చెత్త సేకరణకు కమిటీలు

ABN , First Publish Date - 2020-12-03T02:39:47+05:30 IST

తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీలో కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు.

చెత్త సేకరణకు కమిటీలు
వాహనాల్లో చెత్తను వేస్తున్న పట్టణవాసులు

పాలమూరులో వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు

తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడంపై ప్రజలకు అవగాహన

ప్రతి వారం నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 2: తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీలో కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ నేప థ్యంలో పురపాలికలోని వార్డుల్లో కమిటీలను వేశారు. ఈ కమిటీలు వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ, తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలని అవగాహన కల్పించ నున్నాయి. చెత్త సేకరణపై ప్రతివారం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు కమిటీలు నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.


రెండు విడతలుగా బుట్టల పంపిణీ

తడి, పొడి చెత్త వేసేందుకు మునిసిపాలిటీలో ఇంటింటికి రెండు విడతలుగా వేర్వేరు బుట్టలను పంపిణీ చేశారు. కానీ ప్రజల్లో ఆశించిన స్థాయిలో చైతన్యం రావడం లేదు. చాలా మంది చెత్తను వేరు చేయకుండానే ఇస్తున్నారు. దాంతో సేకరించిన చెత్తను పురపాలిక సిబ్బంది వేరు చేసి, పొడి చెత్తను టీడీగుట్టలోని డీఆర్‌సీసీకి, తడి చెత్తను డంపింగ్‌ యార్డ్‌లోని వర్మి కంపోస్ట్‌కు తరలిస్తున్నారు. అయితే ఇదంతా ఇబ్బందికరంగా మారుతుండటంతో ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల సిబ్బందికి శ్రమ తగ్గుతుందని, తద్వారా వారిని ఇతర పనులకు వినియోగించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 


49 కమిటీలు

తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించేందుకు పురపాలికలోని 49 వార్డులలో వార్డుకు ఒక కమిటీని వేశారు. ఒక్కో వార్డుకు 4-5 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీకి వార్డు కౌన్సిలర్‌ చైర్మన్‌గా ఉంటారు. ఒక్కో వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. కమిటీ సభ్యులు తమకు కేటాయించిన వార్డులో ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను ఎలా వేరుచేసి ఇవ్వాలో అవగాహన కల్పిస్తారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లకు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ప్రతివారం వార్డు అధికారి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్సెస్‌ అయితే పురపాలికలో చెత్త సేకరణ సమస్య మెరుగు కానుంది.

Updated Date - 2020-12-03T02:39:47+05:30 IST