చెన్నై చేరిన ‘స్వర్ణ విజయ్‌ జ్యోతి’

ABN , First Publish Date - 2021-07-25T13:20:55+05:30 IST

చెన్నై నగరానికి వచ్చిన భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధ ‘స్వర్ణ విజయ జ్యోతి’కి ఘనస్వాగతం లభించింది. భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య 1971లో జరిగిన యుద్ధానికి గత యేడాదితో 50 యేళ్ళు

చెన్నై చేరిన ‘స్వర్ణ విజయ్‌ జ్యోతి’

- తాంబరం ఎయిర్స్‌ఫోర్స్‌ కేంద్రంలో ఘనస్వాగతం

- 30న అంజలి ఘటించనున్న స్టాలిన్‌ 


అడయార్‌(చెన్నై): చెన్నై నగరానికి వచ్చిన భారత్‌ - పాకిస్థాన్‌ యుద్ధ ‘స్వర్ణ విజయ జ్యోతి’కి ఘనస్వాగతం లభించింది. భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య 1971లో జరిగిన యుద్ధానికి  గత యేడాదితో 50 యేళ్ళు పూర్తయ్యాయి. దీన్ని పురస్కరించుకుని ఈ యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయ జ్యోతిని గత యేడాది డిసెంబరు ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు అఖండ జ్యోతులను 1971 యుద్ధం పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గహీత గ్రామాలతో పాటు దేశం నాలుగు దిక్కులకు తీసుకెళ్ళారు. ఇందులో దక్షిణం దిక్కునకు తీసుకొచ్చిన జ్యోతి కన్నియాకుమారి వెళ్ళి అక్కడ నుంచి గత జూన్‌ 10వ తేదీన చెన్నైకు వచ్చింది. ఈ జ్యోతికి స్వాగత కార్యక్రమం నగరంలో జరుగగా, ఇందులో రాష్ట్ర గవర్నర్‌ కూడా పాల్గొని నివాళులు అర్పించారు. ఇప్పుడు రెండో దఫా ఈ జ్యోతి నగరానికి వచ్చింది. ఈ స్వర్ణ విజయ జ్యోతికి స్వాగతం పలికే కార్యక్రమం చెన్నై హార్బరులో జరిగింది. ఇందులో తొలుత దక్షిణ భారత్‌ ఆర్మీ ఉప దళపతి ఎ.అరుణ్‌ ఈ విజయ జ్యోతిని చెన్నై హార్బర్‌ ఛైర్మెన్‌ పి.రవీంద్రన్‌కు అందజేయగా, ఆయన స్మారక స్థూపం వద్ద వుంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కోస్ట్‌గార్డ్‌ తూర్పు ప్రాంతీయ దళపతి పటేలా, హార్బర్‌ డిప్యూటీ చైర్మన్‌ ఎస్‌.బాలాజీ అరుణ్‌ కుమార్‌, సైనిక అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాల్గొని అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత ఈ జ్యోతిని అండమాన్‌కు తీసుకెళ్తారు. 


తాంబరం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో... : స్వర్ణం విజయ్‌ వర్ష్‌ పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఈ స్వర్ణ జ్యోతికి స్థానిక తాంబరంలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయానికి చెందిన విద్యార్థులు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1971 యుద్ధంలో పాల్గొన్న వృద్ధ జవాన్లు పాల్గొనగా, వారిని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు సన్మానించారు. ఈ స్వర్ణ విజయ్‌ జ్యోతిని ఎయిర్‌ కమాండర్‌ విపల్‌సింగ్‌, ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌, ఎయిర్‌పోర్స్‌ స్టేషన్‌ తాంబరం సిబ్బందితో పాటు వెటర్న్‌ జవాన్లు స్వాగతం పలికారు.

Updated Date - 2021-07-25T13:20:55+05:30 IST