చెత్త సంపదకు.. చిక్కులు

ABN , First Publish Date - 2021-10-06T05:26:54+05:30 IST

గ్రామాల్లో చెత్తను సేకరించి సంపద తయారు చేసేందుకు గ్రామస్థాయిలో చెత్తనుంచి సంపద కేంద్రాలు ఏర్పాటు చేశారు.

చెత్త సంపదకు.. చిక్కులు
యడ్లపాడు మండలం జగ్గాపురంలో నిరుపయోగంగా చెత్తనుంచి సంపద తయారీ కేంద్రం

 నిరుపయోగంగా పలు కేంద్రాలు 

రూ.లక్షలతో నిర్మించి వదిలేశారు

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా..

పల్లెల్లో రోజురోజుకు క్షీణిస్తోన్న పారిశుధ్యం 

రోడ్ల వెంటే పేరుకుపోతున్న చెత్తాచెదారాలు

నెలల తరబడి గ్రీన్‌అంబాసిడర్లకు అందని వేతనాలు


గత ప్రభుత్వం చెత్త నుంచి సంపద సృష్టిద్దామన్నది.. ప్రస్తుత ప్రభుత్వం పన్నుల పేరిట బాదేస్తోంది. పల్లె పట్టణం పేద గొప్ప అన్న తేడా లేకుండా ఇంటింట చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చెత్తసేకరణ కేంద్రాలపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ఈ కేంద్రాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు మారాయి. పారిశుధ్యంపై దృష్టి చూపకపోవడంతో గ్రామీణ రహదార్లు, పట్టణ శివారు ప్రాంతాలు డంపింగ్‌ యార్డులుగా మారిపోయాయి.  రిక్షాలు, ట్రాక్టర్‌లు, చెత్త బుట్టలు సమకూర్చినప్పటికీ గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించకపోవడంతో ఇంటింట చెత్త సేకరణకు చిక్కులు ఏర్పడ్డాయి. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చెత్తసేకరణ కేంద్రాలను పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రేకులు, తలుపులు, ఫ్లోరింగ్‌ ధ్వంసమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన చెత్తసేకరణ కేంద్రాలపై దృష్టిసారించి గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి వ్యాధుల బారిన పడకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 


పారిశుధ్యం.. అధ్వానం

గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు అలంకారప్రాయంగా మారడంతో గ్రామాల్లో వ్యర్థాల నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో అపరిశుభ్రత తాండవిస్తోంది. దోమలు స్వైరవిహారం చేస్తూ ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.  గతంలో వలే వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పడవేయడం, తగలబెట్టడం చేస్తున్నారు. కాల్వలలోనూ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం చెత్తసేకరణ చేస్తున్నప్పటికీ గ్రామాల్లో మాత్రం పారిశుధ్యం అధ్వానంగా ఉంది. గ్రామాల్లో ఎక్కడిచెత్త అక్కడ నిల్వ ఉండటం.. ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో అంటురోగాలు, విష జ్వరాలు ప్రబలుతున్నాయి.  ఇంటింట చెత్తసేకరణకు నియమించిన పారిశుధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు విడుదల కాకపోవడంతో స్వచ్ఛ లక్ష్యం నీరుగారింది. 

 

 (ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

  గ్రామాల్లో చెత్తను సేకరించి సంపద తయారు చేసేందుకు గ్రామస్థాయిలో చెత్తనుంచి సంపద కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకవైపు గ్రామాన్ని పరిశుభ్రం చేసి ఆ చెత్తతో బలవర్థకమైన వర్మీ కంపోస్ట్‌ తయారు చేసేందుకు అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను, ప్లాస్టిక్‌ను నివారించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చించి మిషనరీ ఏర్పాటు చేసినా దానిని వాడకలోకి తీసుకువచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. పల్లెల్లో చెత్త సంపద కేంద్రాలు చతికిల బడ్డాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన కేంద్రాలను పట్టించుకునే నాధుడు లేక బీటలు వారిపోయాయి. కొన్ని గ్రామాల్లో అవి ఉన్నాయో లేవో కూడా తెలియదు. నిరుపయోగంగా ఏళ్ల తరబడి ఉండటంతో చాలా కేంద్రాలు పాడై పోయాయి. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఈ కేంద్రాలపై దృష్టి సారించలేదు.  అక్కడక్కడ ఈ కేంద్రాలు పని చేస్తున్నా తడి, పొడి చెత్తను వేరు చేయకుండా కలిపి వేయటంతో ఎరువులు సరిగా తయారు కావడంలేదు. చెత్తసేకరణ కేంద్రాల్లో కనీసం వాచ్‌మెన్‌ కూడా లేకపోవడంతో అవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పేకాట, మందుబాబులకు నిలయాలుగా మారాయి.    ప్రతి గ్రామపంచాయతీలో 250 కుటుంబాలకు ఒక గ్రీన్‌ అంబాసిడర్‌ను నియమించారు. వారికి నెలకు రూ.6 వేలు చొప్పున వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే కొన్ని నెలలుగా గ్రీన్‌ అంబాసిడర్‌లకు జీతాలు అందడంలేదు. అధికారుల నిర్లక్ష్యంతో చెత్త సంపద కేంద్రాలను ఆచరణకు నోచుకోవడం లేదు.

