Royal London One-Day Cup 2022: చెలరేగుతున్న పుజారా.. వరుసగా రెండో సెంచరీ

ABN , First Publish Date - 2022-08-15T01:30:53+05:30 IST

ఫామ్ లేమితో తంటాలు పడుతూ టీమిండియాలో స్థానం కోల్పోయిన టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అదరగొడుతున్నాడు

Royal London One-Day Cup 2022: చెలరేగుతున్న పుజారా.. వరుసగా రెండో సెంచరీ

హోవ్: ఫామ్ లేమితో తంటాలు పడుతూ జట్టులో స్థానం కోల్పోయిన టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా వరుస సెంచరీలతో విరుచుకుపడుతున్నాడు. ఈ నెల 12న వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 బంతుల్లో 107 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు, ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 22 పరుగులు పిండుకున్నాడు. 


తాజాగా మరోమారు బ్యాట్ ఝళిపించిన పుజారా శతకబాదాడు. సర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఆదివారం మరో అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ టామ్ హైనెస్ గైర్హాజరీతో సారథ్య బాధ్యతలు చేపట్టిన పుజారా  కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఔరా అనిపించాడు. 3.2 ఓవర్లలో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వేళ క్రీజులోకి వచ్చిన పుజారా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు.


క్రీజులో పాతుకుపోయిన తర్వాత జోరు పెంచాడు. మూడో వికెట్‌కు ఏకంగా 205 పరుగులు జోడించాడు. పుజారాకు అండగా ఉన్న టామ్ క్లార్క్ కూడా సెంచరీతో రాణించాడు. 106 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. క్లార్క్ అవుటయ్యాక పుజారా మరింతగా చెలరేగిపోయాడు. 103 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న పుజారా ఆ తర్వాత బంతిని చితకబాదాడు. 28 బంతుల్లోనే 74 పరుగులు రాబట్టాడు. పుజారా దెబ్బకు స్కోరు పరుగులు పెట్టింది. మ్యాచ్ ఆగే సమయానికి ససెక్స్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. 

Updated Date - 2022-08-15T01:30:53+05:30 IST