విదేశీ ప్రయాణికులకు ‘పరీక్ష’

ABN , First Publish Date - 2021-12-05T13:49:01+05:30 IST

చెన్నై వస్తున్న విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. వివిధ పనులపై ఇక్కడకు వచ్చేవారు, ఇతర దేశాల్లో పనులు ముగించుకుని వచ్చేవారు పరీక్షల కోసం గంటలకొద్దీ విమానాశ్రయంలో

విదేశీ ప్రయాణికులకు ‘పరీక్ష’

- విమానాశ్రయంలో మరింత కఠినంగా నిబంధనలు

- కరోనా పరీక్షల కోసం ఆరు గంటల నిరీక్షణ


చెన్నై: చెన్నై వస్తున్న విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. వివిధ పనులపై ఇక్కడకు వచ్చేవారు, ఇతర దేశాల్లో పనులు ముగించుకుని వచ్చేవారు పరీక్షల కోసం గంటలకొద్దీ విమానాశ్రయంలో వేచివుండాల్సి వస్తోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా వ్యాప్తి నిరోధక కట్టుబాట్లను కఠినతరం చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో కరోనా నెగటివ్‌ నిర్ధారణ అయితేనే ప్రయాణికులను బయటకు పంపుతున్నారు. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులంతా గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ సహా పలు విదేశాలలో కొత్త రూపును సంతరించుకున్న ‘ఒమైక్రాన్‌’ వైరస్‌ కేసులు బయటపడటంతో రాష్ట్రమంతటా విమానాశ్రయాల్లో ఆరోగ్యశాఖ అధికారులు తీవ్రనిఘా ఏర్పాటు చేశారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై విమానాశ్రయాలలో ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరోగ్యశాఖ అధికారులు విదేశీప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలలో ఫలితాలు వెలువడటానికి కనీసం ఆరుగంటలు పడుతోంది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి వుండాల్సి వస్తోంది. ప్రయాణికులంతా విమానాశ్రయంలో అధిక ధరలు చెల్లించి భోజనం, అల్పాహారం చేయాల్సి వస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంలో కాఫీ రూ.160, రెండు ఇడ్లీలు రూ.160, పొంగల్‌ రూ.160, కిచిడీ రూ.200, శాండ్‌విచ్‌ రూ.180, అరలీటర్‌ వాటర్‌ బాటిల్‌ రూ.60కు విక్రయిస్తున్నారు. ఈ ధరల్ని చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసర పనుల మీద బయటకు రావాల్సిన వారు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలకు బదులకు అధిక ఫీజులు చెల్లించి ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకుని అరగంటలో ఫలితాలు తెలుసుకుని బయటపడుతున్నారు.

Updated Date - 2021-12-05T13:49:01+05:30 IST