అట్రాసిటీలపై అక్కడి ప్రభుత్వాలు వేగంగా విచారణ జరిపి నిందితులను శిక్షిస్తున్నాయి. ఇటీవలి జార్జ్ ఫ్లాయిడ్ మృతికేసులో న్యాయమూర్తి కాహిల్ విచారణ సందర్భంగా ఓ వ్యాఖ్యచేశారు. ‘ఈ తీర్పు ఉద్వేగంతోనో, సానుభూతితోనో ఇచ్చింది కాదు. ఫ్లాయిడ్ కుటుంబంతో పాటు అలాంటి ఎన్నో కుటుంబాలు అనుభవించిన తీవ్ర వేదనను గుర్తిస్తూ ఇచ్చిన తీర్పు’ అని ప్రకటిస్తూ నిందితుడైన పోలీసు అధికారి డెరిక్‌చోవిన్‌కి 22.5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు.


మరి ఇక్కడ మరియమ్మ లాంటి అనేక కుటుంబాలు అనుభవించిన వేదనను గుర్తిస్తూ న్యాయవ్యవస్థ నిందితులను శిక్షించగలుగుతుందా? నూటికి ఎనభై కేసులలో నిందితులు తప్పించుకోవడానికి నేర విచారణ వ్యవస్థ దోహద పడుతోందనే విమర్శలున్నాయి. ఒక్క సానుభూతి మాటనైనా ఈ పాలకులు, కోర్టులు అనగలవా? దళితుల మీద జరిగే హింసకు దళితులు మాత్రమే ఎదురు తిరగాలన్నట్టుగా ఇతరులు చోద్యం చూస్తూ నిలబడటం బాధాకరం. ఇక, దళిత ఉద్యోగులు లక్షల మంది ఉన్నారు, పోలీసు శాఖలో వేలాదిమంది దళితులున్నారు. మరియమ్మలాంటి సంఘటనల మీద వారంతా ఎందుకు స్పందించడం లేదు? దళిత పోలీసు అధికారులు కూడా దళితులను కాపాడలేకపోతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబు రైతులు పోరాడుతూంటే, దేశసరిహద్దుల్ని కాపాలాకాస్తున్న వాళ్ల బిడ్డలు ఆ రైతులకు మద్దతుగా నిలబడ్డారు. మరి దళిత ఐపిఎస్, ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడరు? దళిత ఉద్యోగులు కనీసం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపవచ్చుకదా? దళితుల పట్ల హింసాత్మక వైఖరి సమాజంలోనే కాదు, చట్టాలని అమలు చేసే అధికార యంత్రాంగానికి కూడా ఉంది. దళితుల మానవ హక్కులకోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ మహద్ చెరువు పోరాటం చేశాడు. ఆ మహనీయుని స్ఫూర్తితో దళిత్ లైవ్స్‌ మ్యాటర్ నినాదంతో దళితజాతిని ఐక్యం చేసే ప్రయత్నం జరుగుతున్నది. మరియమ్మ ఘటనతోనైనా దళిత సమాజం సంఘటితమై, సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా దళితులను నడపడానికి నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా రేపు ఖమ్మం పట్టణంలో మరియమ్మ న్యాయ సాధనాసభను నిర్వహిస్తున్నాం.


చేకూరి చైతన్య

ప్రధాన కార్యదర్శి, ద్రవిడ బహుజన సమితి

Updated Date - 2021-07-17T05:57:43+05:30 IST