మేల్కొనకపోతే ముప్పే..!

ABN , First Publish Date - 2021-11-06T04:12:01+05:30 IST

అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు రైతుల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఆవేదన కమ్ముకుంది.

మేల్కొనకపోతే ముప్పే..!
కట్టపై ఏపుగా పెరిగిన కంపచెట్లు

చెరువు కట్టలు పటిష్ఠమేనా

ఆందోళనలో అన్నదాతలు

చోద్యం చూస్తున్న అధికారులు

వరికుంటపాడు, నవంబరు 3: అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలకు రైతుల్లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఆవేదన కమ్ముకుంది. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అఽధికంగా ఉండడంతో సాగునీటి వనరులపైనే వారి జీవనం ఆధారపడి ఉంటుంది. ఆ తరుణంలో జలాశయాలు, చెరువులకు నిండు కుండను తలపించేలా వరద నీరు చేరినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఏళ్లతరబడి నిర్మాణానికి నోచుకున్న కట్టలు బలహీన పడి దర్శనమిస్తున్నాయి. దీంతో వరద ఉధృతి రానున్న రోజుల్లో మరింత అధికమైతే చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. మూరుమూల మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో  ఈ ప్రభావం మరింత అధికంగా ఉంది. నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల్లో 276 చెరువులు ఉన్నాయి. అందులోను అత్యంత వెనుకబడిన వరికుంటపాడులోని 31 చెరువుల్లో సగభాగం పైబడి చెరువుల కట్టలు పటిష్టంగా లేకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. పురాతన కాలం నాటి కట్టలు కావడంతో అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా దారి పొడవునా అడవులను తలపించేలా పెరిగిన కంపచెట్లు భూమిలోకి చొచ్చుకొని పోయి కట్టలు బలహీనపడుతున్నాయి. ఏళ్ల తరబడి ఇలాంటి పరిస్థితే తలెత్తుతున్నప్పటికీ పట్టించుకొనే నాథులే కరువయ్యారు. కేవలం వర్షాకాలంలో చెరువు కట్టలు, తూములు దెబ్బతిన్న సమయాల్లోనే హడావిడిగా మొక్కుబడిగా పనులు చేపట్టి చేతులు దులుపుకొనే అధికారులు ఆపై కనిపించకుండా పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

నామమాత్రంగానే పనులు : ఈ ప్రాంత రైతుల వరప్రసాదినిగా చెప్పుకొనే గండిసాళెం, నక్కలగండి రిజర్వాయర్లు రైతులకు రెండు కళ్లు లాంటివి. వాటి పరిస్ధితి కూడా అధ్వానంగా మారడంతో రిజర్వాయర్లతో పాటు చెరువల కింద పంటలు సాగు చేసిన రైతులు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదకర సమాచారం వినాల్సివస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. రాతి కట్టడాలు పగుళ్లిచ్చి నెర్రలు బారడంతో పాటు తూములు సైతం మరమ్మతులకు నోచుకోక లీకుల రూపంలో నీరు వృఽథాగానే పోతుంది. స్థాయికి మించి జలకళ చేరితే అత్యవసర పరిస్థితుల్లో తూములు పని చేస్తాయో లేదోననే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఇటీవల జరిగిన ఆధునీకరణ పనులు సైతం నామ మాత్రంగా సాగడంతో సాగునీరు సమృద్ధిగా ముందుకు సాగడం ప్రశ్నార్ధకంగా మారింది. 

పర్యవేక్షణ లోపం: అభివృద్ధి పనుల సంగతి అటుంచితే ఇటుకబట్టీ వ్యాపారుల ఆగడాల పుణ్యమాని చెరువు కట్టల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడంతో చెరువు కట్టల ప్రాంతాల్లోని గ్రావెల్‌తో సహా కంపచెట్లను సైతం లోతుగా తొలగించడం ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి ప్రమాదాలు జరగక ముందే రిజర్వాయర్లు, చెరువు కట్టలతో పాటు తూములు, కాలువలకు మరమ్మతుపనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 




Updated Date - 2021-11-06T04:12:01+05:30 IST