Chennai శివారులో క్రీడా నగరం

ABN , First Publish Date - 2022-04-22T14:23:26+05:30 IST

రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ క్రీడల్లో మరింతగా రాణించి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా

Chennai శివారులో క్రీడా నగరం

- రూ.25 కోట్లతో ‘ఒలింపిక్‌ స్వర్ణ వేట’ పథకం

- రూ.10 కోట్లతో బాక్సింగ్‌ స్టేడియం

- రాష్ట్రంలో 4 ఒలింపిక్‌ అకాడమీలు

- ప్రతి నియోజకవర్గంలోనూ స్పోర్ట్స్‌ ఆడిటోరియం

- జల్లికట్టు కోసం అలంగానల్లూరులో ‘ప్రత్యేక మైదానం’

- మళ్లీ ‘చెన్నై ఓపెన్‌’ టెన్నిస్‌ టోర్నమెంట్‌

- అసెంబ్లీలో సీఎం ప్రకటన


చెన్నై: రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరాల జల్లు కురిపించారు.  రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ క్రీడల్లో మరింతగా రాణించి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా వారికి శిక్షణ ఇచ్చేందుకు, ప్రోత్సహించేందుకు చెన్నై శివారు ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక క్రీడా నగరాన్ని (స్పోర్ట్స్‌ సిటీ) నిర్మిస్తామని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.25 కోట్లతో ‘ఒలింపిక్‌ స్వర్ణ వేట’ అనే పేరుతో బృహత్తర ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ మలివిడత బడ్జెట్‌  సమావేశాల్లో భాగంగా గురువారం సభలో సీఎం 110వ నిబంధన కింద ప్రత్యేక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖపై వరాల వర్షం కురిపించారు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నవారే క్రీడల్లో రాణించగలరని, దీన్ని దృష్టిలో ఉంచుకుని యువజన క్రీడల మంత్రిత్వ శాఖ అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోన్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాష్ట్రం నుంచి పాల్గొనే క్రీడాకారులు, బృందాలు కొన్నేళ్ళుగా మంచి విజయాలను సాధిస్తున్నారని, దీనికి కారణం ప్రభుత్వం ఇచ్చే శిక్షణతో పాటు అనేక రకాల రాయితీలు, ప్రోత్సాహాలే కారణమన్నారు. ప్రపంచ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారని, ఇలాంటి వారికి రూ.3 కోట్లతో పాటు అనేక ప్రోత్సాహకాలను అందజేస్తున్నామన్నారు.  స్పోర్ట్స్‌ సిటీలో శిక్షణ పొందడం వల్ల ప్రపంచ క్రీడల్లో రాణించడంతో పాటు రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు దోహదపడుతుందన్నారు. అంతేకాకుండా, ఒలింపిక్‌ వంటి పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు గెలుచుకునేందుకు వీలుగా రాష్ట్రంలోని నాలుగు రీజియన్లలో నాలుగు ఒలింపిక్‌ అకాడమీలను నెలకొల్పుతామన్నారు. అలాగే, రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్పోర్ట్స్‌ ఆడిటోరియంలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఒలింపిక్‌ పోటీల్లో బంగారం పతకాన్ని గెలుచుకునేందుకు  ‘ఒలింపిక్‌ స్వర్ణ వేట’ అనే పథకాన్ని ప్రారంభిస్తున్నామని, దీనికోసం రూ.25 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఉత్తర చెన్నైలోని వివిధ పోటీలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని చెబుతూ.. రూ.10 కోట్లతో బాక్సింగ్‌ స్టేడియం నిర్మిస్తామని ప్రకటించారు. అలంగానల్లూరులో జల్లికట్టు కోసం ప్రత్యేకంగా ఒక మైదానాన్ని నిర్మిస్తామన్నారు. అలాగే ఆత్మరక్షణ కోసం రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సిలంబాట్టంను ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని చెబుతూ.. సిలంబాట్టంలో రాణించే క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన జీవోను త్వరలోనే జారీచేస్తామన్నారు. గతంలో చెన్నై నగరం అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా నిలిచిందన్నారు. ఇలాంటి వాటిలో ‘చెన్నై ఓపెన్‌ ఏటీపీ టెన్నిస్‌ టోర్నీ’ అని గుర్తు చేస్తూ దానిని మళ్లీ ప్రారంభిస్తామన్నారు. బీచ్‌ ఒలింపిక్స్‌ పునఃప్రారంభించే అంశంపై దృష్టిసారించామని, వివిధ క్రీడాపోటీలకు అంతర్జాతీయ స్థాయి వేదికగా చెన్నైను మార్చడమే కాకుండా పర్యాటక రంగాభివృద్ధికి, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతర్జాతీయ చెస్‌ పోటీల్లో రాష్ట్రానికి చెందిన గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌ వంటి అనేక మంది గ్రాండ్‌మాస్టర్లను రాష్ట్రం తయారు చేసిందని గుర్తు చేస్తూ.. దేశ క్రీడారంగానికి మణిహారంగా 44వ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ పోటీలను జూలై 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నగరంలోనే నిర్వహించనున్నామని సీఎం వివరించారు.

Updated Date - 2022-04-22T14:23:26+05:30 IST