ఆక్రమణ చెరలో గిన్నేకోయ చెరువు

ABN , First Publish Date - 2022-05-21T06:16:45+05:30 IST

సాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన గిన్నేకోయ చెరువు కాలక్రమేణా కనుమరుగవుతోంది.

ఆక్రమణ చెరలో గిన్నేకోయ చెరువు

  ఆయకట్టు ప్రశ్నార్థకం  

  చెరువు మట్టితో వైసీపీ నేతల వ్యాపారం

ఎ.కొండూరు, మే 19 : సాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన గిన్నేకోయ చెరువు కాలక్రమేణా కనుమరుగవుతోంది. ఎళ్ల తరబడి మరమ్మతులకు చోచుకోక సాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడాన్ని మట్టి మాఫియా అనుకూలంగా ఉపయోగించుకుంది. చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేసి జేబులు నింపుకొంటోంది. ఇందుకు అధికారులు సహకరిస్తున్నారు. 

మండలంలోని కేశ్యాతండా పంచాయతీ పరిధిలో గిన్నేకోయ చెరువును 35 ఎకరాల విస్తీర్ణంలో 100 ఎకరాలకు సాగునీరును అందజేయడం కోసం ఏర్పాటు చేశారు. ఈ చెరువు పూర్తిగా వర్షాధారంతో నిండుతుంది. ఒక్కసారి చెరువు నిండితే పంటలు సంవృద్ధిగా పండుతాయి. కానీ ప్రసుత్తం చెరువు సమీపంలోని కొందరు చెరువును అక్రమించి పంటలు, మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ప్రసుత్తం 8 ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఇక్కడ విలువైన మట్టిని అక్రమంగా ట్రాక్టర్‌లతో తరలిస్తూ తమ జేబులు నింపుకొంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులు సాగు కాలువల కంటే ఎక్కువగా లోతు తవ్వడంతో తూములకు నీరు అందడంలేదు. చెరువు అలుగు కోసం నిర్మించిన గోడను ధ్వంసం చేసి అక్కడ మట్టినీ తరలించారు. చెరువు మట్టి నాణ్యంగా ఉండటంతో దూర ప్రాంతానికి తరలించి లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకొంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మట్టి మాఫియాకు తహసీల్దార్‌ అండదండలు ఉండటంతో  ఫిర్యాదు చేసినా పట్టించుకోడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు నీటితో  పంట సాగు చేస్తున్నామని, ప్రస్తుతం సాగునీరు సక్రమంగా సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నామని గ్రామానికి చెందిన భరోతు పీక్లా నాయక్‌ వాపోయారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువు ఆక్రమణను తొలగించి, తూములు మరమ్మతు చేయాలని, మట్టి మాఫియాపైనా, అక్రమ రవాణాకు సహకరిస్తున్న తహసీల్దార్‌పైనా చర్యలు తీసుకోవాలని కోరారు.


Updated Date - 2022-05-21T06:16:45+05:30 IST