Five-tier security: చెన్నై విమానాశ్రయానికి ఐదంచెల భద్రత

ABN , First Publish Date - 2022-08-10T16:06:02+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల(Independence Day Celebrations) సందర్భంగా ఉగ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశమున్నట్లు

Five-tier security: చెన్నై విమానాశ్రయానికి ఐదంచెల భద్రత

- ముమ్మర తనిఖీలు 

- విమానాశ్రయంలోకి సందర్శకుల నిషేధం


చెన్నై, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల(Independence Day Celebrations) సందర్భంగా ఉగ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశమున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం హెచ్చరించటంతో స్థానిక మీనంబాక్కంలోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద ఐదంచెల భద్రత కల్పించారు. సోమవారం రాత్రి నుంచే ఈ భద్రత అమల్లోకి వచ్చింది. విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చే అన్ని వాహనాలను పోలీసు జాగిలాలు, మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం(Airport)లోని అన్ని విభాగాల వద్ద సాయుధ దళ పోలీసులు కాపలా కాస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(Central Industrial Security Force) సభ్యులు కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. విమానాశ్రయం ప్రధాన ప్రాంగణంలోని సందర్శకులను అనుమతించకుండా కట్టుదిట్టం చేశారు. విమానాలకు ఇంధనం నింపే ప్రాంతాల వద్ద అదనపు దళాలతో పటిష్ఠమైన కాపలాను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ప్రయాణికులు ద్రవరూప వస్తువులు, ఊరగాయలు, హల్వా, జామ్‌ వంటి వస్తువులను తీసుకురాకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. కార్గో విమానాల ప్రాంతాల వద్దకూడా అదనపు బలగాలు మోహరించాయి. లగేజీ(luggage)ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులను కూడా భద్రతా విభాగం అధికారులు, కస్టమ్స్‌ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ జరుపుతున్నారు. ఈ కారణంగా జాతీయ విమానాశ్రయానికి విమానాలు బయలుదేరటానికి ఒకటిన్నర గంటలకు ముందుగా రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులు మూడు గంటలు ముందుగా రావాలని పేర్కొన్నారు. ఈ ఐదంచెల భద్రతా ఏర్పాట్లు ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి వరకూ కొనసాగుతాయన్నారు. ఇక ఈ నెల 13 నుంచి 15 వరకు రెండు విమానాశ్రయాల వద్ద ఏడంచెల భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు భద్రతా విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విధంగా నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, ప్రధాన బస్టాండ్ల వద్ద కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. చెన్నై సెంట్రల్‌, ఎగ్మూరు రైల్వేస్టేషన్ల వద్ద రైల్వే పోలీసులు, సాయుధ దళం పోలీసులు కాపలా కాస్తున్నారు. ప్రయాణికులను మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తర్వాతే  లోపలకు అనుమతిస్తున్నారు.

Updated Date - 2022-08-10T16:06:02+05:30 IST