- పొన్నూరు మండలంలోని 29  గ్రామాలకు 26 షెడ్లు నిర్మించారు. వాటిలో 18 షెడ్లు మరమ్మతులకు చేరుకోగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌  కింద రూ.కోటి 2 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. మండలంలో 77 ట్రైసైకిళ్లకు 72 మాత్రమే పనిచేస్తున్నాయి.  

- చిలకలూరిపేట మండలంలో మురికిపూడి, దండమూడి గ్రామాలలో మాత్రమే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. యడ్లపాడు మండలంలో 5 గ్రామాలలో అరకొరగా పనిచేస్తున్నాయి. చిలకలూరిపేట మునిసిపాలిటీలో తడి, పొడి వ్యర్థాల సేకరణ వేరుగా జరగడంలేదు.

- తెనాలి మున్సిపాలిటీతో పాటు తేలప్రోలు, పెదరావూరు, అంగలకుదురు, కొలకలూరు, నందివెలుగు గ్రామాల్లో డంపింగ్‌ కేంద్రాల్లో చెత్తకొండల్లా చేరాయి. నాజరుపేట, నందులపేట, కొత్తపేట, బుర్రిపాలెం ప్రాంతాల్లో రోడ్లపైనే చెత్త కుప్పలు పేరుకుపోయిఉంటున్నాయి.  

- రేపల్లె మండలంలో 28 పంచాయతీలకు  ఐదు మాత్రమే సంపద కేంద్రాలు నిర్మించగా అవి కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. నగరం మండలంలో 26 పంచాయతీలకు 20 కేంద్రాలకు స్థల సేకరణ జరిగింది. నగరంలో కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చినా ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదు.   

- తాడికొండ మండలంలో పొన్నెకల్లు, లాం, మోతడక గ్రామాల్లో మాత్రమే చెత్త సంపద తయారీ కేంద్రాలు పని చేస్తున్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమి, హరిశ్చంద్రాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలు అక్కరకు రావటం లేదు. ఫిరంగిపురం మండలంలో 17  గ్రామాల్లో సంపద కేంద్రాలకు షెడ్లు మాత్రమే వేశారు.

- బాపట్ల నియోజకవర్గంలో 59 పంచాయతీలకు జమ్ములపాలెం, తూర్పుబాపట్లలో మాత్రమే చెత్త నుంచి సంపద కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాపట్ల మండలంలోని ఏడు పంచాయతీలు పట్టణంలో కలుస్తుండటంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలు చెత్తాచెదారంతో క్షీణించి పోతున్నాయి.

- పెదనందిపాడులో పంచాయతీలో సేకరించిన చెత్తంతా సిబ్బంది రోడ్డుపక్కనే వేస్తున్నారు.  

-  పెదకూరపాడు మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో, అమరావతి మండలంలోని ఏడు గ్రామాల్లో, అచ్చంపేట మండలం, క్రోసూరు మండలాల్లో చెత్తసంపద కేంద్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. 

- తుళ్లూరు మండలంలో రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు తప్పుపట్టిపోతున్నాయి. గత ప్రభుత్వం పారిశుధ్యానికి అధిక ప్రాఽధాన్యం ఇవ్వగా ఇప్పటి ప్రభుత్వం విస్మరించింది.  

- సత్తెనపల్లి మండలంలో 24 గ్రామాల్లో చెత్తసంపదకేంద్రాలు నిర్మించగా వాటిలో ఐదారు గ్రామాల్లో మాత్రమే చెత్తసేకరణ అంతంతమాత్రంగా జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో చెత్తసంపదకేంద్రాల షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.  రాజుపాలెం మండలంలో 11 గ్రామాల్లో నిర్మించిన కేంద్రాలు నిరూపయోగంగా ఉన్నాయి.

- పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, మాచవరం మండలాల పరిధిలో 57 గ్రామ పంచాయతీలకు 40 గ్రామాల్లో చెత్తసంపద కేంద్రాలు నిర్మించారుకాని వినియోగించడంలేదు. 

  

Updated Date - 2021-10-06T05:26:54+05:30 IST