Shortage of diesel: నగరంలో డీజిల్‌ కొరత

ABN , First Publish Date - 2022-09-06T12:45:14+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో డీజిల్‌ కొరత నెలకొంది. బంకుల్లో డీజిల్‌(Diesel) నిల్వలు అయిపోవడంతో ఎక్కడ చూసినా ‘డీజిల్‌ నో స్టాక్‌’ బోర్డులు

Shortage of diesel: నగరంలో డీజిల్‌ కొరత

చెన్నై, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరం చెన్నైలో డీజిల్‌ కొరత నెలకొంది. బంకుల్లో డీజిల్‌(Diesel) నిల్వలు అయిపోవడంతో ఎక్కడ చూసినా ‘డీజిల్‌ నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రక్కుల, వ్యాన్‌లు, జీపులు, కార్ల యజమానులు డీజిల్‌ లభించక ఇబ్బందులకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా చమురు సంస్థలు డీలర్లు నిర్వహించే పెట్రోలు బంకులకు తక్కువ పరిమాణంలో డీజిల్‌ సరఫరా చేయడంతో ఈ కొరత ఏర్పడినట్లు బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. పొన్నేరి సమీపం కాట్టుపల్లిలోని హిందూస్థాన్‌ పెట్రోలియం నుంచి నగరంలోని పెట్రోలు బంకులకు డీజిల్‌(Diesel) సరఫరా అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతుండటంతో పాత ధరకే డీజిల్‌ సరఫరా చేస్తే తమకు నష్టాలు వస్తాయని భావించే హిందూస్థాన్‌ పెట్రోలియం నగరానికి తక్కువగా డీజిల్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి కాట్టుపల్లి హిందూస్థాన్‌ పెట్రోలియం సంస్థ నగరానికి డీజిల్‌ సరఫరా పూర్తిగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో డీలర్లు కరూరు నుంచి డీజిల్‌ను తెప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా నగరంలోని యాభైశాతానికి పైగా పెట్రోలు బంకులలో డీజిల్‌ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు.

Updated Date - 2022-09-06T12:45:14+05:30 IST