‘అసాని’ ప్రభావం.. చల్లబడిన రాష్ట్రం...!

ABN , First Publish Date - 2022-05-11T13:38:30+05:30 IST

‘అసాని’ ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆ ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని పది జిల్లాలను ముంచెత్తాయి. దీంతో నెల రోజులుగా తీవ్రమైన ఎండతో

‘అసాని’ ప్రభావం.. చల్లబడిన రాష్ట్రం...!

- పలు జిల్లాలను ముంచెత్తిన వాన

- చెన్నైలో పలు విమానాల రద్దు

- మరో రెండు రోజులు వర్షాలు

- విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం: కోస్టుగార్డు


చెన్నై: ‘అసాని’ ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆ ప్రభావం కారణంగా కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలోని పది జిల్లాలను ముంచెత్తాయి. దీంతో నెల రోజులుగా తీవ్రమైన ఎండతో అల్లాడిపోతున్న జనం కాస్త ఉపశమనం పొందారు. మంగళవారం వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే హఠాత్తుగా కురిసిన వర్షంతో  పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ప్రతికూల వాతావరణం కారణంగా పది విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఉదయాన్నే నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు చేరడంతో వాహనచోదకులకు ఇబ్బందులు తప్పలేదు.


మార్చి నుంచే ఎండ తీవ్రత...

వేసవి సీజన్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా మార్చి మూడో  వారం నుంచే ఎండ తీవ్రత ప్రారంభమైంది. మార్చిలో వేలూరు, కరూర్‌ జిల్లా పరమత్తి సహా పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 38 డిగ్రీల మేర నమోదయ్యాయి. ఇక, ఏప్రిల్‌లో ఎండలు మరింత అధికమయ్యాయి. సుమారు పది జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల  వరకు నమోదుకాగా, మీనంబాక్కంలో 38 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 4న అగ్ని నక్షత్రం ప్రారంభం కావడంతో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది.


‘అసాని’ ప్రభావంతో...

ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ‘అసాని’ తుఫానుగా మారింది. ఇది 13 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ పశ్చిమ బంగాళాఖాతం మీదుగా మంగళవారం ఉదయం వాయువ్య దిశగా ప్రయాణించి సాయంత్రానికి ఆంధ్రా-ఒడిశా తీరానికి సమాంతరంగా వెళ్లింది. ఈ తుఫానుతో ముప్పు లేకపోయినా, దాని ప్రభావంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. డెల్టా జిల్లాలు, పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం మంగళవారం సాయంత్రం వరకు కొనసాగింది. తిరుపత్తూర్‌ జిల్లా ఆంబూరు, జోలార్‌పేట, నాట్రాంపల్లి, వాణియంబాడి పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపడి సుమారు 300 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాంచీపురం, తిరువళ్లూర్‌, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, నాగపట్టణం, మైలాడుదురై, తంజావూరు, తిరువారూరు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, నామక్కల్‌, కళ్లకుర్చి, పుదుకోట, కరూర్‌, సేలం, ధర్మపురి, ఈరోడ్‌, కృష్ణగిరి జిల్లాల్లో వర్షం కురిసింది. 


నగరంలో...

రాజధాని నగరం చెన్నైలో సోమవారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతంగా మారి వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం చిన్నగా ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి దాటిన తర్వాత క్రమంగా పెరిగింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. పురుషవాక్కం, చేపాక్‌, అన్నానగర్‌, కోయంబేడు, నుంగంబాక్కం, విల్లివాక్కం, క్రోంపేట, గిండి, ఎగ్మూర్‌, నుంగంబాక్కం, టి.నగర్‌, సైదాపేట, సెయింట్‌ థామస్‌ మౌంట్‌, పెరంబూర్‌, మీనంబాక్కం సహా పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహించింది. దీంతో మంగళవారం పబ్లిక్‌ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది.


10 విమానాలు రద్దు...

మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వర్షం కురుస్తుండడంతో వాతావరణం అనుకూలించక చెన్నై నుంచి పది విమానాలు రద్దయ్యాయి. చెన్నై నుంచి ఉదయం 7, 10.40 గంటలకు విశాఖ వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అలాగే, విశాఖపట్టణం నుంచి చెన్నైకి ఉదయం 10.30, మధ్యాహ్నం 1.45 గంటలకు రావాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. అలాగే హైదరాబాద్‌, జైపూర్‌, ముంబైలకు కొన్ని విమానాల రాకపోకలు సైతం రద్దయ్యాయి. 


మరో రెండ్రోజులు వర్షాలు...

‘అసాని’ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటూ కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. 


తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధం: కోస్ట్‌గార్డు

‘అసాని’ కారణంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నట్లు కోస్టుగార్డు ప్రకటించింది. తుఫాను కదలికలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఎప్పుడే పరిస్థితి ఎదురైనా రంగంలోకి దూకేందుకు నౌకలు, చమురు, ఇతర అత్యవసర వస్తువులను సిద్ధం చేసుకున్నట్లు పేర్కొంది. తుఫాను తీరం దాటిన తరువాత తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ల సహా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని పేర్కొంది. అదే విధంగా హెలిక్యాప్టర్లతో కూడిన రెండు నౌకలను కూడా తీరంలో సిద్ధం చేసింది. విపత్తుల నివారణా బృందాలను సైతం సిద్ధం చేసింది. 



Read more