కోవైలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-05-05T13:42:59+05:30 IST

తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న కోయంబత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఈ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండడంతో వేడి

కోవైలో భారీ వర్షం

                       - చల్లబడిన వాతావరణం

 

ప్యారీస్‌(చెన్నై): తీవ్ర వేడిమితో అల్లాడిపోతున్న కోయంబత్తూరు జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. ఈ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుండడంతో వేడి తట్టుకోలేక ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు.  ఇదిలా ఉండగా, వాతావరణంలో మార్పుల కారణంగా మంగళవారం సాయంత్రం కోవై, పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం కురిసి, ప్రధాన రోడ్లపై నీరు ప్రవహిచింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.


ఏడు జిల్లాలకు భారీ వర్షసూచన...

రాష్ట్రంలో వేలూరు, తిరుపత్తూర్‌, తిరువణ్ణామలై సహా ఏడు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ సెందామరైకన్నన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా బుధవారం ఉదయం నుంచి ఉరుములతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది. గురువారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణగిరి, ధర్మపురి, తిరుపత్తూర్‌, సేలం, తిరువణ్ణామలై, నీలగిరి జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశమున్నందువల్ల రెవెన్యూ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. శుక్ర, శనివారాల్లో డెల్టా జిల్లాలైన కడలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట, పశ్చిమ కనుమలు ఆనుకొని ఉన్న ఈరోడ్‌, కరూర్‌, మదురై, కన్నియాకుమారి, తిరునల్వేలి, సేలం, నామక్కల్‌, ధర్మపురి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. కాగా, చెన్నై  నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియ్‌సగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో నీలగిరి జిల్లా ఎమరాల్డ్‌, కృష్ణగిరి జిల్లా నెడుంగళ్‌లో తలా 30 మి.మీ, సేలం, మేట్టూరు, ధర్మపురి, మారండహల్లి, కృష్ణగిరి ప్రాంతాల్లో తలా 20 మి.మీ, నీలగిరి జిల్లా కెత్తి, గూడలూరు, ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాళయం, కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయంలో తలా 10 మి.మీ వర్షపాతం నమోదైందని సెన్‌తామరైకన్నన్‌ తెలిపారు.

Read more