రెండో విడతలోనూ అన్యాయం

ABN , First Publish Date - 2020-12-02T04:46:07+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం రెండో విడతలోనూ పలువురు చేనేతలకు అన్యాయం జరిగింది.

రెండో విడతలోనూ అన్యాయం
మగ్గం నేస్తున్న నేతన్న

ఆవేదన వ్యక్తం చేస్తున్న నేతన్నలు 

981 కుటుంబాలకు అందని లబ్ధి


కడప (నాగరాజుపేట), డిసెంబరు 1: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం రెండో విడతలోనూ పలువురు చేనేతలకు అన్యాయం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల చేనేత కు టుంబాలు ఉన్నాయి. మొదటి విడతలో ఒక్కో కుటుంబానికి రూ.24 వేల చొప్పున 11,898 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మొదటి విడతలో తప్పిపోయిన అర్హుల కుటుంబాలు జిల్లా వ్యాప్తంగా 2,300 ఉన్నట్లు గుర్తించారు. వీరిలో రెండో విడతలో 1319 మంది ఖాతాలకు నేతన్న నేస్తం డబ్బు జమ అవుతున్నట్లు లబ్ధిదారులకు సమాచారం అందించారు. మిగిలిన 981 మంది అర్హుల కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ముడిసరుకును ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకోవడానికి వారం, పది రోజులు పడుతుందని, ఆ సమయంలో ఖాళీగా ఉన్న మగ్గాలను చూసి థర్డ్‌ పార్టీ ఆడిట్‌ సర్వే పేరుతో అన్యాయం చేశారని వాపోతున్నారు. గతంలో చేనేత ఏడీ కార్యాలయం నుంచి అభివృద్ధి అధికారి, స్థానిక ఎంపీడీవో, వలంటీరు, సంక్షేమ కార్యదర్శి సర్వే చేసి ఇచ్చిన జాబితాలో తామున్నామని వారు అంటున్నారు. ఆడిట్‌ సర్వే పేరుతో తమ ఖాతాల్లో డబ్బు వేయలేదని, ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని అర్హులైన బాధితులు కోరుతున్నారు. దీనిపై చేనేత జౌళి శాఖ ఏడీ అప్పాజీని వివరణ కోరగా అర్హులైన వారు తమ దృష్టికి కానీ, కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి కానీ తీసుకొస్తే ఉన్నతాధికారులకు పంపుతామని తెలిపారు.

Updated Date - 2020-12-02T04:46:07+05:30 IST