Chennai: గంజాయి పంజా !

ABN , First Publish Date - 2022-08-26T14:28:25+05:30 IST

నగరంపై గంజాయి పంజా విసురుతోంది. పోలీసులు రేయింబవళ్లు సోదాలు చేస్తున్నా, తన దారిన తాను పడగ విప్పి కాటేస్తోంది. విద్యాలయాలే

Chennai: గంజాయి పంజా !

- నగరంలో పెరిగిన విక్రయాలు

- విద్యాలయాలే ప్రధాన టార్గెట్

- ఏపీ నుంచే అత్యధికంగా దిగుమతి


చెన్నై, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నగరంపై గంజాయి పంజా విసురుతోంది. పోలీసులు రేయింబవళ్లు సోదాలు చేస్తున్నా, తన దారిన తాను పడగ విప్పి కాటేస్తోంది. విద్యాలయాలే టార్గెట్‌గా, యువతే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతుండడం పట్ల పోలీస్ శాఖ(Police Department) సైతం తలపట్టుకుంటోంది. సముద్ర తీరాన ఉండడం, అంతర్జాతీయ విమానాల రాకపోకలు తదితరాల కారణంగా చాలాకాలంగా నగరానికి మత్తుపదార్థాల దిగుమతి ఉన్నప్పటికీ గత ఏడాదిగా అత్యధిక స్థాయిలో మాదకద్రవ్యాలు దిగుమతవుతున్నట్లు తెలుస్తోంది. గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌ సహా  మత్తుబిళ్లలు సైతం భారీగా విక్రయమవుతున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ప్లస్‌ వన్‌ నుంచి ఉన్నత తరగతులు జరిగే విద్యాలయాలే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసుల సోదాల్లో స్పష్టమవుతోంది. దీనికి తోడు గుట్కా విక్రయాలు సైతం ఇబ్బడిముబ్బడి జరుగుతోంది. గత ఏడాదే పరిస్థితిని గ్రహించిన పోలీస్ శాఖ.. కఠిన చర్యలకు సిద్ధమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతోంది. గతంలో కనీవినీ ఎరుగని విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి రేయింబవళ్లు తనిఖీలు చేస్తోంది. అయినా గంజాయి దిగుమతి తగ్గడం లేదు. స్మగ్లర్లు పలు మార్గాల్లో యధేచ్ఛగా గంజాయి దిగుమతి చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని విశాఖ కేంద్రంగా ఈ దిగుమతులు జరుగుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. గంజాయి పట్టుబడే కేసుల్లో అత్యధికం ఏపీ నుంచి వస్తున్నవేనని పోలీసులు చెబుతున్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, దిగుమతి తగ్గుముఖం పట్టకపోవడంతో డీజీపీ శైలేంద్రబాబు కఠిన చర్యలకు ఆదేశించారు. గంజాయి విక్రయించేవారి ఆస్తులను స్తంభింపజేయాలని ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నా ఆశించిన మేరకు ఫలితాలు కానరావడం లేదని దర్యాప్తు సంస్థలే చెబుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతున్నందునే సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని కఠిన చర్యలకు ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర చెన్నై కేంద్రంగా ఇతర ప్రాంతాలకు గంజాయి, గుట్కా సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. అడ్డదారిన సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లు ఉత్తర చెన్నైలో నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. 

విద్యాలయాల సమీపంలో వుండే దుకాణాలు, ఐస్‌క్రీం, తినుబండారాల దుకాణాల ద్వారా గంజాయి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తుండడంతో వాటిని పట్టుకోవడం పోలీసులకు శక్తికి మించిన భారంగా మారింది. చదువు కోసం వెళ్లే యువకులు వీటిపట్ల ఆకర్షితులవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి వుంచడం మంచిదని పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. విద్యార్థులు అసహజంగా ప్రవర్తిస్తుండడం, మౌనం దాల్చడం, విపరీత ధోరణులతో వున్నట్లు కనిపిస్తే తల్లిదండ్రులు(parents) వెంటనే జోక్యం చేసుకుని పరిష్కార చర్యలు  చేపట్టాలని వారు సూచిస్తున్నారు.

Updated Date - 2022-08-26T14:28:25+05:30 IST