Chennaiని భయపెడుతున్న అల్పపీడనం

ABN , First Publish Date - 2021-11-30T15:13:43+05:30 IST

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ ప్రకటించారు. దీంతో రాబోయే మూడు రోజుల్లో సముద్రతీర జిల్లాల్లో

Chennaiని భయపెడుతున్న అల్పపీడనం

- తుఫానుగా మారే అవకాశం 

- రాష్ట్రానికి భారీ వర్ష సూచన

- కోలుకోని చెన్నై


చెన్నై: బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ పువియరసన్‌ ప్రకటించారు. దీంతో రాబోయే మూడు రోజుల్లో సముద్రతీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతంలో కొత్తగా అల్పపీడనం సోమవారం ఏర్పడుతుందని అంచనా వేశామని, చివరకు మంగళవారం ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనంతోపాటు కన్నియాకుమారి తీరంలో ఉపరితల ఆవర్తనం తోడై రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారనున్న సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీల వేగంతో పెనుగాలులు వీస్తాయని, వచ్చే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు. మంగళవారం ఉదయం విరుదునగర్‌, రామనాధ పురం, తూత్తుకుడి, కన్నియాకుమారి, తెన్‌కాశి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయని చెప్పారు. మదురై, తిరునల్వేలి, కడలూరు, విల్లుపురం, మైలాడుదురై, నాగపట్టినం, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల చెదురుముదురుగా వర్షాలు కురిశాయని తెలిపారు. చెన్నైలో డిసెంబర్‌ ఒకటి నుంచి మూడో తేదీ వరకూ కొన్నిచోట్ల కుండపోతగా, మరికొన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. రుతపవనాల తీవ్రత కారణంగా నగరంలో సోమవారం ఉదయం ఓ మోస్తరుగా వర్షం కురిసిందని చెప్పారు.


జలదిగ్బంధంలోనే కాలనీలు

నగరంలో నాలుగు రోజులుగా విడిచి విడిచి కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించింది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు వాననీటిని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేక పోతోంది. నగరంలోని 300 వీధుల్లో నాలుగు రోజులుగా వర్షపు నీరు వరదలా ప్రవహిస్తోంది. నగరమంతటా 918 మోటారు పంపులతో అధికారులు వాననీటిని తొలగిస్తున్నారు. కేకేనగర్‌, టి.నగర్‌, తేనాంపేట, వలసరవాక్కం, కోడంబాక్కం తదితర ప్రాంతాల్లో ఒక అడుగు లోతున వర్షపునీరు మురుగునీటితో కలిసి పొంగి ప్రవహిస్తోంది. కార్పొరేషన్‌ పరిధిలోని 15 జోన్లలో 103 ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కేకేనగర్‌, చూళైమేడు, కోడంబాక్కం తదితర ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ వర్షపు నీరు, మురుగునీరు ఏరులై పారుతుండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది. కోడంబాక్కం అజీజ్‌నగర్‌లో నాలుగు వీధుల్లో వర్షపునీరు ఇంకా వరదలా పారుతోంది. చూళైమేడు హైరోడ్డులో వర్షపునీరు, మురుగునీటితో కలిసి ప్రవహిస్తోంది. నుంగంబాక్కం పుష్పానగర్‌, తండయార్‌పేట జోన్‌లోని న్యూవాషర్‌మెన్‌పేట, కొరుక్కుపేట, కత్తి వాక్కం, మీనంబాళ్‌నగర్‌, వ్యాసార్పాడి, పులియంతోపు, అంబత్తూరు, తిరువొత్తియూరు, మనలి, వేళచ్చేరి, విల్లివాక్కం, ఆవడి, తాంబరం, ముడిచ్చూరు ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా ఇళ్ల చుట్టూ వర్షపునీరు ప్రవహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాంబరం, పాత పెరుంగళత్తూరు ప్రాంతాల్లో  నివసిస్తున్న వారిని రబ్బరు పడవలపై అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


ఓఎమ్మార్‌లో...

పాతమహాబలిపురం రహదారిలో మూడోరోజు వర్షపు నీరు వరదలా ప్రవహించింది. సోమవారం కురిసిన భారీ వర్షాలకు పాత మహాబలిపురం రహదారి, నావలూరు - సెమ్మంజేరి రహదారిలో రెండడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తోంది. తిరుప్పోరూరు సమీపం కొండంగి, మనామది, సిరుతా వూరు, కాయార్‌, తాళంబూరు చెరువులు నిండి రహదారులపై ఉదృతంగా ప్రవహిసున్నాయి. కేళంబాక్కం-పడూరు రహదారి కూడా జలమయమైంది. సెమ్మంజేరిలోని ప్రై వేటు కళాశాల ఎదుట వరద దృశ్యాలు నెలకొన్నాయి.


రెండు శతాబ్దాల్లో నాలుగోసారి 100 సెం.మీల వర్షం

చెన్నైలో రెండు శతాబ్దాల్లో నాలుగోసారి ఒకే నెలలో 100 సెం.మీల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ పరిశోధన కేంద్రం గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంతకు ముందు 1918 నవంబర్‌లో 108.8 సెం.మీల కంటే అధికంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత 2005లో 10.7.8 సెం.మీలు, 2015లో 104.9 సెం.మీల కంటే అధికంగా వర్షాలు కురిశాయి. తాజాగా నవంబర్‌లో 100 సెం.మీలు దాటి ఇంకా వర్షాలు కురుస్తున్నాయి.


పలు రహదారుల్లో ట్రాఫిక్‌ మళ్ళింపు

నగరంలోని ఏడు రహదారుల్లో ట్రాఫిక్‌ను మళ్ళిస్తూ ట్రాఫిక్‌ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కోడంబాక్కం రంగరాజపురం ద్విచక్రవాహనాలు వెళ్లే సబ్‌వేలో వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. టి.నగర్‌ మేడ్లీ సబ్‌వేలో వర్షపునీరు చేరటంతో ఆ సబ్‌వేలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కేకేనగర్‌ రాజమన్నార్‌ రహదారిలో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను సెకెండ్‌ అవెన్యూ మీదుగా మళ్ళించారు. వలసర వాక్కం తిరువళ్లూరు రహదారి (మెగామార్ట్‌ సమీపం)లో వర్షపునీరు వరదలా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్కాట్‌ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను కేశవర్థిని రోడ్డు మీదుగా మళ్ళిస్తున్నారు. టి.నగర్‌ వాణీమహల్‌ నుంచి బెంచ్‌పార్కు వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇదేవిధంగా ఉదయం థియేటర్‌ కూడలి, మేడ వాక్కం, అశోక్‌నగర్‌, కుమనన్‌ చావిడి వద్ద కూడా ట్రాఫిక్‌ను మళ్ళించారు.



Updated Date - 2021-11-30T15:13:43+05:30 IST