చెరువులకు జలకళ

ABN , First Publish Date - 2021-11-07T04:21:41+05:30 IST

పొదలకూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ మెట్ట ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.

చెరువులకు జలకళ
జలకళను సంతరించుకుంటున్న చెరువులు

సాగుకు సమాయత్తమవుతున్న రైతులు


పొదలకూరురూరల్‌, నవంబరు 6 : పొదలకూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ మెట్ట ప్రాంతాల్లో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. మండలంలోని 30 పంచాయతీల్లో చిన్న,చితకా కలిపి మొత్తం 52 చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు వర్షాధారంగానే నిండాలి. ఈ నేపథ్యంలో ఈ యేడు అక్టోబరు నెలాఖరు వరకు ఈ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీనికి తోడు ఉన్న నీటిని చేపలసాగుతో బయటకు వదిలివేశారు. దీంతో చెరువులో నీరులేక ఈ ప్రాంతవాసులు ఆకాశం వైపు చూస్తున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. కొందరు ఇదివరకే బోర్ల కింద నార్లు పోసుకుని ఉన్నారు. ఇంకొందరు పొలాలను దమ్ము చేసుకుంటున్నారు. చెరువుల్లో నీరు తక్కువ ఉన్న వారు ఆరుతడి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.  దీనికి తోడు ఎంటీయూ 1010 రకం వరిని సాగు చేయవద్దని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఆ రైతులు ఉద్యాన పంటలు, కూరగాయల సాగు లాభదాయకమని అటువైపు అడుగులు వేస్తున్నారు. సాధారణంగా ఈ మెట్ట ప్రాంతంలో మొదటి నుంచి వరి సాగు తక్కువనే చెప్పాలి. మెట్ట పైర్లు సాగు చేసే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అధిక శాతం నిమ్మతోటలు సాగు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-07T04:21:41+05:30 IST