Advertisement

చెత్త సేకరణకూ ‘చార్జ్‌’!

Mar 5 2021 @ 23:42PM

నెల్లూరులో వ్యాపారులపై మరోభారం

నెలకు  కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.వేలల్లో..

కార్పొరేషన్‌ తీరుపై ఆగ్రహం

ఇదే అదునుగా శానిటరీ సిబ్బంది చేతివాటం


నెల్లూరు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోకనే ఏప్రిల్‌ నుంచి ఇంటి పన్నులు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది చాలదన్నట్టు మరోభారం మోపేందుకు నెల్లూరు నగరపాలక సంస్థ సన్నద్ధమైంది. వ్యాపార దుకాణాలలో చెత్త సేకరణకు యూజర్‌ చార్జీల పేరుతో నగదు వసూలు చేయనున్నారు. కూల్‌డ్రింక్‌ షాపు నుంచి పెద్ద కల్యాణ మండపాల వరకు అన్ని కమర్షియల్‌ దుకాణాలపై యూజర్‌ చార్జీలు వేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వసూళ్లు మొదలైపోయాయి. ప్రాంతం, వ్యాపారాన్ని బట్టి చదరపు అడుగు చొప్పున యూజర్‌ చార్జీలు నిర్ణయిస్తున్నారు. ఒక్కో దుకాణానికి నెలకు కనీసం రూ.500 వరకు చార్జ్‌ చేస్తుండగా, గరిష్ఠంగా రూ.వేలల్లోనే వసూలుకు పూనుకుంటున్నారు.


వ్యాపారుల్లో ఆగ్రహం


ఇటు రెసిడెన్షియల్‌ అటు కమర్షియల్‌ దుకాణాల నుంచి కార్పొరేషన్‌ ఏటా రూ.వేలు, రూ.లక్షల్లోనే వివిధ రకాల పన్నులు వసూలు చేస్తోంది. వీటి ద్వారానే చెత్తను కూడా సేకరిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా చెత్త సేకరణకు డబ్బులివ్వాలంటూ ఆదేశిస్తుండటంపై వ్యాపార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ప్రతి దుకాణం వద్దకు వచ్చి చెత్త సేకరిస్తారా!? అంటే అదీ లేదని, ఇప్పటి వరకు ఉన్న మాదిరిగానే యథావిధిగా డస్ట్‌బిన్ల వద్దకు తీసుకెళ్లి చెత్త వేయాల్సిందేనని చెబుతున్నారు. అక్కడి నుంచి కార్పొరేషన్‌ సిబ్బంది వాహనాల్లో తీసుకెళుతున్నారని, మరి కొత్తగా యూజర్‌ చార్జీలు ఎందుకు విధిస్తున్నారంటూ వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే కార్పొరేషన్‌ అధికారులు మాత్రం చెత్తను రోడ్లపై వేస్తున్నారని, దానిని నిర్మూలించడానికే యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 


అప్పట్లో రద్దు చేసినా..


2017లోనే యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని కౌన్సెల్‌ లో తీర్మానం చేశారు. అయితే నగర ప్రజల ఆర్థిక స్థితిగతులు, వ్యాపార పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్పట్లో యూజర్‌ చార్జీల వసూళ్ల నిర్ణయాన్ని నిలిపేశారు. కానీ ఇప్పుడు ఆ తీర్మానాన్ని తెరమీదకు తీసుకొచ్చి వసూళ్లు మొదలు పెట్టడం గమనార్హం. 


కంచే చేను మేస్తే...


ఈ వసూళ్ల బాధ్యతను శానిటరీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. దీనిని అదునుగా చేసుకొని పలుచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఏదైనా పన్ను వసూలు చేయాలంటే ముందుగా డిమాండ్‌ నోటీసో లేక అధికారికంగా ఏదైనా రసీదునో ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ఏమీ లేకుండా వసూలు చేస్తున్నారు. బీవీనగర్‌ ప్రాంతంలో ఇప్పటికే వసూళ్లు ప్రారంభించగా రసీదులు అడిగిన వ్యాపారులకు తర్వాత ఇస్తామంటూ శానిటరీ సిబ్బంది సమాధానమిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నగరంలో అధికారికంగా సుమారు 10 వేల ట్రేడ్‌ లైసెన్స్‌లున్నాయి. వీటిలో గరిష్ఠ దుకాణాల నుంచి యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన ప్రతి నెలా పదుల లక్షల రూపాయల్లో కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరనుంది. అయితే ట్రేడ్‌ లైసెన్స్‌ లేని దుకాణాల నుంచి కార్పొరేషన్‌ సిబ్బంది అనధికారికంగా వసూలు చేసుకునే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఇది పాత నిర్ణయమే 

నగరంలో చెత్త సేకరణకు యూజర్‌ చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయం పాతదే. 2017లోనే కౌన్సెల్‌లో దీనిపై తీర్మానించారు. ఇప్పుడు అమలు మాత్రమే చేస్తున్నాం. కేవలం నిర్ణయించిన వ్యాపార దుకాణాలకు మాత్రమే చార్జీలు వేస్తున్నాం. రోడ్లపై చెత్త లేకుండా చేయడం ప్రధాన ఉద్దేశ్యం. 

- వెంకటరమణ, మున్సిపల్‌ హెల్త్‌ అధికారి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.