బస్సెక్కితే బాదుడే!

ABN , First Publish Date - 2021-01-13T06:33:29+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చేవారికి ప్రయా ణం భారంగా మారుతోంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలను భారీగా పెంచడంతో ప్రయాణికులు కంగు తింటున్నారు.

బస్సెక్కితే బాదుడే!

సంక్రాంతి ప్రయాణం భారం 

ఆర్టీసీలో ‘స్పెషల్‌’ చార్జ్‌

జిల్లా నుంచి 167 ప్రత్యేక బస్సులు  8 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఇష్టారాజ్యం

రైళ్లలో జనరల్‌ బోగీలు నిల్‌.. రిజర్వేషన్‌ ఫుల్‌

పండుగ వేళ చార్జీల మోత

ఒంగోలు (కార్పొరేషన్‌) జనవరి 12: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చేవారికి ప్రయా ణం భారంగా మారుతోంది. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల చార్జీలను భారీగా పెంచడంతో ప్రయాణికులు కంగు తింటున్నారు. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమా న్యాలు అవకాశాన్ని ఆదాయంగా మార్చుకుంటున్నా యి. ఇప్పటికే భారీగా చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఆర్టీసీ అదనంగా 50 శాతం చార్జ్‌ చేస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌ అవకాశాన్ని బట్టి ఏకంగా 100 నుంచి 150శాతం వరకు పెంచేశాయి. దీంతో ఒక కుటుంబం హైదరాబాద్‌నుంచి జిల్లాకు వచ్చి వెళ్లాలంటే చార్జీలే కనీసం రూ.10వేలకుపైగా అవు తోంది. పండుగ ప్రభావంతో ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌ ఇష్టారాజ్యంగా దోచుకోవడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 


ఆర్టీసీ చార్జీలు 50 శాతం వరకూ పెంపు

మామూలు రోజుల్లో ఆర్టీసీలోఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణ చార్జీలు అల్ర్టా డీలక్స్‌కు రూ.371,సూపర్‌లగ్జరీ రూ.440, ఇంద్ర రూ.493, గరుడరూ.577, అమరావతికి రూ.675 వరకూ వసూలు చేస్తున్నారు. అయితే ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకూసంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రస్తుత చార్జీలపై అదనంగా 50శాతం వసూలు చేస్తున్నారు. ఇదేఅదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌వారు మోత మోగిస్తున్నారు. 


ప్రైవేటు ట్రావెల్స్‌ ‘చార్జ్‌’

జిల్లా నుంచి 200లకుపైగా ట్రావెల్‌ బస్సులు హైద రాబాద్‌, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వంటి పెద్ద నగరాలకు నడుస్తున్నాయి. ఈనెల 10వతేదీ ముందు వరకూ హైదరాబాద్‌కు హైటెక్‌ నాన్‌ ఏసీ రూ.450,ఏసీ స్లీపర్‌ (టూటైర్‌) రూ.670, ఓల్వో మల్టీ సెమీ లగ్జరీ రూ.500,హైటెక్‌, మరికొన్ని హైటెక్‌ ఏసీ బస్సులు రూ.500, నాన్‌ఏసీ బస్సులకు రూ.400 వరకూ ఉంది. అదేవిధంగా నాన్‌ ఏసీస్లీపర్‌ రూ.560, ఏసీ స్లీపర్‌ రూ.780వరకూ ఉన్నాయి.అయితే ప్రస్తుతం వాటి ధరలను 100శాతం పెంచేశారు. ఒక్కో టికెట్‌ ధరకు రెట్టింపు చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులకు పాట్లు తప్పడం లేదు. ఈ రెండు, మూడురోజుల్లో డిమాండ్‌ ఉండదు కాబట్టి ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సుల్లో సాధా రణ చార్జీలతోనే తీసుకెళ్లేందుకు సిద్ధ మవుతున్నారు. హైదరాబాద్‌ నుం చి మాత్రం ఒంగోలుకు రూ.890 నుంచి రూ.1,600వరకు ఆయా బస్సుల్లో సీట్ల ఖాళీను బట్టి వసూలు చేస్తున్నారు. అదే విధంగా బెంగళూరుకు రూ.670 నుంచిరూ.890 వ రకూ చార్జీలు ఉండగా ప్ర స్తుతం వందశాతం పెంచేశా రు. ఒంగోలు నుంచి విశాఖకు ఆయా బస్సులను బట్టి రూ.1,690 నుంచి రూ.2,700వరకూ చార్జీ ఉండ గా, ప్రస్తుతం పెరిగిన డిమాండ్‌తో రూ.2 వేల నుంచి రూ.3,500 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. తిరిగి పండుగ తర్వాత హైదరాబాద్‌, బెంగళూరు, తదితర ప్రాంతాలకు మళ్లీ చార్జీల మోత మామూలే.


ఆర్టీసీ 167 ప్రత్యేక బస్సులు 

సంక్రాంతి పండుగను పుర స్కరించుకుని జిల్లాలో ఆర్టీసీ  167 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఒంగోలు డిపో నుంచి 35,అద్దంకి డిపో నుంచి 20, చీరాల 18, గిద్దలూరు 16, కందుకూరు 28, కనిగిరి 19, మార్కాపురం డిపో నుంచి 21, పొదిలి నుంచి 10 ప్రత్యేక బస్సులను నడుపుతు న్నారు.  పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకు ని చార్జీలను ప్రస్తుత ధరకన్నా అదనంగా 50శాతం పెంచేశారు. 


పల్లెవెలుగుల కోసం పడిగాపులు 

పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణించేందుకు జిల్లాలో అధికశాతం ఆర్టీసీనే ఆధారం కావడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. పండుగ సందర్భంగా ఆర్టీసీ యంత్రాంగం కొన్నిప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయడంతో అప్పుడప్పుడూ వచ్చే పల్లెవెలుగుల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఒంగోలు నుంచి గ్రామాలకు, సమీపంలోని గుంటూరు, నెల్లూరు జిల్లాలోని గ్రామాలకు తరలివెళ్లేందుకు ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 


రైళ్లలో జనరల్‌ బోగీలులే అవస్థలు 

కొవిడ్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ బోగీ లను రద్దు చేసింది. ప్రయాణికులు తప్పనిసరిగా రిజర్వేషన్‌ చేసుకోవాలన్న నిబంధన పెట్టింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రత్యేకించి ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కావడం.. సీట్లన్నీ ఫుల్‌ కావడంతో కొందరు ప్రయాణికులు రిజర్వేషన్‌ లభిం చక, సొంతూర్లకు వెళ్ళే మార్గం లేక నానాఅవస్థలు పడుతున్నారు.




Updated Date - 2021-01-13T06:33:29+05:30 IST